ఉగాది ముందస్తు వేడుకల్లో భాగంగా గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. నేను అహంభావిని కాదు.. శక్తిమంతురాలినని.. యాదాద్రి కి వెళ్ళాలని ఉన్న ఆహ్వానం అందలేదని.. సమక్క జాతరకు ఎవరూ పిలవకున్నా వెళ్ళానంటూ ఆమె చేసిన కామెంట్స్ హాట్ టాపిక్గా మారాయి. మరోవైపు ఆహ్వానాలు వెళ్లినా.. సీఎం కేసిఆర్ తో పాటు మంత్రులు, సిఎస్, డీజీపీ హాజరుకాకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
రాజ్ భవన్లో ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో తెలుగు సంస్కృతిని ప్రతిబింబించేలా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పంచాంగ శ్రవణం నిర్వహించాకా.. ఎనిమిది మందికి గవర్నర్ ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్ అతిథులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధిలందరికీ ఆహ్వానాలు పంపించామన్నారు. రానివారు గురించి బాధపడనన్నారు. నేను చాలా స్నేహశీలినని.. నవ్వుంతున్నత మాత్రాన బలహీనురాలినని భావించకూడదని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలకు మేలు చేసేందుకు రాజ్ భవన్ తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయని ఆమె స్పష్టం చేశారు.
ఇక ఉగాది వేడుకలకు రావాలని అత్యున్నత స్థాయి వ్యక్తి నుంచి సాధారణ స్థాయి ఉద్యోగి వరకు ఆహ్వానాలు పంపినట్లు గవర్నర్ పేర్కొన్నారు. చాలా మంది ఆహ్వానాన్ని మన్నించి వచ్చారని ఆమె తెలిపారు. కొత్త ఏడాది.. కొత్త శకం ప్రారంభం కాబోతుందన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం పరస్పరం సహకరించుకుంటూ ముందుకూ సాగుదామని గవర్నర్ పిలుపునిచ్చారు.
మొత్తం మీద గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలు అటు రాజ్ భవన్_ ఇటు ప్రగతి భవన్ మధ్య పూడ్చలేని స్థాయికి విభేదాలు చేరాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.