Karimnagar: దుర్గాదేవిగా అమ్మవారు.. జోరువానలో మహిళల బతుకమ్మ..!

Karimnagar:  కరీంనగర్ మహాశక్తి ఆలయంలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు తుదిదశకు చేరుకున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం( ఎనిమిదోవ రోజు) అమ్మవారు దుర్గాష్టమి సందర్భంగా శ్రీ మహాదుర్గగా దర్శనమిచ్చారు. దేవీ దర్శనం కోసం ఉదయం నుంచి సాయంత్రం దాకా భక్తుల ఆలయానికి పోటెత్తారు. భవానీ మాత శరణు ఘోషతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. నవరాత్రి ఉత్సవాలు ముగింపుకు మరో రోజు మాత్రమే మిగిలి ఉండడంతో ఇతర ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు.

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేంద్ర మంత్రి తో పాటు కరీంనగర్ జిల్లా ప్రిన్సిపాల్ డిస్ట్రిక్ట్ జడ్జి ప్రతిమ పూజల్లో పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు అనంతరం సంజయ్ ప్రజా సమస్యలపై దృష్టి సారించారు. తనని కలవడానికి వచ్చిన పార్టీ శ్రేణులను కలిసి ముచ్చటించారు. అభిమానులతో సెల్ఫీలు దిగారు.

ఇక సద్దుల బతుకమ్మ సందర్భంగా మహాశక్తి ఆలయంలో మహిళలు, యువత ఆట పాటలతో సందడి చేశారు. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలు తెలంగాణ సాంప్రదాయం ఉట్టిపడేలా కనువిందు చేశాయి.

బతుకమ్మ ఆడటానికి మహిళలు మహాలక్ష్మి ఆలయానికి భారీగా తరలివచ్చారు. జోరు వానలో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా మహిళలు బతుకమ్మ పాటలకు నృత్యం చేశారు.