Annacanteen: అన్న క్యాంటీన్లపై పీపుల్స్ పల్స్ నివేదిక..!

Annacanteen: అన్న క్యాంటీన్లపై పీపుల్స్ పల్స్ నివేదిక..!

Peoples pulse: ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘‘అన్న క్యాంటీన్ పథకం’’ పై పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ నివేదిక విడుదల చేసింది. కేవలం 5 రూపాయిలకే భోజనం అందిస్తున్న ఈ ‘‘అన్న క్యాంటీన్స్’’ పనితీరుపై పీపుల్స్ పల్స్ బృందం రాష్ట్ర వ్యాప్తంగా పలు అన్న క్యాంటీన్లను సందర్శించి, సమీక్షించి అధ్యయనం చేసింది. ఈ అధ్యయనంలో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడైనట్లు నివేదికలో పేర్కొంది.

టీడీపీ 2019లో అధికారం కోల్పోవడంతో అన్న క్యాంటీన్లను వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు నిలిపివేసింది. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ తిరిగి అధికారంలోకి రావడంతో 2024, ఆగస్టు 15వ తేదిన, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మళ్లీ ఈ క్యాంటీన్లను పున: ప్రారంభించారు. భోజన నాణ్యత, పరిశుభ్రత, మౌలిక సౌకర్యాలు, సిబ్బంది ప్రవర్తనతో పాటు పథకంపై లబ్ధిదారుల అభిప్రాయం తెలుసుకోవడానికి చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు… రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనేక అన్న క్యాంటీన్లను పీపుల్స్ పల్స్ బృందం సందర్శించింది. లబ్దిదారులతో, సిబ్బందితో మాట్లాడి ఈ పథకాన్ని క్షుణ్ణంగా పరిశీలించినట్లు పిమ్మట సలహాలు, సూచనలు చేసినట్లు సంస్థ నివేదికలో తెలిపింది.

లబ్ధి దారులతో మాట – ముచ్చట:

అన్న క్యాంటీన్ల నిర్వహణకు సంబంధించి పీపుల్స్ పల్స్ సంస్థ ప్రతినిధులు లబ్ధి దారులతో ముచ్చటించి అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు వినిపించినట్లు నివేదికలో వెల్లడించింది. ఈ క్యాంటీన్ల నిర్వాహకులు పలు చోట్ల సమయపాలన పాటించడం లేదని తమ దృష్టికి వచ్చినట్లు సర్వేలో ఎదురైన అనుభవాన్ని నివేదికలో పంచుకున్నారు.ఈ క్యాంటీన్లు ఉపయోగకరంగా ఉన్నాయని..కానీ, రూ. 5 కు వడ్డిస్తున్న భోజనం చిన్న పిల్లాడికి కూడా సరిపోవట్లేదని..చాలా తక్కువగా వడ్డిస్తున్నారని ..ఇదేమిటని అడిగితే, రూ.5కి ఇంతకు మించి రాదులే అని సిబ్బంది కసురుకుంటున్నారు అన్న మాటలు చాలా చోట్ల వినపడినట్లు తెలిపారు.

అన్న క్యాంటీన్ల పై పీపుల్స్ పల్స్ పూర్తి నివేదిక:

సమయ పాలన..
ముందురోజు డిమాండ్ ని బట్టి అక్షయపాత్ర ఫౌండేషన్ రోజూ తమ కిచెన్ల నుంచి ఆహారాన్ని అన్న క్యాంటీన్లకు సప్లయ్ చేస్తోంది. డిమాండ్, ప్రాంతాలను బట్టి ఒక్కో అన్న క్యాంటీన్ 300 నుంచి 500 మందికి కడుపు నింపుతున్నాయి. మెనులో చెప్పిన వివరాల ప్రకారం ఉదయం 7.30 గంటల నుంచి 10 గంటల వరకు అల్పాహారం, మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 3 గంటల వరకు భోజనం, రాత్రి 7.30 గంటల నుంచి 9 గంటల వరకు రాత్రి భోజనం కోసం తెరిచి ఉంచాలి.

తింటున్నది ఎవరు..?
ఈ క్యాంటీన్లలో ఎక్కువగా ఆహారం తింటున్నవారిలో ఇన్ఫార్మరల్ సెక్టార్ లో పని చేస్తున్నవారే ఎక్కువమంది ఉంటున్నారు. ముఖ్యంగా ఆటో డ్రైవర్లు, కూరగాయలు, పండ్ల వ్యాపారులు, చిరు వ్యాపారులు, కార్పెంటర్లు, ప్లంబర్లు, వలస కూలీలు అధికశాతం మంది అన్న క్యాంటీన్ కి వస్తున్నారు. అధికశాతం క్యాంటీన్లు ఆస్పత్రులు, బస్టాండులకు దగ్గరగా ఉండటం వల్ల చుట్టు పక్కల ఊళ్ల నుంచి టౌన్లకు వచ్చే రైతులు, ఆస్పత్రులకు వచ్చేవారి కుటుంబ సభ్యులు క్యాంటీన్లలో భోజనం చేస్తున్నారు. ఆస్పత్రులకు, బస్టాండులకు దగ్గరగా క్యాంటీన్ల నిర్మాణం చేపట్టడం మంచి విషయమే. అన్న క్యాంటీన్లకు వస్తున్నవారిలో ఎక్కువమంది ఆదాయం నెలకు రూ. 10,000 వరకు మాత్రమే ఉంది. అన్న క్యాంటీన్లలో రిపిటెడ్ కస్టమర్లు ఎక్కువగా ఉంటున్నారు.

పీపుల్స్ పల్స్ బృందం కలిసిన వారిలో… వారానికి 3 నుంచి 5 రోజులు ఈ క్యాంటీన్లలో భోజనం చేస్తున్నవాళ్లు 66 శాతం మంది ఉన్నారు. మొదటిసారి తింటున్నామని చెప్పినవాళ్లు 34 శాతం మంది ఉన్నారు. వీరిలో దాదాపు 80 శాతం మంది మగవాళ్లే అన్న క్యాంటీన్లకు వస్తున్నారు. ఇందులోనూ అధికశాతం మంది ఎస్సీలు, బీసీలే అని మా సర్వేలో తేలింది. ఎక్కువమంది మగవాళ్లే ఉండటం, సెపరేట్ క్యూ లైన్లు లేకపోవడం వల్ల మహిళలు అసౌకర్యంగా ఫీల్ అవుతున్నారు. ‘‘రైస్ కూడా సన్న బియ్యమే పెడుతున్నారు. క్వాలిటీ కూడా బాగుంది. కానీ, మహిళలు ప్రత్యేక ఏర్పాట్లు, క్యూ పెడితే బాగుంటుంది’’ అని విజయవాడ అన్న క్యాంటీన్ లో భోజనం చేస్తున్న రమాదేవి చెప్పింది.

నిరుద్యోగులకు మేలు..
పీపుల్స్ పల్స్ మాట్లాడినవారిలో 58 శాతం మంది నిరుద్యోగులు ఉన్నారు. వీరిలో చాలామంది పోటీ పరీక్షలకు కోచింగ్ తీసుకుంటున్నవారు, లైబ్రేరీల్లో చదువుకుంటున్నవారు, పబ్లిక్ వెల్ఫేర్ హాస్టల్స్ లో ఉంటున్న విద్యార్థులు ఉన్నారు. ‘‘అన్న క్యాంటీన్లు ప్రారంభించడానికి ముందు, మేమే వంట చేసుకునేవాళ్లం. కర్రీ పాయింట్లలో కర్రీ తెచ్చుకునేవాళ్లం. అన్నా క్యాంటీన్ల వల్ల తమకు ఆ బాధ తప్పింది, సమయం కూడా ఆదా అవుతోంది’’ అని విశాఖ పట్నంలో పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న త్రినాథ్, వెంకటేశ్ చెప్పారు. అన్న క్యాంటీన్లకు ఆదివారం సెలవు తీసివేయాలని కోచింగ్ తీసుకుంటున్నవాళ్లు, లైబ్రేరీల్లో చదువుకుంటున్న నిరుద్యోగులు చెప్పడం పీపుల్స్ పల్స్ బృందం రికార్డ్ చేసింది.

శుభ్రత ఎలా ఉంది..?
అన్న క్యాంటీన్ల శుభ్రత, నాణ్యత పట్ల 80 శాతంమంది సంతృప్తి వ్యక్తం చేశారు. క్యాంటీన్ల శుభ్రతను పర్యవేక్షించడానికి సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. అన్న క్యాంటీన్ లలో ఉపయోగించే ప్లేట్లను సబ్బు ఉపయోగించి, పరిశుభ్రమైన వేడి నీటితో ప్లేట్లను శుభ్రం చేస్తున్నామని చెప్తున్నారు. కానీ, వేడి నీళ్లతో కడిగిన ఆనవాళ్లు ఎక్కడా కనిపించలేదు. అలాగే, తాగునీటికి కూడా అనేక చోట్ల ఇబ్బంది ఉన్నది. ‘‘స్కీం బాగుంది. చాలామంది ఈ స్కీంని ఉపయోగించుకుంటున్నారు. కానీ, అన్న క్యాంటీన్లలో ప్లేట్లు సరిగ్గా కడగటం లేదు. క్యాంటీన్ లో ఇంకా శుభ్రత పెరగాలి. శుభ్రత పాటించకపోవడం వల్ల ఇక్కడ తిన్నవాళ్లలో చాలామందికి ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి’’ అని అనంతపురంలో రాజశేఖర్ అనే యువకుడు చెప్పాడు. మధ్య వయసు వారు శుభ్రత గురించి ఎక్కువ మాట్లాడటం లేదుగానీ, యువకుల్లో చాలామంది శుభ్రత విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.

సేవింగ్స్ పెరిగాయా..?
అన్న క్యాంటీన్ లో తినడం వల్ల తమ సేవింగ్స్ పెరిగాయని, ఆరోగ్యం కూడా బాగుంటుందని 52 శాతం మంది చెప్పారు. ‘‘విజయవాడలో నాకు ఎక్కడ డ్రాప్ పడినా… టైంకు దగ్గరున్న అన్న క్యాంటీన్ కి వెళ్లి భోజనం చేస్తాను. అన్ని చోట్లా ఒకే రుచి ఉంటుంది. ఈ క్యాంటీన్ వల్ల నాకు చాలా డబ్బు ఆదా అవుతోంది’’ అని విజయవాడలో ఆటో నడుపుతున్న నాగేశ్వర రావు చెప్పాడు. ‘‘నేను ఆటో నడిపితే రోజూ 500 నుంచి 600 వస్తాయి. వాటిలో టిఫిన్ కి 30, 40 రూపాయిలు పెట్టాలి. భోజనానికి వంద రూపాయిలు పెట్టాలి. మేం ఈ అన్నా క్యాంటీన్ వల్ల ఉదయం రూ.5, మధ్యాహ్నం రూ.5తో కడుపు నింపుకుంటున్నాం. దీంతో డబ్బు కూడా మాకు ఆదా అవుతోంది ’’ అని పాలకొల్లులో కృష్ణ చెప్పాడు. అన్న క్యాంటీన్లు వచ్చిన తర్వాత అక్కడ తినేవారు పని చేయడం మానేశారనే అపోహా ఉంది. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి లేదు. 59 శాతం మంది రెస్పాండెంట్లు తాము పని చేస్తున్నామని చెప్పారు. వైన్ షాపుల్లో మందుకు ఎక్కువ ఖర్చు పెట్టి, తక్కువ డబ్బులకు అన్న క్యాంటీన్లలో భోజనం చేస్తున్నవారు కూడా ఉన్నారనేది వాస్తవం.

క్వాలిటీ ఎలా ఉంది..?
క్యాంటీన్లు మళ్లీ తెరవడంపై 90 శాతానికి పైగా మంది లబ్దిదారులు సంతోషం వ్యక్తం చేశారు. బయట టిఫిన్ చేయాలంటే నాకు 40, 50 రూపాయలు అవుతుంది. ఇక్కడ 5 రూపాయలకే టిఫిన్ అందించడం ఆనందంగా ఉందని ఎక్కువమంది చెప్పిన ఏకాభిప్రాయంగా చెప్పారు. ‘‘మేం ఎరువుల కోసం గుంటూరుకు వచ్చాం. తిరిగి వెళ్లిపోతూ అన్న క్యాంటీన్‌లో భోజనం చేస్తా. చాలా బాగుంది. అంతకముందు ఇంటికెళ్లేదాక ఖాళీ కడుపుతో ఉండేవాడిని. పేదలకు, ప్రయాణాలు చేసేవారికి ఉపయోగంగా ఉన్న ఈ క్యాంటీన్లు ఇలాగే కొనసాగించాలి” అని గుంటూరు బస్టాండు వద్ద ఉన్న అన్న క్యాంటీన్ లో కలిసిన రైతు, వెంకటేశ్వర్లు చెప్పారు.

రుచి మారాలి…
ప్రారంభం రోజు వచ్చే నాయకులు తర్వాత రావడం లేదని, వారు వస్తున్నారని ముందే తెలిస్తే ఆ రోజు భోజనం క్వాలిటీగా తీసుకొస్తున్నారని జగదీశ్ అనే విజయనగరం యువకుడు చెప్పాడు. క్యాంటీన్ ప్రారంభించిన రోజు, రాజకీయ నాయకులు వచ్చిన రోజు ఉన్న క్వాలిటీ మిగతా రోజుల్లో ఉండటం లేదు. నాయకులు వస్తారని ముందే తెలిసి క్వాలిటీగా పెట్టడం కాకుండా, ప్రతి రోజూ క్వాలిటీగా పెట్టాలని విజయనగరంలో రాము అనే యువకుడు చెప్పాడు. కర్నూల్ లో పెద్దపాటి శ్యామ్ అనే యువకుడు కూడా ఇంచుమించు ఇలాగే చెప్పాడు. అన్న క్యాంటీన్లలో ఆహారం రుచి రోజూ ఒకేవిధంగా ఉంటుందని, కూరగాయలు మారినా… వండే విధానం, రుచి మారడం లేదని చెప్తున్నారు. ‘‘కర్రీస్ మారిస్తే బాగుంటుందండీ. అస్తమానం ఒకే రకమైన కూరలు పెడుతున్నారు. రుచిగూడా ఏం మారడం లేదు’’ అని ఏలూరులో సాయితేజ చెప్పాడు. ఇంకొంచెం స్పైసీగా కూరలు ఉంటే బాగుంటుందని కూడా చెప్తున్నారు.

tdp,janasena,bjp,ప్రశంసలు:
• హోటల్స్‌లో భోజనం చేయలేని నిరుపేదల మనసును అన్న క్యాంటీన్లు గెలుచుకున్నాయి.
• పోషకాహార లోపాలను తగ్గించడంలోనూ ఈ పథకం విశేషంగా సహాయపడుతోంది.
• కేవలం రూ.15కే భోజనం అందించడం ద్వారా ఈ పథకం అందరికీ అందుబాటులో ఉంటున్నది. ఆకలితో ఉన్నవారు నేరుగా క్యాంటీన్ కి వెళ్తే చాలు, ఎలాంటి గుర్తింపు కార్డు లేకుండానే భోజనం చేయవచ్చు. అందుకే, ఈ పథకం పేదవారి మనసు గెలుచుకుంది.
• చాలామంది రెండు టోకెన్లు తీసుకుని తింటున్నారు. టోకెన్లపై పరిమిత విధించకపోవడం పట్ల కూడా సానుకూలంగా ఉన్నారు. ముఖ్యంగా అల్పహారానికి ఎక్కువమంది రెండు టోకెన్లు తీసుకోవడం గమనించాం.
• ఎక్కువ శాతం అన్న క్యాంటీన్లు ఆస్పత్రులకు దగ్గరగా ఉన్నాయి. ఆస్పత్రులకు వచ్చే పేషెంట్లకు, వారిని చూసేందుకు వచ్చే బంధువులకు ఈ క్యాంటీన్లు అన్నపూర్ణను గుర్తు చేస్తున్నాయి.
• పర్మినెంట్ బిల్డింగ్స్ ఉండటం, ఈ పథకానికి ఉన్న సానుకూలత.

సవాళ్లు & సమస్యలు:
• లైన్ లో నిలబడటానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, దానిని తాము ఇబ్బందిగా భావించడం లేదని కూడా 68 శాతం మంది చెప్పారు. కానీ, అరగంట కన్న ఎక్కువ నిలబడటం అతిపెద్ద సవాల్. దీర్ఘకాలంలో ఇది సమస్యగా పరిణమించే అవకాశం ఉంది.
• కొందరు సిబ్బంది ప్రవర్తన విషయంలో ఫిర్యాదులు రావడం ఆందోళన కలిగిస్తోంది.అన్న క్యాంటీన్లలో పనిచేసే ఉద్యోగులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని, లబ్దిదారులతో స్నేహాపూర్వకంగా వ్యవహరించడం లేదని 80 శాతం మంది చెప్పారు.
• సిబ్బంది ప్రవర్తన, సమస్యలపై ఫిర్యాదు చేయడానికి ఒక వ్యవస్థ లేకపోవడం కూడా లోపంగానే చూడాలి. ఇప్పటికే ఫీడ్ బ్యాక్ కోసం ఏర్పాటు చేసిన క్యూ ఆర్ స్కాన్ అంత సులభంగా ఉపయోగించలేపోతున్నారు.
• అన్న క్యాంటీన్లలో ఆహారం రుచి రోజూ ఒకేవిధంగా ఉంటుంది. సెంట్రల్ కిచెన్లలో వండటం వల్ల కూరగాయలు మారినా… వండే విధానం, రుచి మారడం లేదు.
• ప్రతి క్యాంటీన్ లో తగినంత 5 రూపాయిల కాయిన్స్ అందుబాటులో ఉంచడం లేదు. పేదవారికి యూపీఐ చేసే స్తోమత కూడా లేకపోవడంతో చిల్లర సమస్య తలనొప్పిగా మారింది.
• ఈ క్యాంటీన్లలో శుభ్రత విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. కొన్ని క్యాంటీన్లు శుభ్రత విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నాయి.
• సోషల్ స్టిగ్మా ఉన్నవాళ్లు తక్కువ ధర ఆహారం తినడం ఏంటని, రెస్టారెంట్స్ లో తింటున్నారు.
• అన్న క్యాంటీన్ల క్వాలిటీని క్రమం తప్పకుండా చెక్ చేసే ఒక నిర్థిష్టమైన వ్యవస్థ లేకపోవడం ఒక లోపం.

మార్పులు & సలహాలు:
• మూడు పూటలకు లబ్దిదారులు 15 రూపాయిలే చెల్లిస్తున్నారు. కానీ, దీనికోసం ప్రభుత్వం మరో 75 రూపాయిలు చెల్లిస్తుందని చాలామందికి తెలియదు. ఈ విషయం అందరికీ తెలిసేలా ప్రచారం చేస్తే, ప్రభుత్వానికి మంచిది. 5 రూపాయిల భోజనం అని చిన్న చూపు చూసేవారికి కూడా విలువ తెలుస్తుంది.
• ఈ పథకానికి ఖర్చు చేస్తున్న నిధుల వినియోగంపై సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచి అవగాహన కల్పించాలి.
• ప్రతి క్యాంటీన్ లో 5 రూపాయిల కాయిన్స్ అందుబాటులో ఉంచడానికి ఆర్బీఐతో చర్చలు జరిపి, చిల్లర సమస్యను నివారించాలి.
• స్థానిక నాయకులు ఈ క్యాంటీన్లను క్రమం తప్పకుండా పర్యవేక్షించేలా చూడాలి. అవసరమైతే దీనికోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి.
• లోటుపాట్లు తెలుసుకోవడానికి ఏర్పాటు చేసిన క్యూ ఆర్ స్కాన్ సులభంగా ఉపయోగించలేపోతున్నారు. దీనికి బదులుగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ గానీ, సలహాల బాక్స్ గానీ ఏర్పాటు చేస్తే బాగుంటుంది.
• సర్వీంగ్ విషయంలో, సిబ్బంది దురుసు ప్రవర్తన విషయంలో లబ్దిదారుల్లో ఉన్న అసంతృప్తిని నివారించడానికి ఓపికతో వ్యవహరించేలా సిబ్బందికి శిక్షణ ఇప్పించాలి. సిబ్బంది ప్రవర్తన పట్ల నియంత్రణను కఠినంగా అమలు చేయాలి.
• తాగునీటి సౌకర్యం, శుభ్రత విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవాలి. ప్లేట్ల శుభ్రత విషయంలోనూ మరిన్న జాగ్రత్తలు అవసరం. క్యాంటీన్లలో శుభ్రత పాటించకపోతే కఠిన చర్యలు తీసుకోవాలి.
• చాలామంది పార్శిల్ సేవలను ప్రారంభించాలని కోరుతున్నారు. వృద్ధులకు, దివ్యాంగులకు, పేషంట్లకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది.
• మధ్యాహ్నాం సమయంలో క్యూలో ఎక్కువ సమయం పడుతోంది. కొన్నిసార్లు ఒక టోకెన్ దొరకడానికి అరగంట క్యూలో ఉండాల్సి వస్తోంది. మహిళలకోసం ప్రత్యేకంగా క్యూ లైన్ పెడితే మహిళా లబ్దిదారుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
• కర్రీలు వండే విధానం మారుస్తూ ఉండాలి. ఒకే రుచిలో కాకుండా… ఫ్రై కర్రీలు, వెజిటేబుల్ కర్రీలు ఇస్తే బాగుంటుంది. ఉల్లిపాయ వాడాలని, స్పైసీగా ఉండాలని చాలామంది చెప్పిన మాటను పరిగణనలోకి తీసుకుంటే మంచింది. ఇలా చేయడం వల్ల లబ్దిదారుల్లో ఆసక్తి పెరుగుతుంది. ఈ పథకం అమలును మహిళా సంఘాలకు అప్పగించడం వల్ల, వారికీ ఉపాధి లభిస్తుంది.
• ఈ పథకం నిరుద్యోగులకు చాలా మేలు చేస్తోంది. వారు ఉద్యోగం సాధించేవరకూ ఇక్కడ కడుపు నింపుకుని, సమయాన్ని, డబ్బును అదా చేసుకునే వెసులుబాటు కల్పించింది. కాబట్టి, ఆదివారం కూడా కనీసం లంచ్ పెట్టే అవకాశాన్ని పరిశీలించాలి. ఇలా చేయడం వల్ల నిరుద్యోగుల నమ్మకాన్ని గెలుచుకోవడానికి వీలుంటుంది.
• ఈ కార్యక్రమం గురించి మరింత అవగాహన పెంచేందుకు ప్రయత్నించాలి. చాలామంది 5 రూపాయిల భోజనం అని చిన్న చూపు చూస్తున్నవారికి కనువిప్పు కలిగేలా, ప్రభుత్వం దీనికోసం వెచ్చిస్తున్న 100 రూపాయిల గురించి ప్రజలకు తెలియజేయాలి.
• ప్రయివేట్ కార్పోరేట్ కంపెనీలు తమ సామాజిక బాద్యతగా ఈ క్యాంటీన్లకు ఆహారం ఇవ్వడం వల్ల నాణ్యత మరింత పెరిగే అవకాశం ఉంది.
• అవసరానికి తగినట్లు క్యాంటీన్లను ప్రాధాన్యత ఉన్న ప్రాంతాలకు విస్తరించాలి.

Conclusion:
తెలుగుదేశం పార్టీ ఇప్పటివరకూ అమలు చేసిన పథకాల్లో ఎన్టీఆర్ అన్న క్యాంటీన్ పథకం అత్యుత్తమైనదనడంలో ఎలాంటి సందేహం లేదు. హోటల్స్ లో ఫుడ్ కొనుక్కోలేని వారికి ఈ క్యాంటీన్లు ఆసరగా నిలిచాయి. పేదవారి ఆకలి తీర్చడంలో, పోషకాహారలోపం తగ్గించడంలో పరోక్షంగా అన్న క్యాంటీన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ పథకం ద్వారా రోజుకు మూడు పూటల భోజనం రూ.15కే అందించడం ద్వారా పేదలకు ఆర్థిక భారం తగ్గింది. పైన చెప్పుకున్నట్టు ఈ పథకం నిర్వహణలో కొన్ని సవాళ్లు కూడా ఎదురవుతున్నాయి. ఈ సవాళ్లను అధిగమించడానికి, పథకంలో పారదర్శకతను తీసుకురావాలి. శుభ్రత, సిబ్బంది ప్రవర్తనను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలి. దీనికోసం పటిష్టమైన నిఘా వ్యవస్థను రూపొందించాలి. సోషల్ వర్కర్స్, కార్పోరేట్ కంపెనీలను భాగస్వామ్యం చేసి పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ మోడల్‌ను అనుసరించడం ద్వారా పథకాన్ని మరింత బలోపేతం చేయవచ్చు.