తెలంగాణాలో ఒమిక్రాన్ టెన్షన్..ఒక్కరోజే 14 కేసులు!

తెలంగాణాలో ఒమిక్రాన్ వేరియంట్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. తాజాగా మరో 14 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసులు సంఖ్య 38కి చేరినట్లు తెలిపింది. అటు గడిచిన 24 గంటల్లో 182 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
కాగా నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన 12 మందిలో ఒమిక్రాన్‌ గుర్తించినట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. రిస్క్‌ దేశాల నుంచి వచ్చిన ఇద్దరిలో ఒమిక్రాన్‌ వేరియంట్ గుర్తించినట్లు వెల్లడించింది. ఇప్పటివరకు రిస్క్‌ దేశాల నుంచి వచ్చిన ఆరుగురిలో ఒమిక్రాన్‌ సోకినట్లు తేలింది. నాన్‌రిస్క్‌ దేశాల నుంచి వచ్చిన 31 మందిలో ఒమిక్రాన్‌ గుర్తించినట్లు వైద్యారోగ్యశాఖ స్పష్టం చేసింది. ఒకరికి కాంటాక్ట్‌ ద్వారా ఒమిక్రాన్‌ సోకినట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది.
ఇక ఇప్పటివరకు ఎట్‌రిస్క్‌ దేశాల నుంచి వచ్చిన 9 వేల 381 మంది ప్రయాణికులకు ఆర్‌జీఐఏలో కొవిడ్ ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు చేశారు. వారిలో 63 మందికి కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయింది. వారందరి శాంపిల్స్‌ను అధికారులు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపించారు. వారిలో 22 మందికి ఇప్పటికే ఒమిక్రాన్‌ నెగెటివ్‌ వచ్చింది. మిగిలిన వారిలో 38 మందికి ఒమిక్రాన్‌ పాజిటివ్‌గా తేలగా.. మరో నలుగురి ఫలితాలు రావాల్సి ఉంది.
అటు రాష్ట్రం లో గడిచిన 24 గంటల్లో 37 వేల 353 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 182 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. దీంతో మొత్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,80,074కు చేరింది. గత 24 గంటల వ్యవధిలో వైరస్ తో ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు మృతుల సంఖ్య 4 వేల 17కు చేరింది. కరోనా బారి నుంచి నిన్న 196 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,610 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.