CGRFoundation: హైదరాబాద్ కి చెందిన కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ (సీజీఆర్) నలుగురు సభ్యులు జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. ప్రతి ఏటా ఢిల్లీకి చెందిన పౌరసంస్థ క్యాపిటల్ ఫౌండేషన్ సోసైటీ వివిధ రంగాల్లో కృషి చేసిన వారికి అవార్డులను అందజేస్తోంది. ఒకటిన్నర దశాబ్దాలుగా పర్యావరణ రంగంలో విశేష కృషి చేసిన సీజీఆర్ సభ్యులను 2024 సంవత్సరానికి గాను ఎంపిక చేసింది.డాక్టర్ కె. తులసీరావు(పర్యావరణం జాతీయ అవార్డు), సీనియర్ జర్నలిస్ట్ ఆర్.దిలీప్ రెడ్డి (నూకల నరోత్తం రెడ్డి జాతీయ అవార్డు), దొంతి నర్సింహ్మారెడ్డి(ప్రొఫెసర్ టి.శివాజీరావు జాతీయ అవార్డు) డాక్టర్ ఎ.కిషన్ రావు(ఎర్త్ కేర్ ఎన్విరాన్ మెంట్ జాతీయ అవార్డు ) అవార్డులు అందుకోనున్నారు.
ఇక అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ఈనెల 6 న నల్సార్ యూనివర్శిటీలో నిర్వహించబోతున్నట్లు క్యాపిటల్ ఫౌండేషన్ సభ్యులు పురుషోత్తం రెడ్డి, శివప్రసాదరావు, లీలాలక్ష్మారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈకార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ ఆరాధే, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏకే పట్నాయక్ హాజరవుతున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
36 లక్షల మొక్కలు నాటిన సీజీఆర్..
ప్రభుత్వాలు సమర్థంగా పనిచేయడానికి, సమాజం సమున్నతంగా ఎదగడానికి బలమైన పౌరసమాజం ఉండాలని కోరుకున్న జస్టిస్ కృష్ణ అయ్యర్, జస్టిస్ భగవతి న్యాయకోవిదులు, ఇతర మేధావుల ఆలోచనతో సీజీఆర్ (క్యాపిటల్ ఫౌండేషన్ సోసైటీ) 2010లో ఆవిర్భవించింది. తదనంతర కాలంలో పర్యావరణ పరిరక్షణ కోసం సీజీఆర్ సంస్థ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టింది. సంస్థ తరపున 36 లక్షల మొక్కలు నాటారు. తూర్పు కనుమల పరిరక్షణ కోసం గ్రేస్ వేదిక ఏర్పాటు చేసింది.పర్యావరణ సుస్థిరాభివృద్ధి రంగాల్లో శిక్షణ, అవగాహన కోసం ఓ ఎర్త్ సెంటర్ ను సీజీఆర్ నడుపుతోంది.