పోచారం, గుత్తా..అధినేత కేసీఆర్‌ పక్కన కూసోవడం చూడ ముచ్చటగా ఉంది!

Nancharaiah merugumala senior journalist:

“చట్టసభల అధ్యక్షులు పోచారం, గుత్తా తమ  అధినేత కేసీఆర్‌ పక్కన చిన్న కుర్చీల్లో కూసోవడం చూడ ముచ్చటగా ఉంది! తెలంగాణ రెడ్ల విధేయతే వారికి శ్రీరామరక్ష”

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్‌) ప్రతినిధుల సమావేశంలో పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు గారి ఎడమ పక్కన తెలంగాణ శాసనసభ స్పీకర్‌ పోచారం ‘పరిగె’ శ్రీనివాస్‌ రెడ్డి, శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి కూర్చున్నారు. తెలంగాణలోని రెండు చట్టసభల అధ్యక్షులైన ఈ ఇద్దరు రెడ్డి దిగ్గజాలు తాము అధ్యక్షతవహించే సభల్లో ఎత్తయిన కుర్చీలపై సుఖాసీనులవుతారు. కాని పార్టీ క్రమశిక్షణకు లోబడి సెంటర్లో పెద్ద కుర్చీలో ఉన్న పార్టీ అగ్రనేత కేసీఆర్‌ ఎడమ వైపు మామూలు చైర్లలో కూర్చోవడానికి ఇద్దరు రాజకీయ రెడ్లూ ఏమాత్రం వెనుకాడలేదు. తెలంగాణలో సకల రెడ్డి జనులు ఎందుకు పైకొస్తున్నారంటే..పోచారం, గుత్తా రెడ్లు అనుసరిస్తున్న రాజకీయ నిరాడంబరతే కారణమని చెప్పుకోవచ్చు. తెలంగాణ వ్యవసాయ కులాల్లో కాస్త ఎక్కువ జనాభా (దాదాపు 6 శాతం) ఉన్న రెడ్డీలు ఇలా అనవసరమైన కుల పట్టింపులు, రాజ్యాంగపరమైన హోదాలు మరిచి ప్రత్యేక రాష్ట్రం సాధించిన కేసీఆర్‌ పార్టీలో నిన్నటి భారాస సభలో మాదిరిగా ఒదిగి ఉంటే వారికెంతో మేలు జరుగుతుంది. రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు అనుముల రేవంత్‌ రెడ్డి వంటి జిత్తులమారి రెడ్డి నేతల మాట విని తమకు కొత్తగాని రాజ్యాధికారం కోసం తెలంగాణ రెడ్లు ఇక వెంపర్లాడకపోతేనే మేలు. మరో 50 సంవత్సరాలు తెలంగాణలో ముఖ్యమంత్రి పదవి పద్మనాయక వెలమ, మూన్నూరు కాపు, మాదిగ కులాల చేతిలో ఉన్నా రెడ్లకు ఏమీ నష్టముండదనే తెలివి రాష్ట్ర రెడ్లలో నెమ్మది నెమ్మదిగా రావడం సంతోషదాయకం. కే కేశవరావు, నామా నాగేశ్వరరావు వంటి తెలివైన నాయకులున్నా ఇప్పుడు పోచారం, గుత్తా వంటి రెడ్డి నేతలు కేసీఆర్‌ గారికి ఎంతో అవసరం. పాత గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాలు, తూర్పు గోదావరి జిల్లాల రెడ్లు కూడా పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, గుత్తా సుఖేందర్‌ రెడ్డి, ఇంకా మంత్రులు గుంటకండ్ల జగదీశ్‌ రెడ్డి, ఎస్‌ నిరంజన్‌ రెడ్డి, ఏ.ఇంద్రకరణ్‌ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, చామకూర మల్లారెడ్డి, వేముల ప్రశాంత్‌ రెడ్డి వంటి వినయ విధేయ రెడ్లను చూసి రాజకీయంగా నేర్చుకోవాల్సింది చాలా ఉందనిపిస్తోంది.

Optimized by Optimole