Telanganaslang: తెలంగాణ వాళ్లం.. మేం అంత Unculturedఆ..?

సాయి వంశీ ( విశీ) : 

హీరో విజయ్ దేవరకొండని తన యాస మార్చుకొమ్మని ఓ వీడియో చేశారని, ఆ వీడియోను ఖండిస్తూ Mohan Babu ఒక‌ పోస్ట్ రాశారు. ఆ వీడియో చేసినవాళ్లు కొన్ని సినిమాలకు ఆ యాస సరికాదని అన్నారా? లేక పూర్తిగా ఆ యాసను వదిలేయమని ఉచిత సలహా ఇచ్చారా అనేది తెలియదు. కొన్ని సినిమాలకు ఆ యాస కరెక్ట్ కాదని నేనూ ఒప్పుకుంటాను. ఒక యాక్టర్ అన్ని పాత్రల్లో ఒకే రకమైన యాసతో మాట్లాడితే యాక్సెప్ట్ చేయడానికి ఇది ‘రమణారెడ్డి’ గారి కాలం కాదు. ఏ పాత్రకు తగ్గ భాష దానికి మాట్లాడాలి. Then, he is called Actor. సినిమాల్లో కమల్‌హాసన్ గారు మాట్లాడినన్ని యాసలు (తమిళ, తెలుగు, కన్నడ, మలయాళంతో కలిపి) భారతదేశంలో ఎవరూ మాట్లాడలేదు. కానీ విజయ్‌కి జన్మతః వచ్చిన యాసను వదులుకోమని అంటే మాత్రం అది చాలా చాలా తప్పు. ఇది తెలంగాణకే కాదు, అన్ని ప్రాంతాలకూ వర్తించే మాట.

టాపిక్ మరోవైపు తిప్పుతున్నాను. 1998లో ‘పాపే నా ప్రాణం’ అనే సినిమా వచ్చింది. హీరో జె.డి.చక్రవర్తి, హీరోయిన్ మీనా. చంద్రమోహన్, ఆశిష్ విద్యార్థి, జయసుధ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. అందులో ఏవీఎస్, తనికెళ్ళ భరణి, కోట శ్రీనివాసరావు కామెడీ ట్రాక్ ఉంటుంది. ఆ కామెడీ సీన్లు ఈ మధ్యే చూశాను.

తనికెళ్ళ భరణి స్టార్ హోటల్‌లో ఉంటూ అక్కడుండే పూల కుండీల్లో ఉమ్ముతూ, బురద అంటిన చెప్పులతో నడుస్తూ, చుట్ట తాగి గోడలకు మరకలు చేస్తూ ఉంటారు. అదంతా భరించలేక హోటల్ మేనేజర్ ఏవీఎస్ వచ్చి మీరెవరని అడిగితే, “కొమురయ్య బోనగిర్” అంటారు భరణి. ఆ పాత్ర మొత్తం తెలంగాణ యాసలోనే మాట్లాడుతుంది.

ఆ సీన్ చూస్తూ ఉన్నప్పుడు చాలా చెత్తగా అనిపించింది. సినిమాకు బి.వి.రమణ డైరెక్టర్. రైటర్ ఎవరా అని చూస్తే టైటిల్స్‌లో ఆ పేరే లేదు. ఇంత చెత్తగా ఎలా రాస్తారు? తెలంగాణ వాళ్లను Uncultured and Barbariansగా చూపించాలా? తద్వారా కామెడీ జెనరేట్ చేయాలా? మరో వందేళ్ల తర్వాత కూడా ఆ మచ్చ అలాగే ఉంటుందే? అది అవమానకరంగానే అనిపిస్తుందే? తెలంగాణవాళ్లంటే అంత అజ్ఞానులు, సభ్యత తెలియనివారు అని తీస్తే సెన్సార్ ఎలా ఒప్పుకుంది??

ఇప్పుడు ఈ అభ్యంతరాలు చెప్తే “కళాకారులకు ఒక ప్రాంతం లేదు. వారు విశ్వమానవులు” అనే రాడ్డు డైలాగ్ చెప్పి నోరు మూయిస్తారు. అంతకంటే ఘరానా మోసం మరొకటి ఉండదు. మరి ఈ కళాకారులంతా ఆస్ట్రేలియాలోనో, అంటార్కిటికాలోనో ఇల్లు కట్టుకోకుండా ఇక్కడే ఎందుకు కట్టుకుంటారో అర్థం కాదు. విశ్వమానవులైన కళాకారులు హిబ్రులోనో, పర్షియన్‌లోనే కాక తెలుగులోనే ఎందుకు సినిమాలు తీస్తారో తెలియదు.

కళాకారుడి ప్రతిభకు ప్రాంతం ఉండదు. కానీ కళాకారుడికి తప్పకుండా ఏదో ఒక సొంత ప్రాంతం ఉంటుంది. దాని తాలూకు అస్తిత్వం అతని వెంటే ఉంటుంది. అది అలవాట్లు, భాష, యాస, ఆస్తిపాస్తులు, చుట్టరికాల రూపంలో అతనికి వెన్నుదన్నుగా నిలుస్తూ ఉంటుంది. అయినా కృతకంగా మాట్లాడితే తప్పు అని చెప్పగలం కానీ, స్వతహాగా ఓ కళాకారుడు మాట్లాడే యాసను పూర్తిగా వదులుకోమని చెప్పే హక్కు ఎవరికి ఉంది? ఎవరికీ లేదు.