బిల్కీస్‌ రేప్‌ కేసులో దోషులంతా బ్రహ్మణులూ కాదు..

Nancharaiah Merugumala ( Senior Journalist):
నెహ్రూ, ఇందిర కూడా బ్రాహ్మణులే అనుకుని వారి  పాపాలను బీజేపీ చూసీచూడనట్టు పోవచ్చు కదా!
–––––––––––––––––––––––––––––––—————
గుజరాత్‌ మారణకాండ సందర్భంగా 2002లో బిల్కీస్‌ బానో అనే ఐదు నెలల ముస్లిం గర్భిణీని సామూహికంగా బలత్కరించిన 11 మంది జీవిత ఖైదీల శిక్షలను తగ్గించి ఆగస్టు 15న బీజేపీ ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 19 మంది నిందితుల్లో ఒకరు విచారణ సమయంలోనే మరణించగా, ఏడుగురుని నిర్దోషులని చెప్పి 2008లో ముంబై సీబీఐ ప్రత్యేక కోర్టు విడుదల చేసింది. జైల్లో సత్ప్రవర్తన, వారిలో కొందరు సంస్కారవంతులైన బ్రాహ్మణలు ఉండడం వల్ల వారి జీవిత ఖైదును ఇలా తగ్గించడం సబబేనని గోధ్రా బీజేపీ ఎమ్మెల్యే సీ కే రావుల్జీ గురువారం సమర్ధిస్తూ మాట్లాడారు.
అయితే, ఈ కేసులో దోషులైన జీవిత ఖైదీలందరూ బ్రాహ్మణులే కాదు. గోధ్రా నుంచి జనతాదళ్‌ తరఫున ఒకసారి, కాంగ్రెస్‌ టికెట్‌ పై రెండు సార్లు, బీజేపీ తరఫున మూడుసార్లు గెలిచిన రాజపూత్‌ ఎమ్మెల్యే రావుల్జీ కూడా విడుదలైన దోషులు అందరూ బ్రహ్మణులూ సంస్కారవంతులు అనలేదు. ఈ నేరస్తుల్లో కొందరు బ్రహ్మణులూ ఉన్నారు కాబట్టి అందరినీ విడుదల చేయడంలో తప్పులేదనేది ఈ బీజేపీ ఎమ్మెల్యే వాదనగా కనిపిస్తోంది. ఈ కేసులో బిల్కీస్‌ బానోను రేప్‌ చేసినవారిలో బీసీలు అయిన ఇద్దరు నాయీ కులస్తులు (జశ్వంత్‌ నాయీ, గోవర్ధన్‌ భాయ్‌ నాయీ) ఇంకా వైశ్యుడైన రాధేశ్యామ్‌ షా, బ్రాహ్మణులు బిపిన్‌ చంద్ర జోషీ, నితేశ్‌ భట్‌ ఉన్నారు.
ఈ సామూహిక నేరంలో దిగ్భ్రాంతి కలిగించే వాస్తవం ఏమంటే– బిల్కీస్‌ కూతురు సలేహాను నేలకేసి కొట్టి చంపినది శైలేష్‌ భట్‌ అనే సద్బ్రాహ్మణుడు అని కేసుపై తీర్పు ఇచ్చినప్పుడే తేలిపోయింది. ఈ 11 మందిలో నాయి, వైశ్య, బ్రాహ్మణ కులాల వారేగాక ఇతర కులాలోళ్లూ ఉన్నారు. తమ ప్రవర్తన పరిశీలించి, జీవిత ఖైదు తగ్గించి తమను విడుదల చేయాలని అర్జీ పెట్టుకున్నది మాత్రం వైశ్య అపరాధి రాధేశ్యామ్‌ షా. ఈ మంచి వైశ్యుడి చొరవతో బాలికను నేలకోసి మోది చంపిన బ్రాహ్మణుడు నితేశ్‌ భట్, ఈ సామూహిక బలాత్కారంలో పాల్గొన్న ముగ్గురో నలుగురో (పూర్తి సమాచారం లేదు) బ్రాహ్మణులు, కొందరు ఓబీసీలు కూడా విడుదలయ్యారు.
ఓ మంచి వైశ్యుడు రాధేశ్యామ్‌ చొరవ వల్ల 11 మంది అపరాధులను విడుదల చేశామని చెబితే బావుండదనకున్నాడు గోధ్రా బీజేపీ రాజపూత్‌ శాసనసభ్యుడు రావుల్జీ. అందుకే రక్తం కడుక్కోవడానికి బ్రాహ్మణుల పేరు అడ్డగోలుగా వాడుకునే ప్రయత్నం విజయవంతంగా చేశాడు. మొత్తానికి విడుదలైన జీవిత ఖైదీలంతా బ్రహ్మణులే అనే భ్రమ, ప్రచారం కల్పించాడు ఈ తెలివైన ఎమ్మెల్యే, ఎంతైనా బీజేపీ క్షత్రియ నేతలు తమ కింద ఉన్న బ్రహ్మణుల్ని బాగానే కాపాడుకుంటారని రావుల్జీ నిరూపించాడు.
బ్రాహ్మణులు చేసే నేరాలకు ఎప్పుడో వేలాది ఏళ్లనాడు తక్కువ శిక్షలు వేసేవారని విన్నాం. ఓబీసీ ప్రధాని నరేంద్రమోదీ (తేలీ–గాంచీ), క్షత్రియ రక్షణ మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్, వైశ్య గృహ (హోంశాఖ) మంత్రి అమిత్‌ షా, బ్రాహ్మణ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఉన్న కేంద్ర సర్కారు ఇదే పద్ధతిలో గుజరాత్‌ మాజీ పోలీలు ఉన్నతాధికారి, సద్బ్రాహ్మణుడు అయిన సంజీవ్‌ భట్‌ విషయంలో వ్యవహరిస్తే బావుండేది.
గుజరాత్ లో జరిగిన కొన్ని హత్యల విషయంలో మోదీ–షా ద్వయంతో తలపడి దెబ్బతిన్నాడు ఈ బాపన పెద్ద పోలీసు భట్‌. ప్రస్తుతం చేయని నేరానికి ఈ మాజీ ఐపీఎస్‌ అధికారి జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అంతేకాదు, భారతీయ బ్రాహ్మణుల్లో సూపర్‌ ఫైన్‌ క్వాలిటీగా పరిగణించే కశ్మీరీ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన మాజీ ప్రధానమంత్రులు జవాహర్‌ లాల్‌ నెహ్రూ, ఇందిరా ప్రియదర్శినీ నెహ్రూ–గాంధీని కూడా బీజేపీ అగ్రనాయకత్వం మన్నించవచ్చు.
ప్రధాని పదవిలో ఉండి చేసిన వారి అపరాధాలను క్షమించేయవచ్చు. వారి పాపాల గురించి పదే పదే జాతి జనులకు గుర్తుచేయడం ఇక మానుకోవచ్చు! నూరు శాతం కశ్మీరీ బ్రాహ్మణులు కాని రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీ వాడ్రాను నేరస్తులుగా న్యాయస్థానాల్లో నిరూపించి, జైల్లో వేసినా భారతీయులు బాధపడరు. బ్రహ్మణుల పేరుతో నిర్బంధంలో ఉన్న జీవితఖైదీలను స్వాధీనతా దినం రోజు బయటకు వదిలేసే సంప్రదాయం మంచిదే అని ముందు తరాలు తప్పక గుర్తిస్తాయి.