JanasenaTDPalliance : ఆటల్లో గానీ…రాజకీయాల్లో గానీ నియమాలు, నిబంధనలు ఉంటాయి. ప్రధానంగా రాజకీయ పార్టీల పొత్తుల విషయంలో ఇవి మరింత ప్రధానం. వీటిని అతిక్రమించకుండా ఉంటే అంతా సక్రమంగానే ఉంటుంది. లేకపోతే ఎవరికి వారే అనుకుంటే గందరగోళం తప్పదు. పార్టీల పొత్తు ధర్మంలో అంతర్గతంగా ఎంత ఉత్తిడి ఉన్నా అధినేతలు మాత్రం పరస్పరం గౌరవించుకుంటూ ముందుకెళ్తే వారి మధ్య మంచి అవగాహనతో అపనమ్మకాలు లేకుండా వారు విజయ లక్ష్యానికి చేరువవుతారు. లేకపోతే ప్రత్యర్థులకు అస్త్రాలు అందించినట్టే.
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలనే ప్రధాన లక్ష్యంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యక్తిగతంగా చొరవ తీసుకొని తెలుగుదేశంతో పొత్తుకు ముందుకొచ్చారు. వాస్తవంగా పెద్ద పార్టీగా టీడీపీనే తిరిగి అధికారం రావడానికి చొరవ తీసుకోవాలి. అయితే ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా పవన్ జనసేన-టీడీపీ పొత్తుకు నాంది పలికారు. చంద్రబాబు నాయుడు రాజమండ్రి చెరసాలలో ఉన్నప్పుడు పార్టీలో నెంబరు టు నేత లోకేశ్ రాష్ట్రంలో లేకుండా ఢిల్లీ లో మకాం వేశారు. ఈ ఘటనలతో రాష్ట్ర టీడీపీ అయోమయంలో కొట్టుమిట్టాడుతుండగా పవన్ జైలుకెళ్లి చంద్రబాబును పరామర్శించి రెండు పార్టీల మధ్య పొత్తు ప్రకటన చేసి తెలుగుదేశానికి ఊపిరి పోశారు.
చంద్రబాబు నాయుడు బెయిల్‌పై విడుదలయ్యాక పవన్‌తో రెండు పార్టీల మధ్య పొత్తుల లక్ష్యం, నియమ నిబంధనలు, ప్రజాకాంక్షలకు అనుగుణంగా కామన్ మినీమమ్ ప్రోగ్రామ్, మానిఫెస్టోపై చర్చలు జరిపారు. అయితే ఇవి పూర్తికాకుండానే 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు నాయుడు పొత్తు ధర్మాన్ని విస్మరించి ఏకపక్షంగా మండపేట, అరకు స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించారు. కూటమి అధికారికంగా పోటీ స్థానాలపై నిర్ణయం వెలువడకముందే చంద్రబాబు ప్రకటనతో జనసేనానిపై పార్టీలో ఒత్తిడి పెరిగినా పవన్ ఎంతో సయమనంతో ఉన్నారు. గణతంత్ర దినోత్సవం రోజున సున్నితంగా టీడీపీ అధినేతలకు పొత్తు ధర్మాన్ని తెలియజేస్తూ రెండు పార్టీల మధ్య నష్ట నివారణ చేపట్టారు. తనపై పార్టీలో ఒత్తిడి పెరుగుతున్న సందర్భంలో రిపబ్లిక్ డే రోజున ‘ఆర్’ సెంటిమెంట్‌తో ‘ఆర్’ అక్షరంతో ప్రారంభమయ్యే నియోజకవర్గాలైన రాజోలు, రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందని ప్రకటిస్తూనే టీడీపీకి పరోక్షంగా పలు పొత్తు ధర్మ సూత్రాలను తెలియజేశారు.
జనసేన అధినేత పవన్‌పై తెలుగుదేశం అవకాశవాద ధోరణితో 2014 నుండే వ్యవహరించింది. అవశేష ఆంధ్రప్రదేశ్‌కు అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి ప్రయోజనం చేకూరుతుందనే ఏకైక లక్ష్యంగా పవన్ కల్యాణ్ 2014 ఎన్నికలో ఏమీ ఆశించకుండా భేషరతుగా తెలుగుదేశానికి మద్దతిచ్చారు. దీన్ని అలుసుగా తీసుకున్న టీడీపీ, ప్రధానంగా యువనేత నారా లోకేశ్ ఎవరున్నా లేకపోయినా తెలుగుదేశం గెలిచేదంటూ ఉత్తరప్రగల్భాల ప్రకటనలు చేస్తూ ఏపీలో అధికారాని అనుభవించారు. పవన్ సహాయ సహకారాలను విస్మరించి 2014 నుండి 2019 మధ్యకాలంలో జనసేనపై, జనసేనానిపై అనుకూల మీడియాలో, సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారు. 2019లో మితిమీరిన విశ్వాసంతో ఒంటరిగా పోటీచేసిన టీడీపీ భారీ మూల్యం చెల్లించుకుంది. ఈ పరిణామాలకి సూత్రధారి యువనేత లోకేశే. జగన్మోహన్‌రెడ్డి పరిపాలనతో దిమ్మతిరిగిన టీడీపీకి 2024లో గెలవకపోతే రాజకీయ భవిష్యత్తు ఉండదనే వాస్తవం తెలియడంతో పవన్ కల్యాణ్ విలువ తెలుగుదేశం నాయకులకు తెలిసివచ్చింది.
చంద్రబాబును జైలుపాలు చేసి ప్రతిపక్షం ఉనికి లేకుండా చూడాలని అధికార వైఎస్‌ఆర్‌సీపీ భావిస్తే, రాష్ట్రంలో అనిశ్చితి రాజకీయ వాతావరణం ఏర్పడకుండా ఉండేందుకు పవన్ కల్యాణ్ ముందుకొచ్చి రాజమండ్రి జైలు సాక్షిగా టీడీపీతో పొత్తు ప్రకటించారు. దీంతో తనంతట తాను ముందుకొచ్చిన పవన్‌ను టీడీపీ చులకన భావనతో చూడటం ప్రారంభించింది. మరోవైపు యువత, కాపు సామాజికవర్గంతో పాటు స్వయం ప్రకటిత కాపు నేతల నుండి పవన్ సీఎం కావాలనే కోరిక రోజురోజుకు అధికమైంది. టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా రెండు పార్టీలు సమస్థానాల్లో పోటీ చేయాలని, ముఖ్యమంత్రి పదవిపై షేరింగ్ ఉండాలనే ఒత్తిడి పవన్‌పై అధికంగా ఉంది. అయినా జనసేనాని అంతర్గత ఒత్తిడిని ఎదుర్కొంటూనే, తమ వాస్తవికత బలం తెలుసుకొని అందుకు తగ్గట్టుగానే అనేక త్యాగాలతో పొత్తుకు సిద్ధమయ్యారు. పవన్ కల్యాణ్ కాపు సామాజిక ఆత్మగౌరవాన్ని చంద్రబాబుకు తాకట్టుపెట్టారనే విమర్శలొచ్చినా ఆయన రాష్ట్ర భవిష్యత్ తరాల శ్రేయస్సు కోసం వైఎస్‌ఆర్‌సీపీని గద్దె దింపడమే ధ్యేయంగా జనసైనికులను సిద్ధపరుస్తున్నారు.
మన బలానికి తగ్గట్టుగా పోటీ చేద్దాం, రాష్ట్ర వ్యాప్తంగా మన బలం పెరిగాక మిగతా అంశాలను పరిశీలిద్దాం అంటూ జనసైనికులను మానసికంగా త్యాగాలకు పవన్ కల్యాణ్ సిద్ధపరుస్తుండగా, ఇందుకు భిన్నంగా టీడీపీ నేతలు ఒంటెత్తుపోకడలతో వ్యవహరిస్తున్నారు. పవన్ దీర్ఘకాలిక ప్రయోజనాలతో 2024 కంటే 2029లోనే జనసేనకు అధికారం సాధ్యమనే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పొత్తులో భాగంగా అసెంబ్లీ సీట్ల విషయంలో తగ్గినా కామన్ మినీమమ్ ప్రోగ్రాం కింద 1/3 వంతు స్థానిక సంస్థలు, ఎమ్మెల్సీ, రాజ్యసభ, నామినేటెడ్ పదవులు కచ్చితంగా మనకి వస్తాయని పవన్ జనసైనికులకు భరోసా కల్పిస్తూ రాబోయే ఐదేళ్లలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు.
వీటిని టీడీపీ చేతకాని తనంగా చూస్తోంది. జనసేనలో కీలక నేత నాందేడ్ల మనోహర్ తెనాలి నియోజకవర్గం నుండి పోటీ చేస్తారనేది బహిరంగ రహస్యమే అయినా, ఆయన కూడా అధికారికంగా పొత్తుల ప్రక్రియ పూర్తయ్యేవరకూ మౌనంగా ఉండాలనే నిబంధనలకు కట్టుబడ్డారు. అదే సమయంలో టీడీపీ టికెట్ ఆశిస్తున్న ఆలపాటి రాజతో సహా ఆయన అనుచరులు ఈ స్థానం టీడీపీకే ఇవ్వాలని, లేకపోతే కార్యకర్తలకు ఆత్మహత్యలే శరణ్యం వంటి బ్లాక్‌మెయిలింగ్ ప్రకటనలు చేసినా టీడీపీ అగ్రనాయకులు వారిని కట్టడి చేయడంలో విఫలమయ్యారు. ఇదే వాతావరణం జనసేన బలంగా ఉన్న పలు నియోజకవర్గాల్లో కూడా ఉంది.
ఈ పరిస్థితుల్లో అన్ని వైపుల నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఒత్తిడి రావడంతో పవన్ కల్యాణ్ అప్పటికీ సహనం కోల్పోకుండా గణతంత్ర దినోత్సవం రోజున మిత్రధర్మాన్ని మిత్రపక్షానికి తెలియజేశారు. టీడీపీ వ్యవహరించిన తీరుతో తాను కూడా రెండు సీట్లపై ప్రకటన చేయాల్సి వస్తుందని చెబుతూనే ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వకుండా వ్యవహరించారు. ఈ ప్రకటనతో పొత్తు విచ్ఛినం అవుతుందని ఆశించే వారికి అవకాశం ఇవ్వకుండా ‘ఒక మాట ఇటు అటైనా పొత్తు కొనసాగుతుంది, పొత్తు ధర్మానికి అందరూ విలువ ఇవ్వాలి’ అని ప్రకటించారు. మరోవైపు మిత్రపక్షం టీడీపీ మిత్రధర్మాన్ని విస్మరించడంతో అందుకు ఆయన జనసైనికులకు క్షమాపణలు చెప్పి తన పెద్దరికాన్ని చూపారు. ముఖ్యమంత్రిపై యువనేత లోకేశ్ వ్యాఖ్యానించినా పొత్తు ధర్మంలో భాగంగా పెద్దమనసుతో నేను స్పందించలేదని పవన్ వ్యాఖ్యానించారు. తన మంచితనాన్ని అలుసుగా తీసుకుంటే నష్టం తప్పదని సుతిమెత్తంగా ఆయన హెచ్చరించారు.
పొత్తులు, చర్చలు అనేవి ఇచిపుచ్చుకునే ధోరణిలో ఉంటాయనే ప్రాథమిక సూత్రాన్ని టీడీపీ విస్మరించింది. పొత్తులు విజయవంతం కావాలంటే ఒక అవగాహన ఏర్పడాలి, అందుకు సానుకూల వాతావరణంలో చర్చలు జరగాలి. ఎదుటువారికి గౌరవం, సమాన హోదా ఇవ్వాలి. లేకపోతే ఆదిలోనే హంసపాదు కావడం ఖాయం. 2004లో మావోయిస్టులతో చర్చలు జరిపేందుకు పూనుకున్న అప్పటి వైఎస్‌ఆర్ ప్రభుత్వం వారికి సమాన హోదా కల్పించింది. ఈశాన్య రాష్ట్రాలో కూడా పలు తీవ్రవాద సంస్థలతో శాంతి చర్చల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వారికి సమాన ప్రాధాన్యతిచ్చింది. 1984 నుండి పొత్తుల అనుభవమున్న టీడీపీ ఈ సిద్ధాంతాలను పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించి పొత్తు ధర్మానికి తూట్లు పొడిచింది.
జనసేనతో పొత్తు అంశంలో టీడీపీ ఓట్ల బదిలీ మూల సూత్రాన్ని మరిచింది. 2019 ఎన్నికల్లో జనసేన 6 శాతం ఓట్లతో 18 లక్షల ఓట్లు సాధించింది. రాబోయే ఎన్నికలో జనసేన రాష్ట్ర వ్యాప్తంగా 10-15 శాతం, ప్రధానంగా ఉభయగోదావరి, విశాఖ జిల్లాల్లో 20-25 శాతం ఓట్లు పొందే అవకాశాలున్నాయి. ఈ పరిణామాల మధ్య రాష్ట్ర వ్యాప్తంగా జనసేనకు 30-40 స్థానాల్లో టీడీపీ వారి ఓట్ల బదిలీ అవసరం ఉంది. అదే సమయంలో మిగిలిన స్థానాల్లో టీడీపీకి జనసేన నుండి ఓట్లు బదిలీ కావాలి. జనసేన కంటే టీడీపీకే ఓట్ల బదిలీ ఆవశ్యకత అనే వాస్తవాని టీడీపీ అధినేతు గ్రహించాలి.
మరోవైపు 2009లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోని సుమారు 50 స్థానాల్లో టీడీపీ గెలవలేదనేది వాస్తవికం. వీటిలో 11 ఎస్సీ, 5 ఎస్టీ నియోజకవర్గాలున్నాయి. ఈ కీలకాంశాల్ని మరిచిన టీడీపీ నాయకులు నోటికొచ్చినట్లు మాట్లాడుతూ రెండు పార్టీల మధ్య పొత్తును చెడగొడుతున్నారు. అధికారానికి ఐదేళ్లు దూరంగా ఉన్న టీడీపీ అద్దాల మేడలో ఉన్నామనే విషయాన్ని మరిచి వ్యవహరిస్తోంది. ప్రత్యర్థులపై చేయాల్సిన విమర్శలను మిత్రపక్షంపై చేస్తూ రాళ్లు వేయించుకుంటే అద్దాల మేడ కూలడం ఖాయం.
ఇదే సమయంలో జనసేనాని పవన్ కల్యాణ్ ఒక లెక్క ప్రకారం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో కూడా తెలిసిన జనసేనాని పవన్ తన మంచితనాన్ని బలహీనంగా తీసుకుంటే మాత్రం ‘తగ్గేదే లేదు’ అనేలా హెచ్చరిస్తూ రెండు స్థానాల్లో అభ్యర్థుల ప్రకటన టీడీపీని కంగారు పెట్టిస్తోంది. ఒకవేళ దురదృష్టవశాత్తు పొత్తు విజయవంతం కాకపోతే అది టీడీపీ అధినేతల స్వయంకృపారాధమే.
===============
– ఐ.వి.మురళీ కృష్ణ శర్మ,
రీసెర్చర్, పీపుల్స్‌పల్స్ రీసెర్చ్ సంస్థ,