saibaba death:
చట్టం ముసుగులో…. చట్టవ్యతిరేకంగా, రాజ్యాంగం పేరిట… రాజ్యదాష్టీకంతో ఒక మానవ హక్కుల కార్యకర్తను, సమాజహిత మేధావిని వెంటాడి, వేటాడి, నిర్బంధించి, హింసించి యాభయారేళ్లకే నూరేళ్లు నిండేలా మట్టుపెట్టిన హంతకులెవరు? ఆయనది సహజమరణం మాత్రం కాదు, ఇది జగమెరిగిన సత్యం! మరి ఈ హత్యను ఎవరి అకౌంట్లో వేద్దాం? ఇప్పుడెవరిని శిక్షిద్దాం? హంతకులు తప్పించుకుపోవాల్సిందేనా? ఎవరమూ నోరెత్తకపోతే ఎలా?? ‘వంద మంది నేరస్తులు తప్పించుకుపోయినా పరవాలేదు, ఒక నిరపరాధికి శిక్ష పడొద్దు’ అన్న సహజన్యాయ సూత్రమే ఇక్కడ తలకిందులై, ఒక నిరపరాధి శిక్షలు, శిక్షలు, శిక్షలు, శిక్షలతో కడకు ప్రాణాలే హరించుకపోగా, అందుకు కారకులైన నేరస్తులంతా తప్పించుకుపోతే ఎలా??
ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రశ్నించడం తప్పా? పౌరులకు హక్కులపై అవగాహన కల్పించడం అపరాదమా ? ఏలినవారి దోపిడీని ఎండగట్టే జ్ఞానం ఆశ్రితులకు నేర్పించడం నేరమా? చట్టాన్ని, రాజ్యాంగాన్నీ గౌరవిస్తూనే, ఆ పరిధిలో ఏమేమి చేయొచ్చో బాధితులకు చెబితే ఎక్కడో ` ఎవరికో దడపుడితేనేం ? వారివారి పీఠాలు కదులుతాయని కలవరపడితే ఎలా? అధికారం అడ్డుపెట్టుకొని వారే కక్ష కడితే సహించాల్సిందేనా? చివరకు…. ఇంత ఘోరంగా ప్రాణాలే తీస్తే కూడా కిమ్మనొద్దంటే ఎలా? ఏదోటి చేయాలిగా? ఏమీ చేయొద్దా? మౌనంగా అన్నీ భరించడమేనా? ఎంతటి అన్యాయమిది??
మనలో చాలా చాలా మందిలాగా, ‘ఎవరెట్లాపోతే నాకేం’ అని ఓ మూలన ఒదిగి కూర్చోకుండా తపన పడ్డందుకు ఇంత దుర్మార్గమైన మరణమా? నలుగురికి చేతనైన సాయం చేద్దామని తనకున్న జ్ఞానాన్ని పంచినందుకు, పదిమందిని ఆలోచింపజేసినందుకు ఇంత పాశవికమైన చావా? ఇది చూస్తూ, సహిస్తూ… మనం నిమ్మళంగా ఎలా ఉండగలుగుతున్నామన్నది నన్ను రెండు రోజులుగా వెంటాడుతున్న వేధన, బాధ, భయం! ఆ… అవును భయమే!! ఇలా ఉంటే, చివరకు మనం ఏమైపోతాం!అనిపించదా? మీకు అనిపించట్లేదా?
హిట్లర్ నాజీల గుప్పెట్లో జర్మనీనలుగుతున్నపుడు, ‘మొదట వాళ్లు సోషలిస్టుల కోసం వచ్చారు…….సోషలిస్టును కాదు కదా అని మిన్నకున్నాను, తర్వాత వాళ్లు ….కాదు కదా అని మిన్నకున్నా…. తర్వాత వాళ్లు….. చివరకు వాళ్లు నాకోసం వచ్చినపుడు అటు, ఇటు చూద్దును కదా, నా చుట్టు ఎవరూ మిగిలి లేరు’ అన్న మార్టిన్ నీమొల్లర్ మాటలు గుర్తుకు రావూ? ప్చ్!
అది నేరమే కాదని ఉన్నత న్యాయస్థానం చెప్పినట్టుగా, ఒక చేయని నేరానికి తొమ్మిదేళ్ల కారాగార శిక్ష అనుభవించాల్సి వచ్చిన దురవస్థకు కారణమెవరు? పగలు, రాత్రి తేడా లేకుండా… ఏరోజు, ఏ పూట, ఏ దిశలో కళ్లు తెరిచినా అంగుళం దూరంలో గోడ మాత్రమే కళ్లకు కట్టే దుర్మార్గమైన ‘అండాజైల్’ నిర్బంధం ఎంత నిర్హేతుకం? మరెంత నిర్దాక్షిణ్యం?? అది కూడా, 90 శాతం అంగవైకల్యంతో జీవిస్తున్న వ్యక్తిని ప్రమాదకారిగా శంకించి, ఆరోపించి, అర్భన్ నక్సలైట్గా ముద్రవేసి, అవమానించి, హింసించి, కడకు నశింపజేస్తే…. మనం ఎవరినీ, ఎమనీ అడగొద్దా? అటు రాజ్యం, ఇటు న్యాయస్థానం…. ఎవరకీ బాధ్యత, జవాబుదారుతనం ఉండవా? ఏ వ్యవస్థలో ఉన్నామసలు మనం??
మోపిన అభియోగం నేరంగా నిర్దారణ అయితే పడే గరిష్ట శిక్షా కాలం కన్నా… ఎన్నో రెట్లు ఎక్కువ కాలం ‘విచారణ ఎదుర్కొంటున్న ఖైదీలు’గానే జైళ్లలో మగ్గుతున్న దుర్బాగ్యులెందరో ఈ దేశంలో! ‘‘బెయిలే సాధారణం, జైలే అసాధారణం’’ అని న్యాయసూత్రాలు గొంతెత్తి ఘోషిస్తున్నా, బెయిల్ ఇవ్వని కింది స్థాయి న్యాయమూర్తుల వైఖరిని ఈ దేశ అత్యున్నత న్యాయస్థానమే తప్పుబట్టినా….. బాధితులకు నికరంగా ఒరిగిందేమీ లేదు కంఠశోష తప్ప!
శిక్షపడ్డ ఖైదీల సంగతి సరే, విచారణనెదుర్కొంటున్న ఖైదీల హక్కులు ఎవరికైనా పడుతున్నాయా? నేరం నిర్దారణ కాక, వారు నిరపరాధులుగా విడుదలైతే…. ‘నిష్కారణంగా జైలులో కాలిభూడిదైన వారి అమూల్య జీవన కాలాన్ని’ ఎవరు వెనక్కి తెచ్చిస్తారు? నిర్బంధంలో దొరకని సాంత్వన, దక్కని పౌష్టికాహారం, వెంటాడిన రుగ్మతలు, లభించని వైద్యం వల్ల…. బయటకు వచ్చాకైనా అకాల మరణమే సంభవిస్తే, ఆ చావుకు బాధ్యులెవరు? 2022 క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం, భారత దేశ జైళ్లలో మగ్గే జనాభాలో 76 శాతం మంది విచారణ ఎదుర్కొంటున్న ఖైదీలే! బాధితుల వ్యధలే తప్ప, సకాలంలో దర్యాప్తు జరుపనందుకు, నిర్దేశిత గడువులోపల అభియోగత్రం దాఖలు చేయనందుకు, అనుచిత విచారణ జాప్యాలకు…. ఎవరూ బాధ్యులు కారా? ఎవరికీ జవాబుదారుతనం ఉండదా? ఉండక్కర్లేదా?
‘‘నేను జైళ్లోనే చచ్చిపోతానని భావించారు అక్కడి అధికారులు, కానీ, బతికి బయటకు వచ్చాను’’ అన్న ఆయన మాటలు, ఇంకా మన చెవుల్లో ఖంగుమంటూనే ఉన్నాయి.
‘‘నిష్కారణంగా నన్నింతకాలం దూరం చేసుకొని…. అలవికాని దు:ఖంతో అలమటిస్తున్న నా భార్య, కూతురితో కొంతకాలం గడుపుతాను’’ అని, కడకు వారికీ దక్కకుండా పోయిన ఆయన చివరి మాటలు మన చెవుల్లో మార్మ్రోగుతూనే ఉంటాయి, మనం బతికినంత కాలం!
_ దిలీప్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్.
(పీపుల్స్ పల్స్, రీసర్చ్ సంస్థ)