Nancharaiah merugumala senior journalist:
భోగమోని సురేశ్ అనే యువకుడికి ఎక్కడ లేని విస్తృత ప్రచారం!కలెక్టర్ కారద్దాలు పగిలితే కరంటు ఆగింది, ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి!
ఉత్తరాది, మణిపూర్‌తో పోల్చితే..తెలంగాణ సర్కారు ‘హైపర్ సెన్సిటివ్’ అయింది.
తెలంగాణ రాష్ట్రం–వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో సోమవారం జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, రెవెన్యూ అధికారులపై స్థానిక ఊళ్ల జనం జరిపిన దాడిలో ఒక్కరూ కన్నుమూయ లేదు. ఎవరి తలా పగల్లేదు. ఏ ఒక్కరి కాలూ విరగ లేదు. చివరికి ఒక్క బొట్టు రక్తం కూడా చిందలేదు. సమీపంలో నిర్మించ తలపెట్టిన ఔషధాల ఫ్యాక్టరీ కోసం తమ పంటభూములు బలవంతంగా లాక్కుంటారనే కోపంతో రాష్ట్ర సర్కారు ఉద్యోగులు, అధికారులపై గ్రామస్తులు దాడికి దిగి, సిబ్బందిని తరిమికొట్టారు. భూసేకరణపై స్థానిక ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడానికి వచ్చిన జిల్లా కలెక్టర్‌ను కూడా జనం చుట్టుముట్టడంతో హడావుడిగా ఆయన కారెక్కి పారిపోవాల్సివచ్చిందని మీడియా వార్తలు చెబుతున్నాయి. లంబాడాలు అనే అనుసూచిత తెగ (ఎస్టీలు)కు చెందిన మనుషులు ఎక్కువ మంది ఉన్న జన సమూహం ప్రభుత్వ సిబ్బందిపై దాడిచేసేలా దాన్ని రెచ్చగొట్టాడనే అనుమానంతో లగచర్ల యువకుడు భోగమోని సురేశ్ లేదా సురేశ్ రాజ్ కోసం సోమారం రాత్రి ఊళ్లోకి పోలీసులు పెద్ద సంఖ్యలో వచ్చి కరెంటు తీసేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా అక్కడ ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారని వార్తలొచ్చాయి.
మరి జమ్మూ కశ్మీర్, పంజాబ్, అస్సాం, ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో రెండు వర్గాల ప్రజల మధ్య విద్వేషాల వల్ల హింస చెలరేగితే కర్ఫ్యూ పెడతారు. ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తారు. కాని తెలంగాణ ముఖ్యమంత్రి సొంత శాసనసభ నియోజకవర్గం కొడంగల్లు పరిధిలోని గ్రామంలో చుక్క నెత్తురు చిందకుండా పోలీసులు శాంతిభద్రతలు కాపాడే నెపంతో విద్యుత్తు సరఫరా ఆపేసి, జనానికి ఇప్పుడు అత్యవసర సరకుగా మారిని ఇంటర్నెట్ సేవలను కత్తిరించడం ఎందుకో మా వంటి పొరుగు రాష్ట్రం నుంచి స్థిరపడ్డవాళ్లకు అర్ధంకాని విషయంగా కనిపిస్తోంది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అన్నట్టు తెలంగాణ కేవలం ధనిక రాష్ట్రం మాత్రమే కాదు. పూర్వపు పాలమూరు గ్రామాల జనం ఆగ్రహించి కలెక్టర్ కారు అద్దాలు పగలగొడితే..ఇంటర్నెట్ సేవలు నిలిపివేసే స్థాయికి పది సంవత్సరాల ఆరు నెలల వయసున్న తెలంగాణ ఎదిగిపోయింది. ముఖ్యమంత్రి మంగళవారం చెప్పినట్టు ఆయన పదేళ్ల పాలనలో తెలంగాణం ఇంకా ఎనెన్ని కొత్త పరిణామాలకు వేదిక అవుతుందో.