Tamilnadu: నలుగురు తమిళనాడు పోలీసులు – లైంగిక దాడి ..!

Tamilnadu: నలుగురు తమిళనాడు పోలీసులు – లైంగిక దాడి ..!

విశీ:  పోలీసుల మీద జనానికి మిగిలి ఉన్న కాస్తో కూస్తో నమ్మకాన్ని చెరిపేసే ఘటనలు నిత్యం జరుగుతూనే ఉంటాయి. అందులో చాలా వరకు బయటికి రాకుండా లోలోపలే సమాధి అవుతుంటాయి. కొన్ని మాత్రం ఇలా బయటకు వచ్చి సంచలనం సృష్టిస్తాయి.

గతేడాది అక్టోబర్ 5న తమిళనాడు రాష్ట్రం తిరుచిరాపల్లి జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఆ జిల్లాలో ప్రఖ్యాతి పొందిన ముక్కోంబు డ్యామ్‌ను చూసేందుకు ఒక 17 ఏళ్ల అమ్మాయి, ఆమె స్నేహితుడు కలిసి వచ్చారు. సాయంత్రం 5 గంటల సమయంలో వారు ఒక చెట్టు కింద కూర్చుని ఉండగా, దగ్గరలో ఒక నలుగురు వ్యక్తులు మందు తాగుతూ ఉన్నారు. వాళ్లు వీళ్ల దగ్గరకు వచ్చి తాము పోలీసులమని, మిమ్మల్ని విచారించాలని అన్నారు. వాళ్లు మామూలు దుస్తుల్లో ఉండటంతో పోలీసులేనా, కాదా అని అమ్మాయికి, అబ్బాయికి అనుమానం కలిగింది.

ఈ నేపథ్యంలో వారికీ, ఆ నలుగురికీ మధ్య వాగ్వాదం నెలకొంది. దీంతో వారు ఆ అబ్బాయిపై చేయి చేసుకొని, ఆ అమ్మాయిని బలవంతంగా లాక్కెళ్లారు. కారులోని ముందు సీటులో ఎక్కించుకుని, విచారణ పేరిట గంటపాటు తిప్పారు. ఆ సమయంలో ఆ నలుగురూ ఆ యువతిపై లైంగిక దాడి చేసి, అసభ్యంగా ప్రవర్తించారు. ఆ తతంగాన్ని వీడియో తీశారు. ఆ తర్వాత ఆమెను డ్యామ్ వద్ద దింపేసి, ఈ విషయం ఎవరికైనా చెప్తే గంజాయి కేసులో ఇరికిస్తామని, ఇంట్లో వాళ్లకు చెప్తామని అన్నారు. దాంతోపాటు ఆ అమ్మాయి నెంబర్ తీసుకుని, తాము ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలని, లేకపోతే వీడియోలు బయట పెడతామని బెదిరించారు.

ఇంతకీ ఎవరా నలుగురు? జియాపురం పోలీస్ స్టేషన్ ఎస్సై బి.శశికుమార్, ఆ స్టేషన్ పరిధిలోని ట్రాఫిక్ విభాగంలో పనిచేసే ఎ.సిద్ధార్థన్, నావల్పట్టు పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ జె.ప్రసాద్, తిరువెరుంబూర్ జాతీయ రహదారి పెట్రోలింగ్ పోలీస్ ఎస్.శంకర్ రాజపాండియన్. ఈ నలుగురే ఆ నిందితులు. తాము పోలీసులం కాబట్టి తమనెవరూ ఏమీ చేయలేరని, కాదని ఎవరికైనా చెప్తే కేసులు పెట్టి ఇరికించొచ్చని వాళ్ల ధీమా. ఈ అబ్బాయి, అమ్మాయితోపాటు మరో జంటపైనా వారి దృష్టి పడింది. అయితే వాళ్లు తప్పించుకోగా, వీళ్లు చిక్కారు.

ఆ నలుగురూ బెదిరించినా ఆ అమ్మాయి, అబ్బాయి ధైర్యంగా నిలవడం ఈ కేసులో కీలకంగా మారింది. వాళ్లు ముక్కోంబు చెక్‌పోస్ట్ వద్దకు వచ్చి అక్కడున్న పోలీసులకు జరిగిన విషయం చెప్పారు. వారు ఎస్సై బి.శశికుమార్‌ను, ఇతర సిబ్బందిని పిలిచి విషయం కనుక్కున్నారు. ఈ సమయంలో శశికుమార్ మాట మార్చాడు. ఆ అమ్మాయి గంజాయి అమ్ముతుందనే అనుమానంతో విచారించామని, అంతకుమించి ఏమీ లేదని అన్నాడు. ఆ వాగ్వాదంలో మరోసారి ఆ అమ్మాయిని, అబ్బాయిని బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆ అమ్మాయి జియాపురం All Women Police Station(AWPS)లో ఫిర్యాదు చేసింది. దీంతో ఎస్పీ వరుణ్‌కుమార్ ఆ నలుగురికీ సమన్లు జారీ చేశారు. అదే రోజు వారిని అరెస్టు చేసి, వారిపై పోక్సో చట్టంతోపాటు భారతీయ శిక్షా స్మృతిలోని 323, 342, 506(i) కింద కేసులు నమోదు చేశారు.

ఈ కేసు తమిళనాడును కుదిపేసింది. పాలకపక్షం డీఎంకేపై ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోశాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలకు చోటు లేకుండా పోయిందని ఆరోపించాయి. ఏఐఏడీఎంకే, కాంగ్రెస్ పక్షాలు దీనిపై అసెంబ్లీలో చర్చకు పట్టుబట్టాయి. ముఖ్యమంత్రి స్టాలిన్ వారికి సమాధానం ఇస్తూ నిందితులను సస్పెండ్ చేసి, అరెస్టు చేశామని, వారిని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు.

ఇలాంటి ఘటనలు నిత్యం కోకొల్లలు. బాధితులు భయపడో, ఇబ్బందిపడో, సర్దుకుపోయి మౌనంగా ఉంటే మరింతగా అవస్థపడతారు. ధైర్యంగా ముందుకొచ్చి జరిగిన విషయాన్ని వెల్లడిస్తే ఇలాంటి దారుణాలను అడ్డుకునే అవకాశం దక్కుతుంది.