Telangana politics:
రాష్ట్రంలో రాజకీయాలు….. శీతాకాలపు చలిని మరిపించేంత వేడి పుట్టిస్తున్నా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మౌనమే పాటిస్తున్నారు. అప్పుడప్పుడు పార్టీ నాయకులు, కార్యకర్తలతో అంతర్గతంగా మాట్లాడుతున్న అంశాల సారాంశం మాత్రం బయటకు వస్తోంది. ఇటీవలే… పాలకుర్తి నియోజకవర్గం వారితో మాట్లాడి, పంపిందీ అటువంటి సందేశమే! చాన్నాళ్లుగా ఆయన పాటిస్తున్న మౌనం వెనుక ఏముంది! అది వ్యూహాత్మక ఎత్తుగడా? రాజకీయ వైరాగ్యమా? జనం మెదళ్లను ఈ ప్రశ్న తొలుస్తోంది. ఇదుగో ఇప్పుడొస్తారు, అదుగో అప్పుడొస్తారు, అసెంబ్లీకి క్రమం తప్పకుండా వస్తూ సర్కారును ఎండగడతారు, దీపావళి కాగానే జనంలోకి వచ్చి జిల్లాల్లో పర్యటనలు చేస్తారు. ఇలా రకరకాల వార్తా కథనాలు సంప్రదాయ`సామాజిక మాధ్యమాల్లో వస్తున్నా ఆయన మాత్రం బయటకు రాలేదు. అసెంబ్లీలో ఒక పూట కనిపించారంతే! అసెంబ్లీ, లోక్ సభ…. రెండు వరుస ఎన్నికల్లో భారత్ రాష్ట్ర సమితి`బీఆర్ఎస్ ఓటమి తర్వాత ఇంటికి, ఫామ్ హౌజ్కు మాత్రమే కేసీఆర్ పరిమితమవుతున్నారు. బయట ఏ కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల రోజు తగిలిన కాలి గాయం వల్ల ఆస్పత్రిలో, ఇంట్లో కొంతకాలం వైద్య చికిత్స తీసుకున్నారు. లోక్ సభ ఎన్నికల ముందు కొన్నాళ్లు బస్సుయాత్ర చేశారు. ఇక లోక్ సభ ఎన్నికల్లో కనీసం ఒక స్థానమైనా దక్కక పార్టీ పరాజయం పొందిన తర్వాత ఆయన ఎక్కడికీ రావట్లేదు. అధికారికంగా రాజకీయ ప్రకటనలూ చేయట్లేదు. రాష్ట్రంలో, కేంద్రంలో పాలకపక్షాలైన కాంగ్రెస్, బీజేపీ నాయకులు నేరుగా ఆయనపై విమర్శలు చేసినా, నిర్దిష్ట ఆరోపణాస్త్రాలు సంధించినా కేసీఆర్ బదులీయడం లేదు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఒకడుగు ముందుకు వేసి, ‘మీకు విశ్రాంతి కోసమే ప్రజలు అలా తీర్పిచ్చారు, విశ్రాంతి తీసుకుంటూనే ఉండండి, మీ ఇంట్లో నాలుగుద్యోగాలు పోవడం తప్ప రాష్ట్రంలో ఎవరికీ, ఏ నష్టమూ లేదంటూ రెచ్చగొట్టినా…. ఆయనేం స్పందించడం లేదు. దీని వెనుక ఏదో బలమైన కారణమే ఉండి ఉంటుందనే ఊహ రాజకీయ వర్గాల్లోనే కాక సామాన్య జనంలోనూ ఉంది! పుష్కర కాలానికిపైగా ఉద్యమం నడిపి, తెలంగాణ సిద్దించాక పదేళ్లు అధికారం చెలాయించి….. నిత్యం క్రియాశీలంగా ఉన్న నాయకుడు ఒక్కసారిగా తెరపై నుంచి తప్పుకోవడాన్ని, ఆరు మాసాలు కనబడక`వినబడక పోవడాన్ని ప్రజలు ఒకింత వింతగానే చూస్తున్నారు.
వైరాగ్యం కాదేమో?
గెలిచితీరుతాం అని నమ్మిన చోట జనం ఇంత దారుణంగా ఓడించడమేమిటి? అన్న బాధ ఆయన్ని కొంతకాలం వేధించే ఉంటుంది. ‘మేము చెప్పిన నిజాలు నమ్మలేదు, కాంగ్రెస్ అబద్దాలను ప్రజలు నమ్మటం వల్లే మా అధికారం పోయింది, సరే… అసెంబ్లీ పోతే పోయింది, లోక్ సభ ఎన్నికల్లోనైనా పది, పన్నెండు సీట్లిస్తే గట్టిగా స్వరం వినిపించడానికి, తెలంగాణ అస్తిత్వం నిలబెట్టడానికి ఉంటుందని తానే స్వయంగా కోరినా… ఒక చోటైనా బీఆర్ఎస్ ను గెలిపించకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?’ అన్న ప్రశ్న ఆయన్ని వెంటాడింది. దాని మూలంగా ‘ఏహే, ఈ జనం ఇంతే, వారికి నేనింత జేసినా… చివరకు ఇవా ఫలితాలు? ఇదా పరిణామం?’ అనే రాజకీయ వైరాగ్యమేమో? అందుకే ఆయన బయటకు రావట్లేదేమో! నోరి విప్పట్లేదేమో? అనే సందేహానికీ ఆస్కారముంది. కానీ, తరచి చూస్తే, అలా అనిపించట్లేదు. సమకాలికుల్లో ఎంతో పరిణతి చెందిన నాయకుడాయన. రాజకీయ వైరాగ్యమేమీ ఆయనకు లేదని, ఇది వ్యూహాత్మక మౌనమే అనుకోవడానికి ఊతమిచ్చే సంకేతాలు తరచూ వెలువడుతున్నాయి. ఒకోసారి ఒంటరిగా, చిన్న బృందాలుగా, సమూహాలుగా పార్టీ నాయకులు`కార్యకర్తలు అప్పుడప్పుడు కేసీఆర్ను కలుస్తున్నారు. వారినుద్దేశించిన ఆయన జరిపే ప్రసంగాలు, సంభాషణలను విశ్లేషించినా అదే స్పష్టమౌతోంది.
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు, సీనియర్ మాజీ మంత్రి టి.హరీష్రావులకు తరచూ సూచనలు, సలహాలు ఇస్తుండటం, దిశానిర్దేశ్యం చేస్తుండటాన్ని బట్టి ఆయనకొక నిర్దిష్ట వ్యూహమున్నట్టు తెలుస్తోంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలను ‘ఫిక్స్’ చేసి, ఎండగట్టడానికి అవిశ్వాస తీర్మానం మంచి అస్త్రమనే ప్రతిపాదన ఒకటి పార్టీలో వచ్చింది. దాన్ని తిరస్కరించి, అది తొందరపాటవుతుంది తప్ప ఫలితమీయదని ఆ ఆలోచనను కేసీఆర్ విరమింపజేసినట్టు సమాచారం. అదే సమయంలో… న్యాయపరంగా పటిష్ట పోరాటం చేయాలన్న ఆయన సంకల్పమే కేసును తాజా స్థితివరకు తెచ్చింది.
ఉప ఎన్నికల పరిస్థితి తేవాలని ఆయన పట్టుదలగా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలే తిరస్కరిస్తారు, అంత వరకు దైర్యం కోల్పోకుండా ఓపిగ్గా ఉండాలని పార్టీ శ్రేణులకు బోధిస్తున్నారు. అందులో భాగంగానే ఆయన మౌనం వహిస్తున్నట్టుంది. కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ లిక్కర్ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చే వరకు కూడా ఈ అంశం ఆయన్ని మానసికంగా కృంగదీయడం తెలిసిందే! బెయిల్పై విడుదల తర్వాత ఆయనలాగే ఆమె కూడా దాదాపు మౌనాన్నే ఆశ్రయించారు.
వ్యూహం…. ఎంత కాలం?
తాను బయటకు రాకపోయినా, మౌనం వీడి మాట్లాడకపోయినా పార్టీ సీనియర్ నాయకుల్ని, శ్రేణుల్ని ప్రభుత్వంపైకి కేసీఆర్ బాగానే ఉసిగొల్పుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసే తప్పిదాల్ని ఎప్పటికప్పుడు ఎత్తి చూపాలనే విషయంలో ఆయనకు భిన్నాభిప్రాయం లేదు. తాను మాత్రం నోరు విప్పి మాట్లాడటం లేదు. బహిరంగ ప్రకటనలేవీ చేయట్లేదు. తాను నోరిప్పితే… సీఎం తో సహా మంత్రి మండలి మొత్తం ఒంటికాలిపై లేచి, గాయిగాయి చేసి గత్తర లేపుతారని, అంతకన్నా మౌనమే మంచిదని ఆయన ఓ నిశ్చితాభిప్రాయానికి వచ్చినట్టుంది. కొన్ని కీలక విషయాల్లో మాట్లాడినా….. పదేళ్ల తమ హయాంలో అవే అంశాల్లో జరిగిన తప్పిదాలు, లోపాలు ఎత్తిచూపే, ఎండగట్టి నిందించే అస్త్రాలను కాంగ్రెస్ చేతికిచ్చినట్టవుతుందనే భయం కూడా లోలోపల ఉండొచ్చు. రుణమాఫీతో సహా రైతు సమస్యల నుంచి సర్పంచులకు బిల్లులు చెల్లించని దీనస్థితి వరకు ఏది ఎత్తుకున్నా ఎదురు నిందలు తప్పట్లేదు. ఈ స్థితిలో కొంతకాలం నిరీక్షణే మంచిదని ఆయన వ్యూహం. 2023 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ, ‘కాంగ్రేసోల్ల మాటలు నమ్మి… ఓట్లేయక మీరు మమ్మల్ని ఓడిస్తారనుకోండి, మాకు పోయేదేమీ లేదు, మేం పోయి రెస్ట్ తీసుకుంటం, గప్పుడు ఇగ మీకే కష్టాలు’ అని కేసీఆర్ స్వయంగా చెప్పారు. ఫలితాల తర్వాత కూడా…. హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చదని, ప్రజల్ని ఇబ్బందుల పాల్జేసిందని మాట్లాడిన సందర్భాలున్నాయి. రోజులు గడిచేకొద్దీ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వంపై కోపం, అసహనం, చీత్కారం పెరుగుతాయని ఆయనకి తెలుసు. ‘తప్పులు చేస్తున్నారు, చేయనీయండి.. వాళ్ల పతనం వాళ్లే లిఖించుకుంటారు’ అనే తలంపుతో, ‘పరిస్థితి పక్వానికి రావాలనే’ది ఆయన ఆలోచన. అది గ్రహించని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆవేశపడిపోతున్నారని, నాలుగేళ్ల పాటు ఆర్థిక`మానవ వనరుల్ని వృధా చేసుకోవడం అనవసరమనేది కేసీఆర్ నిశ్చితాభిప్రాయం.
ఉద్యమకాలం వేరు….
తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం తర్వాత దాదాపు పదమూడేళ్ల ఉద్యమ కాలంలో కేసీఆర్ వ్యూహాత్మక నాయకత్వం నెరిపారు. ఉద్యమాన్ని ఒకోసారి ఉదృతస్థితికి, ఇంకోసారి మంద్ర స్థితికి తీసుకువెళ్తూ ‘డీల్`మాంజా’ వ్యూహం పాటించేది. ఉద్యమం కనుక అప్పుడది సాగింది. తానే ప్రకటించినట్టు ఇప్పుడు బీఆర్ఎస్ ఓ ఫక్తు రాజకీయ పార్టీ! పోటీ పార్టీలు రంగంలో ఉన్నాయి. కేసీఆర్ ప్రత్యక్ష నేతృత్వం లేకుండా పార్టీని వదిలేస్తే… ఆ రాజకీయ శూన్యతలోకి వ్యాపించడానికి బీజేపీ వంటి పార్టీలు సిద్దంగా ఉన్నాయి. ఢిల్లీ నాయకత్వం కూడా ‘దక్షిణ’ ప్రాధాన్యతతో దూకుడుగా ఉంది. గుడులని, ఇతర ప్రజాసమస్యలని ఇప్పటికే బీజేపీ ప్రజాక్షేత్రంలో ప్రత్యక్ష పోరాటాలు మొదలెట్టింది. అసెంబ్లీ ఓటమి తర్వాత త్వరగా కోలుకోనందునే లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు అద్వానపు ఫలితాలొచ్చాయి. పొరుగునున్న ఆంధ్రప్రదేశ్లో 23 సీట్లకు పరిమితమైన 2019లో చంద్రబాబుగానీ, 67 ఒకసారి (2014), అయిదేళ్ల అధికారం అనుభవించిన 151 నుంచి 11కు మరోసారి (2024) పడిపోయినపుడు జగన్మోహన్రెడ్డి గానీ… పక్షం రోజుల్లో కోలుకొని ప్రజాక్షేత్రంలోకి వచ్చారు. జనాలకి అండగా నిలబడి, పార్టీ శ్రేణులకు కొత్త నమ్మకాన్ని కలిగించారు. బీఆర్ఎస్కు ఎన్నికల్లో ఓటమి కొత్తేమీ కాదు. సవాల్గా రాజీనామా పత్రాలు విసిరి తెప్పించిన ఉప ఎన్నికల్లోనూ పలు చోట్ల ఓడింది. 2009లో ఇతర పార్టీలన్నిటితో కలిసి మహాకూటమి గట్టి పోరినా.. డజన్ సీట్లూ దక్కని దుస్థితి. ఉద్యమకాలంలో మద్దతిచ్చినట్టు సబ్బండ వర్గాలు ఇపుడు పార్టీ వెంట నడవటం లేదు. ఎప్పట్లాగే రెడ్డి సామాజికవర్గాన్ని కాంగ్రెస్ మచ్చిక చేసుకుంటే బీజేపీ బీసీ రాగం వినిపిస్తోంది. తొలి రెండు ఎన్నికల్లోనూ లభించినంత బీసీల, ముస్లిం మైనారిటీల, దళితుల మద్దతు బీఆర్ఎస్కు 2023, 2024 ఎన్నికల్లో లభించలేదు. కుటుంబ పాలన అనే తప్ప. ఇన్నేళ్లలో పార్టీకి ‘వెలమ’ అని కులముద్ర పడలేదు. కానీ, దూరమైన సామాజికవర్గాలను తిరిగి సమీకరించుకోవడానికి కేసీఆర్ ప్రత్యక్ష నేతృత్వానికి మించిన అస్త్రం పార్టీకి మరోటి లేదు.
పొంచి ఉన్న ప్రమాదం..
బీఆర్ఎస్ సంస్థాగతంగా డీలాపడి, అచేతన స్థితిలో ఉండి. అన్ని స్థాయిల్లో కమిటీలు తుప్పుబట్టి ఉన్నాయి. ఎన్నికల పరంగా రెండు వరుస ఓటముల తర్వాత కూడా లోతైన సమీక్షలు జరుగలేదు. ఓటమికి నిజమైన కారణాలు అన్వేషించి ఉంటే పార్టీ వాస్తవస్థితి కూడా బోధపడేది. త్వరలో రానున్న గ్రామ, మండల, పట్టణ, నగర స్థానికసంస్థల ఎన్నికలు పార్టీకి సవాల్ మాత్రమే కాక ఓ అవకాశం అనీ గ్రహించాలి. దానికి కేసీఆర్ ప్రత్యక్ష నాయకత్వం అవసరం.
తదుపరి/తర్వాతి స్థాయి నాయకత్వం విషయంలో మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ల మధ్య అగుపడని ప్రచ్ఛన్న యుద్దమొకటి సాగుతోంది. పార్టీలో ఆధిపత్యం కోసం ఎవరికి వారు సొంత వ్యూహాలు, ఎత్తుగడలతో నడుస్తున్నారు. ఎవరి వెనుక వెళ్లాలనే విషయంలో పార్టీ శ్రేణులు తరచూ మీమాంసకు గురవుతున్నాయి. కేసీఆర్ దీర్ఘకాలం దూరంగా వీరిద్దరి నడుమ ఎడం మరింత పెరిగే ఆస్కారముంది. ఇప్పుడు కేసీఆర్ తేల్చుకోవాల్సింది వ్యూహం సరే, మరి ఫలితం?