Razakarreview: రివ్యూ..హిందువులపై రజాకార్ల మారణహొమం.. !

Razakarreview:

‘ రజాకార్ ‘ సినిమా అనౌన్స్ చేసిన నాటి నుంచి  రాజకీయ పరంగా ఎన్నో విమర్శలు. ఓ  వర్గం  సినిమాను అడ్డం పెట్టుకొని మత కలహాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రధాన ఆరోపణ. ఏదైతేనేం ఎన్నో వివాదాల కేంద్రంగా నిలిచిన ఈ మూవీ  శుక్రవారం సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలంగాణ విముక్తి పోరాట నేపథ్యంలో సాగే చారిత్రక కథాంశంతో రూపొందిన  ‘ రజాకర్ ‘ మూవీ ఎలా ఉంది? తెలంగాణ పోరాట యోధుల గాథను ఎలా చూపించారు? ఓ వర్గం ఆరోపించినట్లు మూవీలో వివాదాస్పద అంశాలు ఏమైనా ఉన్నాయా? లేదా సమీక్షలో తెలుసుకుందాం..!

కథ:

భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన హైదరాబాద్ సంస్థానం మాత్రం ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ( మకరంద్ దేశ్ పాండే) రాచరిక పాలనలో ప్రజలు గోస పడుతున్న రోజులవి.  దేశంలోని అన్ని రాజ్యాలను.. సంస్థానాలను..భారత్ లో విలీనం చేయాలని అప్పటి ప్రభుత్వం ఆదేశాలను జారీ చేస్తుంది. కానీ నిజాం ప్రభువు మాత్రం ప్రభుత్వంతో విభేదించి రజాకార్ల ప్రవేట్ సైన్యం( రజాకార్స్ పార మిలిటరీ ఆర్మీ ఫోర్స్)తో హైదరాబాద్ సంస్థానాన్ని తుర్కిస్తాన్ అనే దేశంగా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంటాండు. ఈ విషయంలో క్రూరత్వానికి మారుపేరైన రజాకర్ల  సైన్యం చీఫ్ ఖాసిం రజ్వీ (రాజ్ అర్జున్) నిజాం సంస్థానం ప్రధాని లాయర్ అలీ ఖాన్ (జాన్ విజయ్) తో కలిసి హిందువులను బలవంతంగా మతమార్పిడి చేయించేందుకు మారణ హోమం సృష్టిస్తారు. అప్పటి భారత హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నిజాం దురాగతాలను తెలుసుకొని హైదరాబాద్ సంస్థానాన్ని భారత్లో విలీనం చేసేందుకు పోలీస్ చర్య చేపడతారు. ఇంతకు నిజాం ప్రభువు అకృత్యాలు నుంచి తప్పించుకునేందుకు  హిందువులు ఎలాంటి పోరాటాలు చేశారు? పోలీస్ చర్య నుంచి నిజాం హైదరాబాద్ సంస్థానాన్ని కాపాడుకున్నాడా? లేదా అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే..?

నిజాం కాలంలో తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రత్యేక స్థానం ఉంది. మతమార్పిడుల కోసం అప్పటి నిజాం తో కలిసి రజాకార్ల చీఫ్ ఖాసీం రజ్వీ సృష్టించిన మారణ హోమం గురించి కథలుకథలుగా చదువుకున్నాం. ఆ కాలంలో హిందువులపై జరిగిన దురాగతాలను తెరపై చూపించే ప్రయత్నం చేసింది రజాకార్ మూవీ చిత్ర యూనిట్. ఫస్ట్ ఆఫ్..  నిజాం పరిపాలనలో గ్రామాల్లో మహిళలు, ఆడ పిల్లలపై అఘాయిత్యాలు.. స్వాతంత్రం కోసం గ్రామాల్లో ప్రజలు తిరుగుబాటు వంటి సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగుతుంది. సెకండాఫ్..తబ్లిగ్ ఫర్మానా పేరుతో రజాకార్లు ప్రజలను బలవంతంగా మత మార్పిడి చేయించిన తీరు.. తెలంగాణ ప్రజలు తిరుగుబాటు.. పోలీస్ చర్య ను సమర్థిస్తూ గ్రామ గ్రామాన వాళ్ళకి మద్దతుగా నినాదాలు చేయడం వంటి సన్నివేశాలు.. తెలంగాణ సాయుధ పోరాట వీర గాధలను గుర్తుకు తెచ్చే విధంగా ఉన్నాయి. రజాకార్ల ఆకృత్యాలు చూస్తున్నపుడు చలించిపోయి తిరగబడాలి అనేంత కోపం వచ్చేలా  సన్నివేశాలు ఉన్నాయి. బతుకమ్మ ..బతుకమ్మ .. పాట సినిమాకే హైలెట్.

ఎవరెలా చేశారంటే..?

సినిమాలో ఫలానా పాత్ర అంటూ ఏమీ ఉండదు. ఒక్కో సన్నివేశంలో ఒక్కో నటుడు తమ తమ పాత్రల్లో జీవించేశారు. ముఖ్యంగా ఖాసిం రజ్వీ పాత్రలో రాజ్ అర్జున్ నటన సినిమాకే హైలైట్ అని చెప్పవచ్చు.

సాంకేతికత:

దర్శకుడు యాట సత్యనారాయణ తను చెప్పాలనుకున్న కథను తెరపై చూపించడంలో  సక్సెస్ అయ్యాడు. నిజాం కాలం నాటి వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించే ప్రయత్నాన్ని ప్రశంసించి తీరాల్సిందే. సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ సినిమాకే హైలెట్. నిర్మాణ విలువలు బాగున్నాయి.

” ఒక్క మాటలో చెప్పాలంటే.. తెలంగాణ సాయుధ పోరాటానికి రూపం ” రజాకార్” 

రివ్యూ: 3.5/5