EENADU: శైలజ పేరు సెల్జా అని ‘ఈనాడు’రాస్తే ఎలా?

Nancharaiah merugumala senior journalist:

హరియాణా ‘చౌధరీ’ గారమ్మాయి శైలజ పేరు సెల్జా అని ‘ఈనాడు’ కూడా రాస్తే ఎలా? ఇది చిత్తూరు నాయుడుగారమ్మాయి శైలజకు కూడా తెలియకపోతే?

తెలుగు పత్రికలు ఉత్తరాది (హిందీ ప్రాంతం) మనుషులు, ప్రాంతాల పేర్లను ఖూనీ చేస్తూనే ఉంటాయి. హరియాణా సిర్సా కాంగ్రెస్‌ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి సెల్జా కుమారి లేదా కుమారి సెల్జా అని అవి రాస్తే మనం ఇంగ్లిష్‌ స్పెలింగ్‌ Selja కాబట్టి తప్పు లేదనుకుంటాం. అంతేగాని ఈ 62 ఏళ్ల ఈ పెళ్లికాని ఎర్ర రంగు మహిళ పేరు హిందీలో ఏం రాస్తున్నారో మనం తెలుగోళ్లం ఒక్కసారి కూడా తెలుసుకునే ప్రయత్నం చేయం గాక చేయం. హిందీలో రాసేటప్పుడు, పలికేటప్పుడు ‘ శైలజ ’ అనే అంటారు. ఇంగ్లిష్‌ లేదా హిందీ టీవీ వార్తలు వింటే సమస్య ఉండదు. తెలుగు ప్రాంతాల్లో కూడా తొలుత మనుషుల పేర్లు నమోదు చేసే కరణాలు, ఇతర గ్రామాధికారులు లేదా ప్రాథమిక పాఠశాల పంతుళ్లు ఆయా పిల్లల తల్లిదండ్రులు కింది కులాలోళ్లు లేదా చదువురానివారైతే తమకు ఇష్టం వచ్చినట్టు లేదా తమకున్న జ్ఞానం మేరకు పేర్లు రికార్డు చేయడం ఆనవాయితీగా వస్తోంది. పేరున్న దళిత మహిళ అయినప్పటికీ ఇంగ్లిష్‌లో శైలజ పేరును ‘సెల్జా’ అని టీచర్లో లేదా గ్రామాధికారులో ఇంగ్లిష్‌లో రాయడంతో ఆమె పేరు దక్షిణాది ప్రాంతీయ భాషా పత్రికల్లో సెల్జాగా మారిపోయింది. ఉత్తరాది రాష్ట్రాలు, ఇంకా మనకు బాగా తెలియని ప్రాంతాల వ్యక్తులు, ఊళ్ల పేర్లను వాటి ఇంగ్లిష్‌ స్పెలింగ్‌ను బట్టి తెలుగులో ముఖ్యంగా పత్రికల్లో రాయడం అనేది మొదటి ఆధునిక తెలుగు పత్రికా సంపాదకుడు నార్ల వెంకటేశ్వరరావు గారి తర్వాత తరం సంపాదకులు (ఏబీకే ప్రసాద్‌గారితో సహా) హద్దుల్లేని బద్ధకంతో, ఉత్తరాది రాష్ట్రాలపై ఎనలేని అజ్ఞానంతో అలవాటు చేసిన పని. అయితే, ఒక్క ఈనాడులోనే గత 30 ఏళ్ల నుంచి ఇంగ్లిష్‌ స్పెలింగ్‌ను బట్టిగాక సాధ్యమైనంత వరకూ హిందీ, ఇతర ఉత్తరాది భాషల్లో ఎలా రాస్తారో, ఎలా పలుకుతారో పేర్లను రాయడం మొదలెట్టారు. ఈమధ్య ఈ ప్రక్రియ బాగానే ముందుకు సాగుతోంది. జాతీయ భద్రతా సలహాదారు అజీత్‌కుమార్‌ డోవల్‌ అని డోవల్‌ ఇంగ్లిష్‌ స్పెలింగ్‌ను బట్టి ఇతర తెలుగు పత్రికలు రాస్తుంటే– ‘ఈనాడు’ ఒక్కటే ‘ఢోభాల్‌’ అని హిందీలో ఉన్నట్టు రాస్తోంది. ఇలా ఇతర తెలుగు దినపత్రికల్లో పేర్ల విషయంలో జరుగుతున్న ‘దారుణ హత్యలు’ ఈనాడులో బాగా తక్కువ. అయితే, అనేకమంది ప్రముఖుల పేర్లను కాలక్రమంలో సరిదిద్దుకుంటూ వచ్చే సత్సంప్రదాయం ఉన్న ఈనాడు– హరియాణివీ దళిత చౌధరీ దల్బీర్‌సింగ్‌ గారమ్మాయి శైలజ పేరును ఇంగ్లిష్‌ స్పెలింగ్‌ ఆధారంగా కుమారి సెల్జా అని రాస్తూ రావడం నాకెందుకో మరి చాలా బాగోలేదు. వార్తలో హరియాణా అని సంపాదకీయంలో హర్యానా అని తెగ రాసిపారేసే ‘సాక్షి’ వంటి తెలుగు పత్రికలు ఏం రాసినా ఎవరికీ ఆ పాపం అంటదు. కాని ‘సెల్జా’ శైలిలో కొందరి పేర్లను ఇంకా దశాబ్దాల తరబడి ఈనాడులో తప్పులు తడకలుగా రాస్తూపోతే రామోజీరావు గారి ఆత్మ ఘోషించదా? ఉత్తరాఖండీ బ్రాహ్మణుడైన అజిత్‌కుమార్‌ ‘దోవల్‌’ పేరును కొన్నాళ్లుకు ‘ఢోభాల్‌’గా సరిద్దుకుంది ఈనాడు. కాని, హరియాణివీ దళిత చౌధరీ (దల్బీర్‌సింగ్‌) గారమ్మాయి శైలజ పేరును మాత్రం ఇంకా సెల్జా అనే కొనసాగించడం పునాదిస్థాయి జర్నలిస్టుల నియామకాల్లో కులం గురించి పట్టించుకోని ఈనాడు పేరుకు మచ్చ తెచ్చే విషయం కాదా?
ఎస్సీబీసీలు చౌధరీ తగిలించుకోవడం

పెరుగుతుంటే చౌదర్లుగా మారుతున్న కమ్మలు!

పైన చెప్పిన శైలజ ఉరఫ్‌ సెల్జా తండ్రి చౌధరీ దల్బీర్‌ సింగ్‌ మూడుసార్లు లోక్‌సభకు, రెండుసార్లు ఉమ్మడి పంజాబ్‌ శాసనసభకు ఎన్నికైన సీనియర్‌ నేత, మాజీ మంత్రి. పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్, బిహార్‌లో చర్మకార (చమార్‌ లేదా జాటవ్‌–బీఎస్పీ నాయకురాలు మాయావతి కులం) కులంలో పుట్టిన నాయకులు, ప్రముఖులు కూడా మిగిలిన జాట్, గుజ్జర్, యాదవ, కోయిరీ తదితర వ్యవసాయాధారిత కులాల మాదిరిగానే ‘చౌధరీ’ని తమ పేర్ల చివర జోడిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని కమ్మలు, హైదరాబాద్‌ నగర ప్రాంతంలోని పెద్ద గొల్లలు లేదా యాదవులు, శ్రీకాకుళం జిల్లాలో కొందరు కాళింగుల పేర్ల చివర చౌదరి కనిపిస్తూనే ఉంటుంది. ఇది ఉత్తరాది చౌధరీ కాదు. చౌధరీ ఇంగ్లిష్‌ స్పెలింగ్‌ Chaudhuri లో U ఉంది కాబట్టి కొన్ని తెలుగు పేపర్లు చౌధురీ అని రాయడం కూడా చూస్తున్నాం. తమ పేర్ల చివర చౌధరీ అనే గౌరవవాచకం (ఇంగ్లిష్‌లో ఆనరిఫిక్‌) హరియాణా, పంజాబ్, రాజస్థాన్‌ సహా ఇతర ఉత్తరాధి రాష్ట్రాల్లో ఇప్పుడు అన్ని కులాల వారూ పేర్ల చివర తగిలించుకుంటున్నారు. ముఖ్యంగా ఈమధ్య కాలంలో అగ్రకులాల వారు ఉత్తరాదిన చౌధరీ అనే మాట వాడడం క్రమేపీ తగ్గిస్తుంటే దళితులు, ఓబీసీలు ఆ పని కాస్త ఎక్కువగా చేస్తున్నారు. తెలుగునాట కూడా చౌదర్లు లేదా సౌదర్ల సంఖ్య బాగా పెరుగుతుండడం విశేషం. ఉత్తరాదిన అన్ని కులాల వారూ చౌధరీలు అవుతంటే, తెలుగునాట చౌదరి అనే తోక విషయంలో ప్రజాస్వామ్యీకరణ అసలు జరగడం లేదు.