Wtcfinal: ఎన్నాళ్లకు, ఎన్నేళ్లకు….. ? ఓ అద్భుతమైన స్పర్ధ కళ్లకు కట్టింది! ఇది కదా క్రీడా స్ఫూర్తి ఇచ్చే కిక్కు. అసలు ఆటలనేవి ఆహ్లాదాన్ని, ఆనందాన్నీ అందిస్తాయనడానికి… ఇంతకు మించిన నిదర్శన దర్శనమేముంటుంది? నేనైతే ఆట సాంతం ఎంజాయ్ చేశాను. 70-80ల రోజులు గుర్తొచ్చాయి.
సహనం సాహసం కలగలిసిన ప్రతిభ రెండు బృందాలుగా తలపడితే బ్యాట్ కు బాల్ కి మధ్య ఓ మూడున్నర రోజుల పాటు సాగిన ఘర్షణ ఉత్సాహం తగ్గని రీతిలో ఉత్కంఠను రేపింది. ప్రతి సెషన్ ఆసక్తిని పుట్టించింది. ‘టెస్ట్ క్రికెటంటేనే బోర్’ అనే పాత భావనను క్రిజ్ లో పాతరేసి, బంతాట సంబరాన్ని బౌండరీ దాటించింది. విశ్వ క్రికెట్ క్రీడలోనే తలమానికమనిపించే ….. ఆస్ట్రేలియా శాస్త్రీయ వృత్తినైపుణ్య గెలుపు దాహానికి, దక్షిణాఫ్రికా సహజ, సమర్థ నిర్భీతి కళాకౌశలానికి నడుమ ఓ యుద్దంలా సాగిన వేడుక ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్-2025. ఒకటున్నర రోజుల సమయముండగానే శనివారం స్పష్టమైన ఫలితంతో మిగిసింది. పొట్టి క్రికెట్, పరిమిత ఓవర్ల క్రికెట్ కాదు అసలు-సిసలు క్రికెట్ క్రీడానందానికి టెస్ట్ మ్యాచ్ పరాకాష్ట అని మరోమారు నిరూపితం చేసింది. ఆటగాళ్ల నైవుణ్య పరీక్షకు టెస్ట్ మ్యాచే రియల టెస్ట్ అనే నానుడిని నిజం చేసిన ‘అల్టిమేట్ టెస్ట్’ గా ఈ చాంపియన్షిప్ నిలిచింది.
బ్యాటింగ్-బౌలింగ్-ఫీల్డింగ్ అన్ని రంగాల్లో కొదమ సింగాల వంటి ఇరుజట్లు కంగారూలు ఒకవైపు, సఫారీలు మరోవైపు నిలిచి జరిపిన పోరులో…. నీకా-నాకా అన్నట్టు దోబూచులాడిన గెలుపు చివరకు సౌతాఫ్రీకా ను వరించింది. డిపెండింగ్ చాంపియన్ ఆస్సీస్ ని ఓడించి కొత్త ఐసీసీ టెస్ట్ చాంపియన్ తెరకెక్కింది.
సెల్యూట్ సౌత్ ఆఫ్రికా! మీ ఆట బాగుంది. గొప్పగా ఆడగలిగీ…. ‘పెద్ద టోర్నీలు గెలవరు’ అన్న నిందకి, సరే విమర్శకి, పోనీ ప్రచారానికి ఈ గెలుపుతో మీరు తెరదించారు. బవుమా బృందమా మీకు అభినందనలు…
_ఆర్. దిలీప్ రెడ్డి( సీనియర్ జర్నలిస్టు)