దేశంలో ఏ మతానికి, ఏ వర్గానికి బీజేపీ వ్యతిరేకం కాదన్నారు ఆపార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. అధికారంలోకి వచ్చాక కేసీఆర్ సంగతి చూస్తామన్న ఆయన.. తేడా వస్తే గడీలు బద్దలు కొడతామని హెచ్చరించారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలనను అంతమొందించడానికే మలి దశ పాదయాత్ర ప్రారంభించినట్లు సంజయ్ స్పష్టం చేశారు.
రెండో విడత ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా సంజయ్.. జోగులాంబ గద్వాల జిల్లాలోని ఇమామ్‌పూర్ నుంచి నాలుగు కిలోమీటర్లు వరకు మొదటి రోజు యాత్ర నిర్వహించారు. అంతకు ముందు అలంపూర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో 80శాతం ఉన్న హిందువుల గురించి బీజేపీ మాట్లాడకపోతే తెలంగాణలో హిందువుల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలని ఆయన హితువు పలికారు. యాత్రలో ప్రధాని నరేంద్రమోదీ ప్రవేశ పెట్టిన పథకాలను ప్రజలకు వివరిస్తానన్నారు. యాసంగి ధాన్యం కొనబోమన్న సీఎంతో.. ప్రతి గింజా కొంటామని చెప్పించిన ఘనత బీజేపీదేనని సంజయ్ స్పష్టం చేశారు.
కాగా రంజాన్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం ఉద్యోగులకు వెసులుబాటు కల్పిస్తూ జీవో ఇచ్చిందని.. దానిని తామూ వ్యతిరేకించడం లేదని.. అయ్యప్ప, హనుమ, శివ భక్తులకు ఎందుకు ఈ వెసులుబాటు కల్పించలేదని సంజయ్ ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రత్యేక జీవోలు తీసుకొచ్చి హిందూ భక్తులకు వెసులుబాటు కల్పిస్తామన్నారు.