KTRVSREVANTH: బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మనీ లాండరింగ్ కు పాల్పడిన చాలా మంది పదవులు కోల్పోయారని ..త్వరలోనే రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా పదవులు ఊడటం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. ఈసందర్భంగా పార్లమెంట్ ఎన్నికల ప్రచార సమయంలో రాష్ట్రానికి వచ్చిన ప్రధాని మోదీ.. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ మారిందని చేసిన వ్యాఖ్యలను గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వ పథకమైన అమృత్ టెండర్లలో ఇంత పెద్ద అవినీతి జరుగుతున్నా.. ప్రధాని ఏంచేస్తున్నారని కేటీఆర్ ప్రశ్నించారు.
ఇవాళ ఢిల్లీలో కేంద్రమంత్రితో భేటి అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. అమృత్ 2.0 టెండర్లలో రేవంత్ ప్రభుత్వ అవినీతి స్పష్టంగా కనిపిస్తుందని.. ఎలాంటి అర్హత లేకపోయినా శోదాకంపెనీకి టెండర్లు ఎలా కట్టబెట్టారని ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డి కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. మొత్తం 8 వేల 888 వేల కోట్ల టెండర్లపై సమగ్ర విచారణ జరపాలని కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కోరినట్లు తెలిపారు. తక్షణమే తెలంగాణలో జరుగుతున్న అవినీతిపై కేంద్రం విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కేటీఆర్ కోరారు.