Nancharaiah merugumala senior journalist:
కమ్మ కుటుంబాల్లో పుట్టామని చెప్పిన ఆరుగురు తెలంగాణ మాజీ శాసనసభ్యులకు 2018 డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆరెస్ టికెట్లు ఇచ్చింది. వారిలో ఒక్క తుమ్మల నాగేశ్వరరావు గారు తప్ప మిగిలిన ఐదుగురూ (కోనేరు కోనప్ప, మాగంటి గోపీనాథ్, అరికపూడి గాంధీ, నల్లమోతు భాస్కరరావు, పువ్వాడ అజయ్ కుమార్) గెలిచారు. వచ్చే డిసెంబర్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఐదుగురికి టికెట్లు ఖాయమని చెబుతున్నారు. మరి, తెలంగాణ కమ్మ కులస్థులు ఈసారి కాంగ్రెస్ వైపు ఉంటారని ధీమాగా ఉన్న హస్తం పార్టీ…ఎంత మంది స్వయం ప్రకటిత కమ్మ నాయకులకు టికెట్లు ఇస్తుందో చెప్పడం కష్టమేమీ కాదు. ఇద్దరికిస్తే గొప్పే. ఈలెక్కన…మహాభారతంలో కౌరవుల పక్కన ఉండాలా లేక పాండవుల పక్షాన ‘పనిచేయాలా’ అనే సమస్యకు మథురలో పుట్టిన కృష్ణుడు ఎట్టకేలకు పరిష్కారం కనుగొన్నాడు. పాండవులను ఫ్రంట్ & బ్యాక్ సీట్ డ్రైవింగ్ తో ఓ ‘ఒడ్డుకు’ చేర్చాడు కిషన్ కన్హయ్యా. ఇక తెలంగాణ ఎన్నికల్లో ‘హస్తాన్ని’ తొక్కుకుంటూ పోయి పాత అంబాసిడర్ కారు ఎక్కి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును మూడోసారి ముఖ్యమంత్రిని చేయడానికి కమ్మలు మొగ్గు చూపుతారని నా కృష్ణా జిల్లా మిత్రులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ ఉద్యమ కాలంలో… పారిశ్రామిక వేత్తలు, కాంట్రాక్టర్లు, వ్యాపారులు అయిన కమ్మలను ‘ పెద్ద భూతాలుగా, బాహుబలులుగా ‘ చిత్రించిన చంద్రశేఖర్ రావు గారూ.. అంత బ్యాడ్ కాదనీ, శానా మంచోరని 2014లోనే తెలంగాణ కమ్మ సోదరులు సొంత అనుభవం ద్వారా సక్కగా తెలుసుకున్నారు. ఈ చక్కటి సామాజిక, రాజకీయ, ఆర్థిక నేపథ్యంలో తెలంగాణ Self-declared కమ్మ ఓటర్లు భారత రాష్ట్ర సమితికే ఓటేస్తారని రాజకీయ పంతుళ్లు, రెడ్లు, వెలమలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టిలూ, ముస్లిములూ నమ్ముతున్నారు. మరి ప్రస్తుత శాసనసభలో ఐదుగురు, శాసనమండలిలో ఒక్కరు, లోక్ సభలో ఒక్కరూ (ఖమ్మం) చొప్పున ప్రాతినిధ్యం ఉన్న తెలంగాణ కమ్మోరు డిసెంబర్ ఎలక్షన్లలో కేసీఆర్ కుటుంబాన్ని అమ్మోరులా ఆదుకుంటేనే… తెలంగాణ-ఆంధ్రా బ్రదర్లు, సిస్టర్ల మధ్య సామరస్యం బలోపేతం అవుతుందని… చిక్కడపల్లి కోనసీమ ద్రావిడ బ్రాహ్మణ సంఘం మేధావులు సైతం అంచనాలు వేసిపారేస్తున్నారు. కోబ్రాల జోస్యాలు సాధారణంగా తప్పు కావనే మంచి పేరుంది.
(పొద్దున్నే టీవీ 9 చానలు పెడితే…” తెలంగాణలో కమ్మ రాజకీయాలు, కమ్మోరి మద్దతు కాంగ్రెసుకేనా?” అనే భయోత్పతం కలిగించే తెలుగక్షరాలు చూశాక పై ‘వాక్యాలు’ రాయాలన్పించింది. సకలాంధ్ర కమ్మ సోదరులు అపార్ధం చేసుకోరనే ఆశతో..)