Love:
“ఆరురంగుల ప్రేమ”
1.
చివరకు తిట్టుకోకుండా
ఎంతోకాలం మోయలేని బరువులా
ప్రేమ వస్తుంది.
2.
చూస్తుండగానే తడబడుతూ వచ్చి,
చివరకు మండిపడే
కొవ్వొత్తి వెలుతురులా,
ఆకాశంలో మెరిసే సూర్యుడిలా
ప్రేమ వెంట వస్తుంది.
మరో రోజు తిరిగి రావడానికి నిష్క్రమించే
దాని పుట్టుకను మనం చూస్తాం.
3.
ప్రేమ-
చెట్టు నుంచి స్రవించే అడవితేనె.
మగువ తోటలో దొరికే
లేత మొక్కజొన్నకంకి రసధార.
4.
ప్రేమ అత్తిపవ్వు.
అది ఉడుంపట్టు మాయాజాలం,
లేదా ఒక దేవతాహస్తం.
తన ఉనికిని
హృదయానికి చాటుతూనే ఉన్నా,
మనం దాన్ని చూడలేం.
5.
ప్రేమ-
రాత్రిలాగ వచ్చిపోతూ ఉంటుంది.
వెళ్లిపోతున్నప్పుడల్లా
తనతో ఆత్మశకలాన్నొకటి
తీసుకుపోతూ ఉంటుంది.
వచ్చినప్పుడల్లా
హృదయంలో మిగిలి ఉన్నదాన్ని
చిందరవందర చేసేస్తుంది.
6.
జబ్బులాగానే
నిద్రకు నష్టం లేకుండా
ప్రేమ వికసిస్తుంది.
చావులాగానే
అది ఏ బాధలనూ
ఏమాత్రం అర్థంచేసుకోదు.
—
జేపోటెక్ మూలం: విక్టర్ టిరాన్
స్వేచ్ఛానువాదం: పన్యాల జగన్నాథదాసు