PawanKalyan: సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దీక్ష విరమణ నిమిత్తం కాలి నడకన తిరుమల చేరుకున్నారు. మంగళవారం సాయంత్రం అలిపిరి శ్రీవారి పాదాలకు మొక్కి సాధారణ భక్తులతో కలసి మెట్ల మార్గం ద్వారా తిరుమల కొండకు చేరుకున్నారు. ప్రతి అడుగు భక్తి భావంతో వేసిన పవన్ మోకాళ్లపై ప్రణమిల్లి పవిత్రమైన మెట్లకు మొక్కుతూ ముందుకు కదిలారు. మంగళవారం సాయంత్రం అలిపిరి నుంచి మెట్ల మార్గం ద్వారా బయలుదేరి సుమారు ఐదు గంటల పాటు కాలినడకన తిరుమల చేరుకున్నారు. సామాన్య భక్తులను పలుకరిస్తూ వారు చెప్పే విషయాలను అవగాహన చేసుకుంటూ భక్తి భావంతో ముందుకు సాగారు.
ఆధ్యాత్మిక చింతనతో సాధారణ భక్త జనం కూడా ఆయన వెంట అడుగులో అడుగులు వేశారు. మోకాళ్ల పర్వతం దాటిన తర్వాత మెట్లకు సాష్టాంగ నమస్కారం చేస్తూ నమో నారాయణాయ మంత్రం జపిస్తూ కలియుగ వైకుంఠం దరించేరిందన్న భావంతో పవన్ కళ్యాణ్ ఆధ్యాత్మిక అనుభూతి పొందారు. మెట్ల మార్గంలో నడక పూర్తి చేసి తిరుమల చేరుకుని తన్మయత్వం చెందారు. స్వామి వారికి చేతులెత్తి మొక్కి తిరుమల పరిసరాలను కాలినడకన పరిశీలిస్తూ బాలాజీ బస్టాండ్ సర్కిల్ వరకు నడిచారు. భారీగా భక్త జనం గుమికూడడంతో గాయత్రి అతిధి గృహానికి పయనమయ్యారు. బుధవారం శ్రీవారిని ఉదయం దర్శించుకుని ప్రాయశ్చిత్త దీక్ష విరమిస్తారు.
మంగళవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో అలిపిరి చేరుకుని భక్త జన కోలాహలం మధ్య సామాన్య భక్తులతో కలసి పవన్ కళ్యాణ్ తిరుమల బయలుదేరారు. సామాన్య భక్తులను పలుకరించి వివరాలు తెలుసుకున్నారు. గాలిగోపురం సమీపంలో చంద్రగిరికి చెందిన భక్తులు హనుమాన్ జెండాను శ్ డిప్యూటీ సీఎం కి అందించగా, భక్తితో దాన్ని స్వీకరించి కొంత దూరం చేతబూని మెట్ల వెంట నడిచారు. 1750వ నంబర్ మెట్టు వద్ద ఏర్పాటు చేసిన అన్నమాచార్యుల విగ్రహానికి నమస్కరించారు. గాలి గోపురం వద్ద టీటీడీ పారిశుధ్య కార్మికురాలిని పలుకరించారు. తమను జీతాలు పెంచమని ఆమె అభ్యర్ధించారు.
మార్గ మధ్యంలో ఏర్పాటు చేసిన శ్రీరాముడు, బలరాముడు, కల్కీ భగవానునికి విగ్రహాలకు నమస్కరిస్తూ ముందుకు సాగారు. అంజనాద్రి వద్ద భక్తుల సంఖ్య భారీగా ఉండడంతో మెట్ల మార్గం నుంచే శ్రీ ఆంజనేయస్వామికి మొక్కారు. నరసింహస్వామి కోవెల సమీపంలో అటవీ అధికారులు గతంలో పులి సంచారానికి సబంధించిన వివరాలు పవన్ కళ్యాణ్కి వివరించారు. గాలిగోపురం వద్ద, హునుమాన్ ఆలయం తదితర ప్రాంతాల్లో మహిళా భక్తులు హారుతులతో స్వాగతం పలికారు.
యాత్ర ఆద్యంతం పూర్తి భక్తి పారవశ్యంతో ముందుకు సాగిన జనసేనాని మనసులో ఓం నమో నారాయణాయ మంత్రాన్ని జపిస్తూ నడిచారు. మోకాళ్ల పర్వతం మీదుగా తిరుమల చేరుకున్న తర్వాత తిరుపతి జనసేన నాయకులు గుమ్మడి కాయలతో దిష్టితీశారు. తిరుపతి నుంచి తిరుమల కాలినడక యాత్ర మొదలు నుంచి చివరి వరకు రైల్వే కోడూరు శాసన సభ్యులు అరవ శ్రీధర్ , జనసేన నాయకులు, ప్రముఖ కళా దర్శకులు ఆనంద సాయి , పలువురు అధికారులు పవన్ కళ్యాణ్ ని అనుసరించారు.