SatyamSundaram review:
అన్‌కండిషనల్ లవ్ అనికూడా అనొచ్చు. దీనికోసం పరితపించని హృదయాలుంటాయా? మనలో ఉండే చిన్నవో పెద్దవో లోపాల్ని సైతం పక్కనబెట్టి మనల్ని మనసారా అభిమానించే వ్యక్తి ఎదురైతే ఆ అనుభూతి ఎంత మధురంగా ఉంటుంది? ఆ పరిచయం, ఆ అనుభవం ఎంత తక్కువ కాలమన్నది ప్రశ్నే కాదు. అది స్త్రీపురుషుల మధ్య ఆకర్షణా అయివుండాల్సిన అగత్యమూ లేదు.
కొండంత కోపంతో, అసహనపు ఆనవాళ్లను తుడిచేసుకుని వీలైనంత వేగంగా అసౌకర్యాల నీడలనుంచి పారిపోవాలని అనుకుంటున్నప్పుడు నువ్వసలు ఊహించనంత ప్రేమ, ఉక్కిరిబిక్కిరి చేసేంత ఉత్సాహం నీకెదురైతే?ఒకేలా ఉండడానికి, అందరిలానే ఆలోచించడానికి అలవాటుపడిన మనుషులకి ‘ఇలా కూడా ఉండొచ్చన్నమాట, ఇదికదా స్వచ్ఛమైన బ్రతుకంటే’ అనిపించే క్షణాలు కేవలం ఒక్కరాత్రిలో ఎదురైతే అది చిన్న కుదుపు కాదు. ఒక పెద్ద జర్క్.
సాఫీగా ఎటువంటి ఎత్తుపల్లాలూ లేని రహదారిలో సాగిపోయే బోరింగ్ ప్రయాణంలో అకస్మాత్తుగా పడే స్పీడ్‌బ్రేకర్. ఆ తరవాతసలు నిద్రే పట్టనంత అలజడి. కానీ చాలా చాలా బావుండే సందడి. మళ్లీ మళ్లీ కావాలనిపించే మత్తు.
‘సత్యం సుందరం’..
ఇది ఒక సాదాసీదా సినిమాగా మొదలయ్యే కావ్యం. చివరివరకూ చూసి తడిసిన కళ్ళతోను, చిరునవ్వు పెదాలతోను బయటపడతాం.
ఈ నాగరికతకు నప్పే భావోద్వేగాలు కావివి. పాత ఇళ్లమీద వదులుకోలేని ఇష్టాలు, బాల్యపు జ్ఞాపకాల్ని మర్చిపోలేని బలహీనతలు, పశుపక్ష్యాదుల మీద సైతం అమితమైన ప్రేమ కురిపించగలిగే పెద్దమనసులు. ఇదంతా ఇప్పుడెక్కడండీ అంటారా, ఇదిగో, ఇక్కడ!
మనందరికీ చెప్పాలని ఉన్నా చెప్పలేని ఎన్నో కబుర్లని ప్రేమ్‌కుమార్ చెప్పేశాడు. చెయ్యాలనిపించీ మనల్ని మనమే కట్టేసుకున్న తాళ్ళని తెంపేశాడు.
ఆమధ్య ‘పెరడున్న ఇల్లు’ పేరుతో నా అనుభవాల్ని ఒక కథలా రాశాను. చివరికొచ్చేసరికి ఆ ఇంటిని ఖాళీచేసేముందు నేను పడిన వేదనను భారంగా ముగించాను. సరిగ్గా ఐదేళ్ల తరవాత ఇప్పుడీ సినిమా చూస్తోంటే నన్ను నేను చూసుకున్నాను.
బాల్యంలో మేం మగపిల్లలం పెట్టుకునే చిలిపి పోటీల గురించి కూడా రాశాను. అవన్నీ ఇందులో ఉండడం చూసి మళ్ళీ ఉలిక్కిపడ్డాను. అవేవో నాకొక్కడికే సొంతమైన ఆటపాటలు, ఆలోచనలూ అనికాదు. మనందరి బాల్యాల్లోకీ వచ్చేశాడు ప్రేమ్‌కుమార్.
కథేమిటంటూ నటీనటులు అడిగితే ఒక పెద్ద బౌండ్ పుస్తకం చేతిలో పెట్టాట్ట, చదువుకోండని! అది అతగాడు ఇంకా అచ్చువేయించని నవల. అదే కథావస్తువు.
చదువుతున్న కార్తీ, అరవింద్‌స్వామి, దేవదర్శిని చాలాసార్లు కంటతడితో మిగిలారట. అవి బాధో, సంతోషమో విడదీయలేని భావాల పరంపరంటూ మనస్ఫూర్తిగా బయటపడ్డారు.
ఇది కాస్త ఓపికగా చూడాల్సిన సినిమా. అందుకోవడానికి కాస్త సమయం పడుతుంది. తరవాత ఇక మనల్ని అంటుకుంటుంది.
నిజానికి రాత్రుళ్లనేవి నిశ్శబ్దంగా, నిర్మలంగా, ఏమీ ఎరగనంత అమాయకంగా మనల్ని ఆకర్షిస్తాయి. రోజంతా చాకిరీ చేసేవాళ్ళెలాగూ నిద్రకాగలేరు. కానీ అనుకోకుండా ఒకరాత్రి ఊరంతా పడుకున్న తరవాత తెలిసిన వీధుల్లోనే మనకిష్టమైనట్టు తిరుగుతూ, చెరువుగట్టున కబుర్లాడుకుంటూ, విశాలమైన పెరట్లో చిరువెలుతురులో నూతిగట్టున కూర్చుని బాల్యాన్ని తడిమే ఎన్నో జ్ఞాపకాల్ని గుర్తుచేసుకుంటూ గడపడం ఇందులో తెరంతా పరుచుకున్న దృశ్యకావ్యంలా గోచరిస్తుంది.
అరవింద్ స్వామి, దేవదర్శిని, జయప్రకాశ్, ఇళవరసు చాలా సహజంగా నటించారు. ఇది కార్తీ విశ్వరూపం. తననుంచి మనమూ, దర్శకుడూ ఏదైతే ఆశిస్తామో అదంతా సంపూర్ణంగా అందించాడు. అతనున్నంతసేపూ సందడే సందడి. మళ్ళీ వస్తే బావుణ్ణనిపించేంత హాయి.
ప్రశాంతంగా ఉండడానికి, ఇంటికొచ్చాక గుండెలమీద చెయ్యేసుకుని నిద్రపోడానికి చూడండి. ఎటువంటి మారణాయుధాలు, రక్తపాతాలూ కలలోకి వచ్చి భయపెట్టకూడదనుకుంటే చూడండి.
కాస్త పాలిష్డ్‌గా తీయవలసిన అవసరం ఉంది. దర్శకుడు చాలా నిదానంగా, ప్రతి సన్నివేశాన్నీ ఎక్కువ పొడిగిస్తూ తీశాడు. ట్రిమ్ చెయ్యగలగడమే అసలైన పనితనం. ప్రేక్షకుడి స్థానంలో కూర్చుని ఆలోచించాలి ప్రేమ్. అంతకుమించి ఎటువంటి కంప్లైంటూ లేదు.
గోవింద్ వసంత నిజానికి అంత మంచి పాటల్ని ఇవ్వలేకపోయాడు. ‘ఊరూ..’ అన్న పాట మాత్రం అదేం రాగమో తెలీదుగానీ బాగా ఏడిపిస్తుంది. అటువంటి నరాల్ని మెలిపెట్టే ట్యూన్లకి పెట్టిందిపేరు ఆ కుర్రాడు. దుర్మార్గుడు.. 96 బిజిఎమ్‌తో ప్రశాంతంగా బతికేవాళ్లని నాశనం చేసేశాడు.
ఓటీటీలో కూడా చూడొచ్చు. థియేటర్లలోనే చూడాల్సినంత ఎర్రసముద్రాలు, సొరచేపలు, సొరంగాలూ లేవిక్కడ!
……..కొచ్చెర్లకోట జగదీశ్✍✍✍