ఆర్. దిలీప్ రెడ్డి ( మాజీ ఆర్టీఐ కమిషనర్, సీనియర్ జర్నలిస్ట్):
ప్రజలను శక్తివంతులను చేయడం పాలకులకు ఇష్టముండదు. తమపై ఆధారపడుతూ, ప్రజలెప్పుడూ దుర్బలులుగా ఉండటాన్నే వారు కోరుకుంటారు. జనం ఏ కొంచెం బలపడుతున్నారని పొడగన్నా చాలు… దాన్ని భంగపరిచే వరకు నిద్రపోరు. ఎక్కడ ప్రజలు తెలివిపరులై ఏమడుగుతారో? ఏ తప్పులను ఎండగడతారో? ఏమి జవాబు చెప్పాల్సి వస్తుందో? తమ పని మరింతగా సంక్లిష్టమౌతుందేమో…..? ఇవే వారి భయాలు!
నెమ్మదిగా బలపడుతున్న ఒక సువ్యవస్థ ‘అధికారిక సమాచార వెల్లడి ప్రక్రియ’ (a process of official information flow) ని పాలకులు కుట్రపూరితంగా బలహీన పరచడమే అందుకు నిదర్శనం. సమాచార హక్కు చట్టం (RTI Act) అమలును దేశవ్యాప్తంగా నిర్వీర్యం చేశారు. సవరణలతో చట్టం కోరలు (ఉన్న ఆ మాత్రం) పీకేశారు. ఎన్నో ప్రజాస్వామ్య సంస్థలను కుప్పకూల్చారు. పనిగట్టుకొని కమిషన్లను బలహీనపరిచారు. ప్రజలు కోరే సమాచారం విధిగా అందించాల్సిన అధికార వ్యవస్థ బాధ్యత-జవాబుదారుతనాన్ని ప్రశ్నించి, నిలదీసే ఒక యంత్రాంగాన్నే పూర్తిగా నీరుగార్చారు. ఇది దాదాపు అంతటా జరుగుతోంది. తెలంగాణలో అసలు ఆర్టీఐ కమిషనే ఉనికిలో లేని పరిస్థితి. చివరి కమిషనర్ కూడా రిటయరై యేడాది దాటింది. ఏపీ లో కమిషన్ ఉన్నా క్రియాశీలంగా చేస్తున్నదేమీ లేదు. హైకోర్టు పలుమార్లు మందలించినా…. సకాలంలో కమిషనర్లను నియమించి, కమిషన్ ను ఉనికిలో వుంచే చర్యల్ని ప్రభుత్వాలు తీసుకోవడం లేదు. ఫలితంగా RTI అమలును పర్యవేక్షించే ఒక నిఘా, నిర్వహణ, నియంత్రణ వ్యవస్థే లేకుండా పోయింది. సమాచారం ఇవ్వాల్సిన ప్రాథమిక స్థాయి అధికారి నుంచి, అత్యున్నత సంస్థలు, వ్యవస్థల వరకు…. అందరూ పారదర్శకతకు తూట్లు పొడిచేవారే!
(ఉమ్మడి ఏపీ లో మొదటి RTI కమిషన్ (2005-10) కమిషనర్లు వరుసగా… దిలీప్ రెడ్డి, అంబటి సుబ్బారావు. సి.డి. అర్హ (చీఫ్ కమిషనర్), కె. సుధాకరరావు)
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ RTI Act సమాచార కమిషనర్ గా నేను పనిచేస్తున్న (2005-10) కాలంలోనే, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర కమిషనర్ గా పనిచేసిన మితృడు, డా. అశోక్ గుప్త మొన్న హైదరాబాద్ వచ్చారు. మేం కలిసినపుడు, పిచ్చాపాటి మాటల్లో….. చట్టం వచ్చిన కొత్తలోని మా రోజులు గుర్తుకొచ్చాయి. పారదర్శక పాలనా వ్యవస్థ కోసం, గొప్ప చట్టాన్ని-అది కల్పించిన అధికారాలను ఆలంబన చేసుకొని, మనస్పూర్తిగా పనిచేసిన మా కాలం కళ్లముందు గిర్రున తిరిగింది. వందల జిల్లా పర్యటనలు, సమీక్షలు, పౌరులు-అధికారులకు అవగాహన కల్లించడం, వేల ప్రజా కార్యాలయాల సందర్శన, డిస్ప్లే బోర్డులు-రికార్డుల నిర్వహణను తనిఖీ చేయడం, అక్కడికక్కడ నోటీసులివ్వటం, వారంలో పనిజరిగేలా చూసి కంప్లయెన్స్ రిపోర్టులు తెప్పించడం, వికేంద్రీకృత కేసు విచారణలు, సత్వర ఉత్తర్వులు, తెలుగులోనే తీర్పు ప్రతులివ్వటం….. ఒక్కటేమిటి, లెక్కలేనన్ని వ్యవహారాలతో, ప్రజలు కోరే సమాచారం అందిచ్చే ప్రక్రియకు సంబంధించినంత వరకు మొత్తం వ్యవస్థనే మునిగాళ్లపై నిలబెట్టిన రోజులవి. సదరు శక్తివంతమైన ఉపకరణం ఉపయోగించి పారదర్శకత సాధించటం ఇప్పుడు….. ఎవరికీ పట్టట్లేదు. ప్రస్తుతం RTIA-అమలు పరిస్థితిని తలచుకుంటేనే దుఃఖం ముంచుకు వస్తుంది. ఈ దుస్థితిని తప్పించాలి. పౌరసమాజమే… చొరవ తీసుకోవాలి. పాలనలో పారదర్శకత కోసం మళ్లీ మనమంతా సంఘటితమై నిలబడాలి. ఏదో చేయాలి. ఏం చేసైనా…. ఈ వంచనను అడ్డుకోవాలి.
( Council for Green Revolution-CGR తరపున… తూర్పుకనుమల పరిరక్షణ కోసం ఏర్పడ్డ Greens Alliance for Conservation of Eastern ghats-GrACE చైర్మన్ గా, మేం రూపొందించిన నివేదిక ను ఈ సందర్భంగా డా.అశోక్ గుప్త కు అందజేశాను.)