బెంగళూరు డ్రగ్స్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తెలంగాణలోని ఓ పార్టీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు ఈ కేసులో ఇన్వాల్వ్ అయినట్లు కర్ణాటక పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి సదరు నేతలకు నోటీసులు అందించినట్లు తెలిసింది. నోటీసులు అందుకున్న వారిలో ఇద్దరు వ్యక్తులు విచారణకు హాజరు కాగా, ఓ ఎమ్మెల్యే గైర్హాజరు అయ్యారని సమచారం. ఈ కేసుతో ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు, ఓ ఎమ్మెల్సీ, ఓ మంత్రి కొడుకు, ఇద్దరు ఎమ్మెల్యేల కొడుకులకు సంబంధమున్నట్లు బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గుర్తించారు.
కాగా డ్రగ్స్ వినియోగానికి సంబంధించి గతవారం బెంగళూరులోని ఓ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అక్కడినుంచి ఈ కేసు క్రైమ్ బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ అయింది. అనంతరం దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, ఈ కేసుకు సంబంధించి అనేక పేర్లు సేకరించినట్లు తెలిసింది. ఇందులో ప్రధానంగా ప్రముఖుల పేర్లు ఉన్నట్లు, అందుకు సంబంధించి విచారణ కూడా చేపట్టినట్లు సమాచారం.
వన్ లవ్ కోడ్..
వన్ లవ్ ‘ కోడ్ తో డ్రగ్స్ సప్లై అయినట్లు పోలీసులు గుర్తించారు. బెంగళూరు వీకెండ్ పార్టీ పేరుతో ఈవెంట్ నిర్వహించినట్లు.. ఈ పార్టీలో రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిధులతో పాటు, కొందరు ప్రముఖులు హాజరయ్యే వారిని పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. పార్టీలకు సెలెక్టెడ్ పర్సన్స్ మాత్రమే ఇన్వైట్ చేసేవారిని.. బెంగళూరు, హైదరాబాద్ పబ్స్ అడ్డాగా పార్టీలు జరిగినట్లు తెలిసింది.