తెలంగాణ ఎన్నికల్లో కింగ్ మేకర్ “మైనార్టీలు’…

telanganaelections2023:  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లీంలు కీలకం కాబోతున్నాారా అంటే అవుననే సమాధానం  వినిపిస్తోంది. పీపుల్స్‌పల్స్‌ సంస్థ బృందం అధ్యయనం ప్రకారం.. రాష్ట్రంలో 12 శాతానికి పైగా ఉన్న మైనార్టీలు రానున్న ఎన్నికల్లో కింగ్ మేకర్ అనడంలో ఎటువంటి సందేహం లేదని తేలింది.గత ఎన్నికల గణాంకాలు సైతం అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. దీంతో ముస్లింలను మచ్చిక చేసుకునేందుకు ప్రధాన పార్టీలైన బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి.  మరి అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లిం ఓటర్లు స్థానిక పరిస్థితులతోపాటు రాష్ట్ర రాజకీయాలను  దృష్టిలో పెట్టుకొని విజ్ఞతతో తమ తీర్పు ఏ పార్టీకి అనుకూలంగా ఇవ్వబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది.

ముస్లింలకు ప్రతినిధులమని చెప్పుకునే ఎంఐఎం హైదరాబాద్‌ పాతబస్తీకే పరిమితమయ్యింది. అయితే ఆ పార్టీ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా మైనార్టీలపై కొంత ఉండడంతో గతంలో కాంగ్రెస్‌, ఇప్పుడు బీఆర్‌ఎస్‌ ఎంఐఎం ప్రాప్తం కోసం పాకులాడుతున్నాయి. ఇక మరో ప్రధాన పార్టీ బీజేపీ కూడా ముస్లిం ఓట్ల అంశంలో నిర్ణయాత్మకమైందే. ముస్లింలు బీజేపీకి ఓటు వేయకపోయినా దానికి వ్యతిరేకంగా బలంగా ఉన్న పార్టీకే ఓట్లేస్తుండడంతో ఆపార్టీ కూడా ఈ ఎన్నికల్లో కీలకమే. తెలంగాణలో సుమారు 50 నియోజకవర్గాల్లో గెలుపోటములను శాసించే స్థితిలో ముస్లిం ఓటర్లున్నారు. ఎంఐఎం పట్టున్న పాతబస్తీలోని ఏడు స్థానాల్లో 55 నుండి 80 శాతం ముస్లిం ఓట్లున్నాయి. ఈ ఏడు నియోజకవర్గాలను మినహాయిస్తే రాష్ట్రంలో 13 చోట్ల 20 శాతానికి పైగా, 11 స్థానాల్లో 15-20 శాతం, 28 సీట్లలో 10-15 శాతం ఓట్లతో ముస్లింలు నిర్ణయాత్మకంగా ఉన్నారు.
ముస్లింలు కీలకంగా ఉన్న నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీల గత విజయాలకు సంబంధించి 2009, 2014, 2018 ఎన్నికల గణాంకాలను పరిశీలించి ఆయా స్థానాల్లో పార్టీల బలాబలాలను అంచనా వేయవచ్చు. పాతబస్తీలోని ఏడు నియోజకవర్గాలను మినహాయించి 20 శాతానికిపైగా ముస్లిం ఓట్లున్న మిగతా ఆరు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ 2009లో ఖైరతాబాద్‌, జూబ్లీహిల్స్, గోషామహల్‌ స్థానాల్లో గెలిచింది. 2014, 2018లో కాంగ్రెస్‌ వీటిలో ఒక్క స్థానం కూడా గెలవలేదు. 15-20 శాతం ముస్లిం ఓట్లున్న 11 స్థానాల్లో  2009, 2014, 2018 ఎన్నికలను పరిశీలిస్తే కాంగ్రెస్‌ ఆదిలాబాద్‌, బాన్సువాడ, కరీంనగర్‌, రాజేంద్రనగర్‌ స్థానాల్లో ఒక్కసారి కూడా గెలవలేదు. కాంగ్రెస్‌ 2009లో ఐదు, 2014లో మూడు గెలిచింది. 10-15 శాతం ముస్లిం ఓట్లున్న 28 నియోజకవర్గాల్లో 2009, 2014, 2018 ఎన్నికలను పరిశీలిస్తే నిర్మల్‌, కామారెడ్డి, కోరుట్ల, రామగుండం, పెద్దపల్లి, సిద్దిపేట, మెదక్‌, కుత్బుల్లాపూర్‌, ఇబ్రహీంపట్నం, కొడంగల్‌ (2009, 2014లో రేవంత్‌ రెడ్డి టీడీపీ నుండి గెల్చారు), జడ్చర్ల, వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ ఒక్కసారీ గెలవలేదు.
పై నియోజకర్గాలకు సంబంధించి బీఆర్‌ఎస్‌ ఫలితాలను పరిశీలిస్తే 20 శాతం ముస్లిం ఓట్లున్న 13 స్థానాల్లో 2009లో ఆ పార్టీ ఒక్క చోటా కూడా గెలవలేదు. 2014లో రెండు, 2018లో ఆరు స్థానాల్లో గెలిచింది. 15-20 శాతం ముస్లిం ఓట్లున్న 11 స్థానాల విషయంలో 2009లో ఒక్క సీటు కూడా గెలవని బీఆర్‌ఎస్‌ 2014లో ఆరు, 2018లో పది స్థానాల్లో  గెలిచింది. 10-15 శాతం ముస్లిం ఓట్లున్న 28 సీట్లలో 2018లో బీఆర్‌ఎస్‌ సంగారెడ్డి మినహా అన్నీ గెలిచింది. గత ఎన్నికల ఫలితాలను అంచనా వేసుకుంటే ముస్లిం ప్రాబల్యం ఉన్న ఈ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ కంటే బీఆర్‌ఎస్‌ మెరుగ్గా ఉన్నట్లు గణాంకాలు కనిపిస్తున్నా రాబోయే ఎన్నికల్లో కూడా ఇవే ఫలితాలుంటాయని చెప్పలేం.
పీపుల్స్‌పల్స్‌ క్షేత్రస్థాయి అధ్యయనంలో ఆయా నియోజకవర్గాల్లో ముస్లింలు స్థానిక సమస్యల కంటే  కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో బలపడకుండా ఉండడానికే అధిక ప్రాధాన్యతిస్తున్నారని తేలింది. ముస్లింలు ఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఓవైసీ ఎవరికి చెబితే వారికే ఓట్లేస్తారనేది కూడా ఒక భ్రమే. కేసీఆర్‌కు ఎంఐఎం బహిరంగంగా మద్దతిస్తున్నా రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలు బీఆర్‌ఎస్‌కు గంపగుత్తగా ఓట్లేస్తారని చెప్పలేం. ముస్లిం ఓట్ల ప్రాధాన్యతను గుర్తించిన కాంగ్రెస్‌ బీజేపీకి బీఆర్‌ఎస్‌, ఎంఐఎంలు ‘బీ’ టీములనే ప్రచారాన్ని ముమ్మరం చేస్తోంది. అయితే  క్షేత్రస్థాయిలో ముస్లింలు మాత్రం ఇటువంటి ప్రచారాల కంటే బీజేపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులను ఓడిరచే శక్తి బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలలో ఎవరికుంటే వారికి మద్దతుగా ఉండేలా ఆలోచిస్తున్నారు. కరీంనగర్‌, నిజామాబాద్‌ అర్బన్‌, ముథోల్‌, కోరుట్ల, గోషామహల్‌, అంబర్‌పేట్‌, ముషీరాబాద్‌ నియోజకవర్గాలను ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ స్థానాల్లో బీజేపీకి వ్యతిరేకంగా బలంగా ఉన్న అభ్యర్థికి 70% ముస్లిం ఓట్లు వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. మరో ఆకస్తికరమైన విషయం ఏమిటంటే బీజేపీపై కోపంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా ఉన్నా లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కే మద్దతిస్తామని వారు ఇప్పటికే ఒక నిర్ణయానికి రావడం విశేషం.
ఎన్నికలు రాగానే వరాలిచ్చే రాజకీయ పార్టీలపై ముస్లిం సామాజిక వర్గం అసంతృప్తిగా ఉంది. షాదీ ముబారక్‌, ఇమామ్‌లకు జీతాలు, లక్ష రూపాయల సహాయం వంటి హామీలపై బీఆర్‌ఎస్‌ ప్రచారం చేసుకుంటుండగా, ముస్లింల సంక్షేమం కోసం సబ్‌ప్లాన్‌ కింద నాలుగు వేల కోట్ల బడ్జెట్‌తో మైనార్టీ డిక్లరేషన్‌ను కాంగ్రెస్‌ ప్రకటించింది. మైనార్టీ జంటలకు 1,60,000 రూపాయల ఆర్థిక సాయం, అబ్దుల్‌ కలాం తోఫా కింద విద్యార్థులకు ఐదు లక్షల రూపాయల సాయం, ఇమామ్‌లకు12 వేల గౌరవ వేతనం వంటి ఆకర్షణీయమైన వరాలను కాంగ్రెస్‌ ఇచ్చింది. ముస్లింలను ఒక ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని, బీజేపీని బూచీగా చూపి  పార్టీలు ప్రయోజనం పొందుతున్నాయని ఆ సామాజిక వర్గంలోని మేధావులు, విద్యావంతులు భావిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో లక్ష రూపాయల ఆర్థిక సాయం కొద్ది మందికే అందిందని వారు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. ఇఫ్తార్‌ విందులు, తాత్కాలిక పథకాలు కాకుండా ముస్లింలలో విద్య, వైద్యం అభివృద్ధి కోసం కృషి చేయాలని వారు కోరుతున్నారు.
పథకాలు, వరాలు కాకుండా ముస్లింలకు కూడా రాజకీయ ప్రాతినిధ్యం కావాలనే డిమాండ్‌ కూడా ఈ సామాజిక వర్గంలో వినిపిస్తోంది. కొన్ని సామాజిక వర్గాల ఓట్లు అధికంగా ఉండే నియోజకవర్గాల్లో ఆయా సామాజిక వర్గాల వారికి టికెట్లు ఇస్తారు కానీ, పాతబస్తీని మినహాయించి ఇతర ప్రాంతాల్లో ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేకించి ముస్లిం అభ్యర్థులకు ప్రధాన పార్టీలు టికెట్లు ఎందుకియ్యవనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. ముస్లిం ఓట్లు ఏకపక్షంగా కావాలని  కోరుకునే ప్రధాన పార్టీలు సీట్ల కేటాయింపులో ముస్లిం వర్గానికి అన్యాయం చేస్తున్నాయి. అధికార బీఆర్‌ఎస్‌ బోధన్‌లో సిట్టింగ్‌ అభ్యర్థి షకీల్‌కు మరోసారి అవకాశం ఇచ్చి, పక్కాగా ఓడిపోయే చార్మినార్‌, బహదూర్‌పురాలో ముస్లిం అభ్యర్థులను దింపింది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క చోట మాత్రమే వారికి అసలైన అవకాశమిచ్చినట్టు. మరోవైపు కాంగ్రెస్‌ ఆరు స్థానాల్లో ముస్లిం అభ్యర్థులను దింపింది. వీటిలో ఓడిపోయే చార్మినార్‌, కార్వాన్‌, మలక్‌పేట్‌ స్థానాలుండగా నిజామాబాద్‌ అర్బన్‌, జూబ్లీహిల్స్, నాంపల్లి నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఇవ్వనుంది. అంటే కాంగ్రెస్‌ ముగ్గురికి మాత్రమే సదావకాశం ఇచ్చినట్టు. 50కి పైగా స్థానాల్లో గెలుపోటములను శాసించే ముస్లింలకు ప్రధాన పార్టీలు ఇంత తక్కువ స్థాయిలో టికెట్లు కేటాయిస్తున్నాయంటే వాటికి ఈ సామాజిక వర్గంపై చిన్నచూపు ఉందనే అసంతృప్తి వీరిలో ఉంది.
ఎంఐఎంతో పాటు బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలపై కూడా ముస్లింలు ఆగ్రహంగానే ఉన్నారు. ముస్లింల పేటంట్‌గా చెప్పుకునే ఎంఐఎం పాతబస్తీకే పరిమితమై అధికారంలో ఎవరుంటే వారికి మద్దతిస్తూ స్వప్రయోజనాలను చూసుకుంటుందనే అభిప్రాయం ఈ వర్గంలో ఉంది. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు కూడా ముస్లిం సంక్షేమాన్ని పక్కకు పెట్టి ఎంఐఎంతో సత్సంబంధాలుంటే చాలనే విధంగా వ్యవహరిస్తున్నాయనే అసంతృప్తి ఉంది. రాష్ట్రంలో ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతాలను ఇతర ప్రాంతాలతో పోలిస్తే అభివృద్ధి ఏమేరకుందో తేటతెల్లమవుతుందని వారంటున్నారు. ఇందుకు నగరం నడిబొడ్డున ఉన్న పాతబస్తీనే ఉదాహరణగా ముస్లింలు చూపిస్తున్నారు.
తెలంగాణలో బీఆర్‌ఎస్‌ను గద్దె దింపాలన్నా, కాంగ్రెస్‌ను గద్దెనెక్కించాలన్నా ముస్లిం సామాజిక ఓటర్ల పాత్రే కీలకం. రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్న ప్రధాన పార్టీలపై ముస్లింలకు అసంతృప్తి ఉన్నా తప్పనిసరి పరిస్థితులలో రాజకీయాలలో ఒక పావుగా మారుతున్నామనే అభిప్రాయం వారిలో నెలకొంది. తెలంగాణలో   కింగ్‌మేకర్లుగా ఉన్న ముస్లింలు ఏ పార్టీని ఆదిరిస్తారో డిసెంబర్‌ 3న వెలువడే ఫలితాలే తేలుస్తాయి.
==============================
– ఐ.వి.మురళీ కృష్ణ శర్మ,
రీసెర్చర్‌, పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ,
Email: peoplespulse.hyd@gmail.com