సాయి వంశీ (విశీ):
జపాన్‌లో కొత్త ట్రెండ్ మొదలైంది. అదే ‘Solo-Wedding’. అక్కడ వైభవంగా పెళ్లిళ్లు జరుగుతాయి. ముస్తాబులు, ఫొటోలు, వేడుకలు.. అన్నీ ఉంటాయి. కానీ పెళ్లికొడుకు మాత్రం ఉండడు. పెళ్లికూతురు తనను తానే పెళ్లి చేసుకుంటుంది. మానా సకురా అనే శృంగార తార ఈ ట్రెండ్‌ను మొదలుపెట్టారు. తమను తాము ప్రేమించుకునే అమ్మాయిలు ఇలా ఒంటరి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.
దక్షిణ కొరియాకు చెందిన ‘సీమ్ అరోమి’ ట్రెండింగ్ యూట్యూబ్ స్టార్. యూట్యూబ్‌లో ఆమెకు 2 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. తన రోజువారీ కార్యక్రమాలను వీడియోలుగా తీసి పెడుతుంటారు. దీంతోపాటు ఆమె రచయిత్రి. పెళ్లి చేసుకోకపోవడమే తన జీవితానికి అతిపెద్ద గెలుపు అని అంటారామె. భార్య, తల్లి పాత్రల్లో తాము ఇమడలేదని, అదేమీ సమస్య కాదని ఆమె నమ్మకం. తనకు నచ్చినట్లు జీవితాన్ని నడిపించడమే ముఖ్యం అనేది ఆమె ఫిలాసఫీ. దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఆమె జీవనవిధానానికి అభిమానులుగా మారారు.
అమెరికాలో సుమారు 38 శాతం మంది ప్రజలు వివాహబంధం లేకుండానే జీవిస్తున్నారు. తమకు ఒంటరి జీవితమే మేలని వారు భావిస్తున్నారు. ఇందులో మగవాళ్ల కన్నా స్త్రీలే ఎక్కువగా ఉన్నారు.
‘మిథునం’ అన్నిమార్లూ, అన్నిసార్లూ సమంగానే ఉండదని చెప్పేవే ఈ లెక్కలు. ఒంటరి బతుకు కూడా హాయే! అందుకు ఆడ, మగ తేడా లేదు. ప్రపంచం ఎప్పుడో ఆ విషయాన్ని ఒప్పుకుంది. మీరే ఇంకా చాలా వెనుకబడి ఉన్నారు.