Haryana elections2024:
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అంచనాలకు భిన్నంగా రావడంతో రాజకీయ విశ్లేషకులను విస్మయానికి గురిచేయడంతో పాటు అన్ని సర్వే సంస్థల అంచనాలు తప్పాయి. ఎన్నికల్లో ఒక్క శాతంలోపు ఓట్ల వ్యత్యాసంతో దోబూచులాడిన ఫలితం చివరికి బీజేపీకి పట్టంకట్టి, కాంగ్రెస్ను నిరాశకు గురిచేసింది. లోక్సభ ఎన్నికల్లో హర్యానాలో నువ్వా నేనా అన్నట్టు తలపడిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మొత్తం పది స్థానాల్లో చెరో ఐదింటిని సాధించడంతో శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్పై అంచనాలు పెరిగాయి. ఐదు నెలల వ్యవధిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి భంగపాటు తప్పదని, కాంగ్రెస్కు అధికారం ఖాయమనే అభిప్రాయం అన్ని వైపులా వినిపించినా వాస్తవ ఫలితాలు వేరుగా రావడానికి ప్రధాన కారణం పోటాపోటీగా జరిగిన ఈ ఎన్నికల్లో బీజేపీ అందివచ్చిన ఏ ఒక అవకాశాన్నీ జారవిడుచుకోకపోవడం, కాంగ్రెస్లో మితిమీరిన విశ్వాసం.
రెండు పర్యాయాలు రాష్ట్రంలో వరుసగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడడంతో తమకు ఎదురు లేదని ఊహించిన కాంగ్రెస్ స్వల్ప ఓట్ల వ్యత్యాసంతో 11 సీట్ల తేడాతో ఓడిపోయింది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీపై 1.5 శాతం ఓట్లను అధికంగా సాధించిన కాంగ్రెస్, అసెంబ్లీ ఎన్నికల్లో 0.8 శాతం తక్కువ ఓట్లను పొంది అధికారానికి దూరం అయ్యింది. బీజేపీ 39.94 శాతం ఓట్లతో 48 సీట్లు, కాంగ్రెస్ 39.09 ఓట్లతో 37 సీట్లు సాధించడంతో కేవలం 0.7 శాతం ఓట్ల వ్యత్యాసంతో ఫలితాలు తారుమారయ్యాయి. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్తో జతకట్టి పోటీ చేసిన ఆప్ అసెంబ్లీ ఎన్నికల్లో విడిగా పోటీ చేసి 1.7 శాతం ఓట్లను తెచ్చుకుంది. ఆప్తో కాంగ్రెస్కు జరిగిన నష్టం కొంతవరకే అన్నట్టు పైకి కనిపించినా పలు నియాజకవర్గాల్లో తక్కువ మెజార్టీలతో ఫలితాలు రావడంతో కాంగ్రెస్కు ఆప్తో నష్టం జరిగిందనే చెప్పవచ్చు. ఇండిపెండెంట్లు కూడా 11 శాతంకు పైగా ఓట్లు సాధించి పలు సెగ్మంట్లలో భారీగా కాంగ్రెస్ ఓట్లు చీల్చారు. మరోవైపు ప్రాంతీయ పార్టీలు ఐఎన్ఎల్డీ, జేజేపీ పూర్తిగా బలహీనపడడంతో బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే ప్రధాన పోటీ ఉంటుందని, దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా కాంగ్రెస్కు ప్రయోజనం కలుగుతుందనే అంచానాలు కూడా తప్పాయి. జాట్లలో పట్టున్న ఐఎన్ఎల్డీ, జేజేపీ ఆ సామాజిక వర్గం ఓట్లను చీల్చడంతో తక్కువ మెజార్టీ వచ్చిన సెగ్మంట్లలో కాంగ్రెస్కు నష్టం జరిగింది.
హర్యానా ఆవిర్భావం నుండి రాష్ట్ర రాజకీయాల్లో జాట్ల ఆధిపత్యం కొనసాగుతుండడంతో ఆ సామాజిక వర్గం కేంద్రకంగానే అసెంబ్లీ ఎన్నికలు సాగాయి. కాంగ్రెస్కు ఈ సామాజికవర్గం వెనుదన్నుగా ఉంది. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో రైతు ఉద్యమాలు కూడా పెద్ద ఎత్తున జరగడంతో కాంగ్రెస్ ఆశలు రెట్టింపయ్యాయి. దీనికి ప్రధాన కారణం వ్యవసాయ రంగంలో జాట్లు అధికంగా ఉండడమే. జాట్ల రిజర్వేషన్ ఉద్యమం కూడా కాంగ్రెస్కు కలిసి వచ్చింది. ఈ పరిణామాలతో కాంగ్రెస్ జాట్ల ఓట్లపై అధికంగా ఆశలు పెట్టుకొంది. అయితే ఆ ఆశలు అడియాసలు కావడానికి కూడా జాట్లే కారణమయ్యారు. జాట్ల ఏకీకరణతో తిరుగులేదని భావించిన కాంగ్రెస్కు జాట్లేతర సామాజిక వర్గాల ఏకీకరణ తీవ్ర నష్టం కలిగించింది. అగ్రవర్ణ జాట్ల ఆధిపత్యాన్ని సహించలేని ఇతర సామాజికవర్గాలు వారిని అడ్డుకోవాలనే లక్ష్యంగా ఓట్లు వేశారు. అగ్రవర్ణానికే చెందిన బ్రాహ్మణులు, రాజపుత్లు, బనియన్లతో పాటు ఓబీసీలు కూడా జాట్లపై ఆగ్రహంతో కాంగ్రెస్కు వ్యతిరేకంగా బీజేపీకి ఓట్లు వేశారు.
కాంగ్రెస్ పార్టీ జాట్ల రాజకీయాలను పసిగట్టిన బీజేపీ లోక్సభ ఎన్నికలకు ఆరు నెలల ముందే చర్యలు చేపట్టింది. జాట్లకు వ్యతిరేకంగా ఓబీసీలను ఆకర్షించాలనే ప్రణాళికలతో మనోహర్లాల్ ఖట్టర్ స్థానంలో ఓబీసీకి చెందిన నయాబ్ సింగ్ సైనీని ముఖ్యమంత్రిని చేసింది. అయితే ఈ ప్రయోగంతో లోక్సభ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీకి భంగపాటు తప్పదనే ప్రచారం సర్వత్రా వినిపించింది. అయితే బీజేపీ మైక్రోలెవల్ స్థాయిలో సోషల్ ఇంజినీరింగ్పై దృష్టి పెట్టి టికెట్ల కేటాయింపులోనే తగిన జాగ్రత్తలు తీసుకొని సఫలమయ్యింది. టికెట్ల కేటాయింపులో కాంగ్రెస్ జాట్లకు 31 శాతం సీట్లు ఇవ్వగా, బీజేపీ 17 శాతానికే పరిమితం చేసి ఓబీసీలకు, బ్రాహ్మణులకు అధిక ప్రాధాన్యతిచ్చింది. జాట్ల ఓట్లు అధికంగా ఉండే సెగ్మంట్లలో ఐఎన్ఎల్డీ, జేజేపీతో పాటు పెద్ద ఎత్తున ఇండిపెండెంట్లుగా జాట్ సామాజిక అభ్యర్థులు పోటీ చేయడంతో వారి మధ్య జాట్ల ఓట్లు చీలి జాట్లేతర అభ్యర్థులను బరిలోకి దింపిన బీజేపీకి లబ్ది కలిగింది. మరోవైపు కాంగ్రెస్ ఎస్సీల ఓట్లపై కూడా నమ్మకం పెట్టుకుంటే, బీజేపీ ఎస్సీ ఓటర్లలో చీలిక తేవడంలో విజయవంతం అయ్యింది. ఎస్సీ సామాజిక వర్గంలో కాంగ్రెస్ చమర్లకు ప్రాధాన్యతివ్వగా, బీజేపీ వాల్మీకులకు పెద్దపీట వేసింది. కాంగ్రెస్తో పోలిస్తే బీజేపీ సోషల్ ఇంజినీరింగ్ను పటిష్టంగా అమలు చేసి అసెంబ్లీ ఎన్నికల్లో సత్ఫలితాలు పొందింది. కులసమీకరణలో బీజేపీ ఉత్తరప్రదేశ్ ఫార్మూలను హర్యానాలో కూడా విజయవంతంగా ప్రయోగించింది. యూపీలో సమాజ్వాదీ పార్టీకి పట్టున్న యాదవ్, ముస్లిం సామాజిక వర్గాలకు వ్యతిరేకంగా యాదవేతర ఓబీసీలను, ఎస్సీ, ఎస్టీలను, అగ్రవర్ణాలను ఏకీకరణ చేసిన విధంగా హర్యానాలో కూడా జాట్లకు వ్యతిరేకంగా ముప్పైకిపైగా జాట్లేతర సామాజిక వర్గాలను ఏకీకరణ చేయడంలో బీజేపీ సఫలమయ్యింది. లోక్సభ ఎన్నికల అనంతరం హర్యానాలో అధికారం ఖాయమనే ఆత్మవిశ్వాసంతో ఉన్న కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాటలు అధికమవ్వడం కూడా ఫలితాలపై పడిరది. మాజీ ముఖ్యమంత్రి భూపీందర్ సింగ్ హూడా, లోక్సభ ఎంపీ కుమారి సెల్జా వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడిచింది. ఎవరికి వారే తామే కాబోయే సీఎంగా చేసిన పలు ప్రకటనలు పార్టీలో గ్రూపు రాజకీయాలను మరింత రగిల్చాయి. పార్టీ అధిష్టానం కూడా దీనిపై నేరుగా స్పష్టత ఇవ్వకుండా పూటకో మాట మాట్లాడి పార్టీ కార్యకర్తలను మరింత గందరగోళానికి గురిచేసింది. ఎంపీలకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇవ్వడం లేదని ప్రకటించిన పార్టీ అధిష్టానం, మరునాడే సీఎం పదవికి ఎవరైనా పోటీ పడవచ్చని, గెలిచిన ఎమ్మెల్యే అభ్యర్థులు ముఖ్యమంత్రిని ఎంపిక చేసుకుంటారని ప్రకటించింది. దీంతో ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికలో పార్టీలో వర్గపోరు తీవ్రమయ్యింది. అభ్యర్థుల ఎంపికలో హూడా వర్గానికి పెద్దపీట వేశారని, అసంతృప్తికి గురైన కుమారి సెల్జా ప్రచారానికి కూడా దూరంగా ఉన్నారు. పార్టీ హైకమాండ్ చొరవ తీసుకోవడంతో చివరి దశలో రాహుల్, ప్రియాంక గాంధీలు పాల్గొన్న ఎన్నికల ప్రచారంలో కుమారి సెల్జా కనిపించారు. ఈ అధినేతల వర్గపోరును బీజేపీ అనుకూలంగా మార్చుకుంది. కాంగ్రెస్లో అగ్రవర్ణ జాట్ నేతల చేతిలో దళిత మహిళా నేత కుమారి సెల్జాపై వివక్ష కొనసాగుతుందని, ఆమెకు తమ పార్టీలో ప్రాధాన్యతిస్తామంటూ బీజేపీ అధినేతలు ప్రకటనలు గుప్పించారు.
టికెట్ల కేటాయింపులో కూడా కాంగ్రెస్ పలు పొరపాట్లు చేసింది. కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ పార్టీ తిరుగుబాటు అభ్యర్థులు పదికిపైగా స్థానాల్లో ఆ పార్టీ ఓటమికి కారణమయ్యారు. ఇందుకు ఉదాహరణగా బహదూర్ఘర్ అసెంబ్లీ సెగ్మంట్ను చెప్పుకోవచ్చు. ఇక్కడ కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడి ఇండిపెండెంట్గా పోటీ చేసిన రాజేష్ బీజేపీపై గెలవగా, సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేందర్ సింగ్ మూడో స్థానానికే పరిమితమయ్యారు. మొత్తంమీద కాంగ్రెస్ 28 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తిరిగి బరిలోకి దింపగా వారిలో 14 మంది ఓడిపోయారు. భారీగా కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు బరిలోకి దిగినా వారిని పోటీ నుండి తప్పించేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా పూర్తి బాధ్యతలను హూడాకే అప్పగించింది. మరోవైపు లోక్సభ ఎన్నికల్లో భంగపడ్డ బీజేపీ తరఫున ఆర్ఎస్ఎస్ క్షేత్రస్థాయితో పాటు టికెట్ల కేటాయింపులో కూడా ప్రధాన భూమిక పోషించి గెలుపు గుర్రాలకే ప్రాధాన్యతిచ్చింది. మహేందర్ఘర్లో ఐదు సార్లు గెలిచిన మంత్రి రామ్ బిలాస్ శర్మకు బీజేపీ నిక్కచ్చిగా టికెట్ నిరాకరించడాన్ని ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
హర్యానా అసెంబ్లీ ఎన్నికలపై పలు ప్రముఖ సర్వే ఏజెన్సీలతోపాటు పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ అంచనాలు కూడా తప్పాయి. ఎన్నికల షెడ్యూల్ కంటే మందే రాష్ట్రంలో పలుమార్లు పర్యటించిన మా సంస్థ అంచనాలకు భిన్నంగా ప్రజా తీర్పు రావడానికి ప్రధాన కారణం స్వల్ప మెజార్టీలతో పాటు తక్కువ ఓట్ల శాతం వ్యత్యాసమే. దీంతో పాటు పెద్ద ఎత్తున ఇండిపెండెంట్లు బరిలో ఉండడంతో కూడా సర్వే సంస్థల అంచనాలు తప్పాయి. ఈ ఎన్నికలు నూతన అనుభవాన్ని నేర్పడంతో పాటు మరింత లోతుగా పరిశోధన చేయాలనే సరికొత్త పాఠాన్ని అన్ని సర్వే సంస్థలకు తెలియజేశాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
==========
-ఐ.వి.మురళీ కృష్ణ శర్మ,
పొలిటికల్ ఎనలిస్ట్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ.