టీ- కాంగ్రెస్ లో సరికొత్త రచ్చ.. సీనియర్స్ VS జూనియర్స్..!
Tcongress: కాంగ్రెస్ లో ఎంపీ కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తెలంగాణలో హస్తం పార్టీ అధికారంలోకి వస్తే దళిత వ్యక్తి సీఎం అవుతారని మంచిర్యాల బహిరంగ సభ వేదికగా ఆయన మాట్లాడిన మాటలు తీవ్ర చర్చకు దారితీశాయి. దీనికి ఆజ్యం పోసేలా సీఎం రేసులో తాను ఉన్నట్లు సీఎల్పీ మల్లు భట్టి విక్రమార్క్ బాంబ్ పేల్చడంతో.. ‘ ఆలులేదు చూలు లేదు కానీ కొడుకు పేరు సోమలింగం ‘ అన్నట్లు హస్తం పార్టీ నేతలు వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కాగా తెలంగాణలో కాంగ్రెస్ నేతల పాదయాత్రల లక్ష్యం సీఎం కుర్చీ అన్నది భట్టి మాటలతో తెలిపోయింది. ఈనేపథ్యంలోనే ఎంపీ కోమటిరెడ్డి సైతం అందుకనుగుణంగానే వ్యాఖ్యాలు చేశారని హస్తం పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సైతం ఇదే తరహాలో సీఎం కుర్చీపై కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ లో సీఎం సీటు కోసం డజను పైగా అభ్యర్థులు ఉన్నారని.. తాను రేసులో ఉన్నానంటూ ఆయన చేసిన కామెంట్స్ అప్పట్లో దుమారం రేపాయి. తాజాగా భట్టి,కోమటిరెడ్డి ఇదే తరహాలో కామెంట్స్ చేయడం హస్తం పార్టీ క్యాడర్ జీర్ణించుకోలేకపోతోంది .
మరోవైపు తెలంగాణ కాంగ్రెస్‌లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించిన నిరుద్యోగ నిరసన సభ అగ్గి రాజేసింది. తమకు సమాచారం ఇవ్వకుండా నల్లగొండలో నిరుద్యోగ నిరసన దీక్ష నిర్వహించనున్నట్లు ఎలా ప్రకటిస్తారని సీనియర్ నేత, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎంపీ, పార్టీ నాయకులను సంప్రదించకుండా రేవంత్ ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం సరికాదంటూ ఆయన పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇన్ చార్జ్ మాణిక్ రావు ఠాక్రేకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాక ఈనెల 24న ఖమ్మం, 26 న ఆదిలాబాద్ లో నిరసన దీక్షలను రేవంత్ ప్రకటించడంపై.. ఆయా జిల్లాల నేతలు సైతం పీసీసీ వైఖరిపై గరం గరం అవుతున్నట్లు తెలుస్తోంది.
ఇక మరో ఎంపీ కోమటిరెడ్డి.. నిరసన దీక్ష విషయంపై స్పందిస్తూ రేవంత్ కు పరోక్షంగా చురకలు అంటించారు. తనతో దీక్ష గురించి ఎవరూ చర్చించలేదని.. ఢిల్లీలో తాను బిజీగా ఉన్నానని..రంజాన్ మాసంలో కార్యక్రమం పెట్టడం సరికాదని ఎంపీ తేల్చిచెప్పారు. నల్లగొండ బదులు పార్టీ బలహీనంగా, ఆదిలాబాద్, కరీంనగర్ , వంటి జిల్లాలో దీక్ష ఏర్పాటు చేస్తే బాగుంటుందని వెంకట్ రెడ్డి చెప్పకనే చెప్పారు.
మొత్తంగా నిత్యం కుమ్ములాటలతో వార్తల్లో నిలిచే హస్తం పార్టీ.. సీనియర్నే, జూనియర్ నేతల మధ్య అంతర్గత పోరు, దళిత సీఎం వ్యాఖ్యాల వ్యవహరం టీకప్పులో తుఫానులా సమసిపోతుందా?లేక అసంతృప్త నేతల రచ్చకు దారితీస్తుందా? అన్నది తెలంగాణ కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారింది.