KCR: కేసీఆర్ 3.0

KCR: కేసీఆర్ 3.0

KCR:

కేసీఆర్ కోలుకున్నట్టున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల రోజున ఒంటికి తగిలిన గాయం నుంచి ఇదివరకే కోలుకున్నా, రాజకీయ గాయం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నట్టున్నారు. ఇటు కాంగ్రెస్ అటు బీజేపీలకు ఇప్పుడొక గట్టి హెచ్చరిక నోటీస్ జారీ చేశారు. ఇరువురికీ సమదూరం పాటించే పోరాట రాజకీయ పంథా ప్రకటించారు. విషాన్ని గొంతుకలో నిలుపుకున్న గరళకంఠుడ్ని అని చెబుతూ.. ఏ క్షణాన్నయినా బద్దలయే అగ్నిపర్వతంలా ఉన్నానన్నారు. లిక్కర్ కేసులో అరెస్టయి తీహార్ జైళ్లో ఉన్న కూతురు కవిత పరిస్థితిపై తీవ్రంగా కలత చెందుతున్నట్టు ఆయన భావోద్వేగం స్పష్టం చేస్తోంది. ఎప్పుడు ఎలా వ్యవహరించాలో తనకు తెలుసన్నారు. ‘‘పార్టీ సమగ్ర కార్యాచరణ ప్రణాళిక’’ రూపొందిస్తున్నట్లు చెప్పారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ముందు, తన పార్టీ ‘భారత్ రాష్ట్ర సమితి’ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలనుద్దేశించి ఆయన చేసిన ప్రసంగంలో… అంతర్లీనంగా ఎంతో రాజకీయ సందేశం ఇమిడి ఉంది.

 

భారత రాష్ట్ర సమితిని తిరిగి తెలంగాణ రాష్ట్ర సమితిగా మార్చినా, మార్చకపోయినా… వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి పార్టీలో జవజీవాలు నింపి, కొత్త రూపునివ్వడానికి అధినేత కేసీఆర్ సిద్దమయ్యారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తాను స్వయంగా పాల్గొనాలని నిర్ణయించిన ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పే ప్రతి మాట, తీసుకునే ప్రతి నిర్ణయాన్నీ రాజకీయంగా ఎదుర్కోవాలనుకుంటున్నారు. వీలయిన ప్రతి కోణంలో సర్కారును ఎండగట్టేందుకు సిద్దమయ్యారు. ‘ఏడెనిమిది నెలలు నిరీక్షించాం, ఇక చాలు…. హానీమూన్ సమయం ముగిసింది, పాలనలో ఎక్కడా ఏదీ కుదురుకోవడం లేదు, ప్రజాపక్షం వహించి పోరాడటమే సత్వరం అనుసరించాల్సిన మార్గమనే సందేశాన్ని ఆయన తన పార్టీ శ్రేణులకిచ్చారు. ఈ లోపున… అన్ని స్థాయిల్లో పార్టీని పటిష్టపరిచే కసరత్తు చేపట్టారు. ఆ పని తనకేమీ కొత్త కాదనీ, ఇదివరకు ఎన్నోసార్లు చేసినట్టే, సరికొత్త నాయకత్వాన్ని తయారుచేసుకుందామంటూ నమ్మకం కలిగించేలా మాట్లాడారు. పార్టీ నాయకులు, కార్యకర్తల శ్రేణులు డస్సిపోకుండా ఉండేందుకు ఇలాంటి అనునయింపు మాటలు కేసీఆర్ ఇదివరకెన్నోమార్లు చెప్పినా… ఇప్పుడు చెబుతున్న మాటలు కాస్త భిన్నంగా ఉన్నాయి. బయట ప్రచారంలో ఉన్న పలు ఊహాగానాలకు తెరదించుతూ, రాజకీయంగా తన పంథా ఎలా ఉండబోతోందో స్పష్టమైన సందేశమే ఇచ్చారాయన. అసెంబ్లీ, లోక్సభ… రెండు ఎన్నికల్లోనూ పార్టీకి తగిలిన ఎదురుదెబ్బకు బీఆర్ఎస్ చతికిల పడిపోయి ఉన్న తరుణంలో ఏదేదో ప్రచారంలోకి వచ్చింది. ఇక బీఆర్ఎస్ పార్టీ నిలువదని, బీజేపీతో పొత్తు పెట్టుకుంటారని, ఇంకో అడుగు ముందుకేసి… ఏకంగా పార్టీని బీజేపీలో విలీనం చేసేస్తారని…. సగటు మనిషి ఊహకు సాధ్యమైనంతా ప్రచారంలోకి వచ్చింది. తన ఉద్వేగాన్ని, ఉద్రేకాన్ని, రాజకీయ పరిణతిని మేళవిస్తూ విధాన ప్రకటన చేసి ఒకరకంగా ప్రచార పుక్కిటి పురాణాలకు ఆయన తెరదించారు.

 

 

బీజేపీతో యుద్దానికే సిద్దం..

‘కన్న కూతురు జైళ్లో ఉంటే ఏ తండ్రికి బాధ ఉండదు?’ అని ప్రశ్నిస్తూ… ఎన్నో విషయాలను మనసులో దిగమింగుకుంటున్నానని, సమయం వచ్చినపుడు ఏది ఎలా చేయాలో తనకు బాగా తెలుసనీ కేసీఆర్ స్పష్టం చేశారు. తనను ఎదుర్కోలేకే ఇలా చేశారనీ బీజేపీ నాయకత్వాన్ని విమర్శించారు. రాజకీయ పరిభాష తెలిసిన వాడు కనుక, తద్వారా ఆయనొక సందేశం ఇచ్చినట్టు తేటతెల్లమౌతోంది. ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ… రెంటికీ సమదూరం పాటించడం ద్వారా ప్రజాక్షేత్రాన్ని ఎదురులేకుండా దున్నుకోవచ్చని ఆయనకు తెలుసు. రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాలు తప్పక విఫలమవుతాయని, తద్వారా విపక్షంగా ప్రజల మనసు గెలవటానికి బీఆర్ఎస్కు పుష్కలమైన అవకాశాలుంటాయన్నది ఆయన గట్టి నమ్మకం. అదే విషయం పార్టీ నాయకులకు వివరిస్తూ… ‘నిజమైన విపక్షస్థానం, ప్రజా హృదయాలలో స్థానం మనకే దక్కుతుంది, కనుక శషబిషలు లేకుండా పార్టీలో పనిచేసుకుంటూ వెళ్తే రాజకీయంగా ఎదుగుదలకు మున్ముందు గొప్ప అవకాశాలుంటాయి’ అనే సందేశం పార్టీ శ్రేణులకు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యేలుగా ఎదగడానికీ విపక్షమే సరైన స్థానమని ఉద్బోధించారు. అందుకే, ‘వెళ్లిన వాళ్లు ఏం నష్టపోయారో వారికి తర్వాత తెలుస్తుంది’ అని తన మనసులోని మాట చెప్పారు. ‘వారికి ఏం తక్కువ చేశామని వెళ్లారు? మనం రెండు, మూడు పదవులు ఇచ్చిన వారు కూడా వెళ్లారు. సరే, వారి ధర్మం అలా ఉంది’ అంటూ వెళ్లినవారిని, మిగిలిపోయిన తన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ముందు తప్పుబట్టారు. అలా వలస వెళ్లిన ప్రజాప్రతినిధుల సభ్యత్వం రద్దు చేయించే న్యాయప్రక్రియ కొనసాగుతుందనీ చెప్పారు. ఒక పచ్చి నిజాన్ని వివరించే క్రమంలో ఇంకో వాస్తవాన్ని పరోక్షంగా అంగీకరించారు కేసీఆర్! ‘లోగడ అందరూ వెళ్లిపోయి… ఆరుగురు ఎమ్మెల్యేలే మిగిలినా కాంగ్రెస్ను ప్రజలు గెలిపించలేదా?’ అని ప్రశ్నించారు. పార్టీ సంక్షోభం ఎదుర్కొంటోంది అంటేనో, ఇక్కట్లలో ఉందనే మాటనో అంగీకరించని ఆయన, పార్టీ పటిష్టమైన స్థితిలో ఉందని ఉద్ఘాటించారు.

 

చరిత్ర చెప్పేదే సత్యం..

రాజకీయ పరిస్థితులపై మీడియా ఊహాగానాలు సహజమే! కానీ, వాటిని తదనంతర రాజకీయ సంఘటనలో, పరిణామాలో ధృవపరచాలి. అందుకు కొంత సమయం పడుతుందంటే, కనీసం గత చరిత్రయినా సదరు వాదనను బలపరిచేలా ఉండాలి. బీఆర్ఎస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీతో కలిసి వెళుతుందంటేనో, ఏకంగా అందులో విలీనం అవుతుందంటేనో నమ్మదగ్గ ఆధారాలేవీ చరిత్రలో లేవు. అందుకు పూర్తి వ్యతిరేక పంథాను రుజువుచేసే చారిత్రక ఆధారాలే ఎక్కువ! వేర్వేరు సందర్భాల్లో వివిధ పార్టీలతో కేసీఆర్ చేతులు కలిపి కూటములు ఏర్పరచినా…. బీజేపీతో ఎన్నడూ కలిసి నడవలేదు. బీజేపీని వ్యతిరేకించే మజ్లీస్ (ఎం.ఐ.ఎం) వంటి పార్టీలతో అంటకాగిన చరిత్ర ఉంది. కాంగ్రెస్, టీడీపీ, కమ్యూనిస్టులు… ఇలా ఎవరితోనైనా సఖ్యత నెరపిఉండొచ్చు, కానీ, బీజేపీ వైపు మాత్రం ఎప్పుడూ చూడలేదు. ఉద్యమ కాలంలోనూ వామపక్ష భావజాలం ఉన్న నాయకులు, సామాజికవేత్తలు, మేధావులు కలిసినంత సహజంగా కేసీఆర్తో గాని, ఆయన నేతృత్వం వహించిన పార్టీ-కూటములతో కానీ బీజేపీ-ఆరెస్సెస్, హిందుత్వ భావజాలపు ముఖ్యులెవరూ కలిసిన దాఖలాలు లేవు. ఎంతో కొంత బీజేపీ పాత వాసనలతో వచ్చి బీఆర్ఎస్ (నాటి టీఆర్ఎస్) లో చేరిన, చేతులు కలిపిన ఆలె నరేంద్ర, విజయశాంతి వంటి వారిని కూడా కేసీఆర్ దీర్ఘకాలం తనతో ఉంచుకోలేదు. పంపించడమో, వారంతటవారే వెళ్లిపోవటమో జరిగింది. రెండోసారి ముఖ్యమంత్రిగా (1999-2004) చంద్రబాబు అయిదేళ్ల ప్రజావ్యతిరేక పాలనలో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కష్టాల కొలిమిలో సలసల కాగింది. కల్లోల సామాజిక వాతావరణం ఊపిరులూదితే పుట్టిన ఉద్యమానికి కేసీఆర్ శీర్షభాగాన ఉన్నారు. భావజాలపరంగా కూడా 2001 కి పూర్వం-తర్వాత రైటిస్టుల కన్నా లెఫ్ట్ నేపథ్యం ఉన్నవారే తెలంగాణ వాదనతో నిలబడటం, కార్యక్రమాల నిర్వహణ, పార్టీ స్థాపించి కేసీఆర్ అదే పంథా ఎంచుకోవడం….ఇవన్నీ సరళరేఖీయంగా జరిగాయి. ‘దేవత’ అన్న సోనియాగాంధీనే ‘దెయ్యం’ అని తూలనాడినా కాంగ్రెస్తోనే తప్ప బీజేపీతో ఏ సఖ్యత-వైరమూ కేసీఆర్కు ఏనాడూ లేవు. ప్రత్యేక రాష్ట్రం సాధనకై నలుగుతున్న రోజుల్లోనూ, అంతకు ముందు 3 రాష్ట్రాలిచ్చిన చరిత్ర ఉంది కదా అని, బీజేపీ వైపు మొగ్గిన వాసన కూడా కేసీఆర్కు అంటలేదు. కేసుల నుంచి బిడ్డ కవిత విముక్తి కోసం కేసీఆర్ బీజేపితో లాలూచీ పడటమో, తన పార్టీని విలీనం చేయడమో జరుగొచ్చన్నది కూడా ఓ ఊహ-అంచనా మాత్రమే అని తేటతెల్లమైంది. తాజా ప్రకటన ఆ దిశలో మరో సాక్ష్యం మాత్రమే!

 

 

ఫక్తు రాజకీయపక్షి
ఒక చంద్రబాబులా, ఒక వైఎస్సార్ లాగా కేసీఆర్ ఫక్తు రాజకీయ పక్షి! భవిష్యత్ పరిణామాలు, రాజకీయంగా లాభనష్టాలను బేరీజు వేసుకోకుండా ఆయన ఏ పనీ చేయరు. సందర్భం వస్తే… కోపతాపాలు, వ్యక్తిగత రాగద్వేషాలను కూడా పక్కనపెట్టి భవిష్యత్ రాజకీయ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తారు. బీజేపీతో కలిసి ప్రయాణం అంటే ఆయన అలాగే ఆలోచిస్తారు. ఎన్నికల్లో ఓడిన ఏడునెలల తర్వాత ఆయనో నిర్ణయానికి వచ్చారు. రాజకీయ దృక్పథాన్ని వెల్లడిరచారు. ఆయనకు రాజకీయంగా సీనియర్ సహచరుడైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవలి మళ్లీ అధికారంలోకి వచ్చి, ‘1995 నాటి చంద్రబాబును చూస్తారు’ అని ప్రకటించారు. మరి, రాబోయే రోజుల్లో తెలంగాణ సమాజం ఎటువంటి కేసీఆర్ను చూస్తుంది? అన్నది ప్రశ్న! కుటుంబ రాజకీయాల నుంచి ఏమేరకు ఆయన బయటపడుతారు, కనీసం తనయుడు, తనయలను ఎంతవరకు దూరం ఉంచుతారు అన్నది కీలకమవుతుంది. పద్నాలుగేళ్ల ఉద్యమ నేతృత్వంలో ఒక కేసీఆర్ను చూసిన రాష్ట్ర ప్రజానీకం పదేళ్ల పాలనలో మరో కేసీఆర్ను చూశారు. సాధారణ ఊహల్ని పటాపంచలు చేస్తూ దూసుకువస్తున్న సరికొత్త కేసీఆర్ 3.0 ఎలా ఉంటారు? ఇది కాలం నిర్ణయించాల్సిందే!

=====================

dilip reddy
-దిలీప్ రెడ్డి,
పొలిటిల్ ఎనలిస్ట్, పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ.