BjpTelangana:
‘‘మంచి నాయకుడికి సహనం అనే గుణం ఉండాలి. ఎదగాలనుకునే నాయకుడు ఓపిక పడితే కచ్చితంగా కష్టానికి తగిన ఫలం పొందుతాడు..’’ అనే చాణక్య రాజనీతి ప్రస్తుతం తెలంగాణ బీజేపీ నేతలకు సరిగ్గా సరిపోతుంది. లోక్సభ ఎన్నికలు అనంతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు ఉంటుందనే ప్రచారం నేపథ్యంలో నాయకుల మధ్య ప్రత్యక్షంగా, పరోక్షంగా తీవ్రస్థాయిలో ఆధిపత్య పోరు ప్రారంభమైంది. అధ్యక్ష పదవి పోరులో నాయకులు సహనం కోల్పోయి చేస్తున్న వ్యాఖ్యలతో నష్టం జరుగుతున్నా బీజేపీ అధిష్టానం వేచిచూసే ధోరణి కారణంగా పార్టీ అంతర్గత విభేదాలు బజారునపడుతున్నాయి.
‘పార్టీ విత్ ఏ డిఫరెన్స్’అని గర్వంగా చెప్పుకునే బీజేపీలో నాయకులు, కార్యకర్తలు క్రమశిక్షణతో మెలుగుతారనేది ఒకప్పటి మాట. ఇప్పుడు అధికారమే లక్ష్యంగా పావులు కదపడంతో బీజేపీకి ఇతర పార్టీల్లో ఉండే అన్నిరకాల జాడ్యాలు అంటుకున్నాయి. అందలమెక్కడమే లక్ష్యంగా సిద్ధాంతాలను అటకెక్కించి అరువు నేతలను పార్టీలో చేర్చుకోవడంతో కొత్త, పాత నేతల మధ్య పొసగట్లేదు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధిచడంతో పార్టీలో ఉత్సాహం పెరిగింది. రాష్ట్రంలో 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు ఉండడంతో 2028 అసెంబ్లీ ఎన్నికల్లో 88 స్థానాల్లో గెలిచి అధికారంలోకి వస్తామని ప్రకటనలు గుప్పిస్తున్న బీజేపీ అగ్రనేతలు ముందుగా ఇంటి పోరును సరిదిద్ధుకోకపోతే మొదటికే మోసమొచ్చే ప్రమాదముంది.
రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న వేళ కిందస్థాయి నేతలు, కార్యకర్తలు అగ్రనేతలను కలవడానికి కూడా జంకుతున్నారు. పార్టీ అంతర్గత పోరుతో ఒకరిని కలిస్తే మరొకరి ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని వారు మదన పడుతున్నారు.రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి స్థానంలో మరొకరిని నియమించనున్నారనే బీజేపీ అధిష్టానం లీకులతో రాష్ట్ర నేతలు ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. ఈ వ్యవహారం పార్టీకి తలనొప్పిగా మారనుంది. కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు మాకంటే మాకంటూ హైకమాండ్ వద్ద పైరవీలు చేస్తున్నారు. వీరిలో మాల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందిస్తూ ‘‘దూకుడుగా ఉంటూ దేశం, ధర్మం కోసం పోరాడే పాతనేతలకే అధ్యక్ష పదవి ఇవ్వాలి’’ అన్నారు. దీనికి బదులుగా ‘‘అధ్యక్ష పదవి స్ట్రీట్ ఫైటర్కి ఇవ్వాలా..? గల్లీలో వారికి కాకుండా కుంభస్థలాన్ని కొట్టేవారికే ఇవ్వాలని, పార్టీకి కొత్తనీరు, కొత్త శక్తి అవసరం’’ అని ఈటల పరోక్షంగా రాజాసింగ్కు కౌంటర్ ఇచ్చారు. ఈ మాటల యుద్ధం వీరిద్దరికే పరిమితం కాక ఇతర నేతలకు కూడా పాకి మేమూ ఉన్నామని స్పందిస్తున్నారు. కొత్త,పాత నేతల అంశంపై మెదక్ ఎంపీ రఘునందన్ ‘‘కాంగ్రెస్ నుండి వచ్చిన హిమంత్ బిశ్వ శర్మ బీజేపీ నుండి అసోం సీఎం పదవి చేపట్టలేదా..?’’ అని వ్యాఖ్యానించారు.
పార్టీలో మొదటి నుండి ఉన్న వారికే ప్రాధాన్యత ఇవ్వాలంటున్న రాజాసింగ్ 2009లో టీడీపీ నుండి మంగళహాట్ కార్పొరేటర్గా గెలిచి 2014లో బీజేపీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు. దేశం, ధర్మ కోసం గట్టి వాణి వినిపించే రాజాసింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో ఆయనను సస్పెండ్ చేసిన పార్టీ ఏడాది తర్వాత అసెంబ్లీ ఎన్నికల ముందు సస్పెన్షన్ ఎత్తివేసి గోషామహల్ టికెట్ ఇచ్చిందనేది కూడా చర్చకు వస్తోంది. పార్టీని విస్తరించాలంటే కొత్త నేతలను చేర్చుకోవడం కూడా తప్పనిసరే. అయితే వాటికీ పరిమితులుంటాయి అనేది ఒక వాదన.
బీఆర్ఎస్ను వీడిన ఈటల రాజేందర్ 2021లో హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ నుండి పోటీ చేసి గెలవడంతో ఆయనతో పాటు పార్టీకి కూడా మేలే జరిగింది. ఈ గెలుపు తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీయే అనే వాతావరణం నెలకొనడంతో పార్టీలోకి వలసలు పెరిగాయి. ఇతర పార్టీల నుండి నేతలను చేర్చుకోవడంపై దృష్టి పెట్టిన పార్టీ అధిష్టానం ఈటల రాజేందర్ నేతృత్వంలో ప్రత్యేకంగా ఒక ‘చేరికల కమిటీ’ని కూడా ఏర్పాటు చేసింది. అయితే నేతల వలసలపై పెట్టిన శ్రద్దను పార్టీని సంస్థాగతంగా బలపర్చడంపై పెట్టకపోవడంతో రెండు ఉప ఎన్నికల్లో, 2019 లోక్సభ ఎన్నికల్లో పార్టీ గెలుపు బలుపు కాదు వాపు అని నిరూపితమైంది. ఇందుకు 2022 మునుగోడు ఉప ఎన్నిక, 2023 అసెంబ్లీ ఎన్నికలను ఉదాహరణగా చెప్పవచ్చు.
మునుగోడులో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి బీజేపీలో చేరి 2022లో ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆయన బలమైన నాయకుడే అయినా నియోజకవర్గంలో పార్టీ కేడర్ బలంగా లేకపోవడంతో పరాజయం తప్పలేదు. బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన రాజగోపాల్రెడ్డి అక్కడ సంస్థాగతంగా కాంగ్రెస్ పటిష్టంగా ఉండడంతో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్లోకి మారి అక్కడి నుండి గెలిచారు. 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు హడావుడి చేసిన బీజేపీ సంస్థాగతంగా బలంగా లేకపోవడంతో కేవలం ఎనిమిది స్థానాలతోనే సరిపెట్టుకుంది. ఆ పార్టీ క్షేత్రస్థాయిలో ఎంత బలహీనంగా ఉందో చెప్పడానికి దాదాపు లోక్సభ ఎన్నికల సమయంలోనే జరిగిన ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ మూడో స్థానానికే పరిమితమవడం ఉదాహరణ. అదే పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి మోదీ చరిష్మాతో బీజేపీ అభ్యర్థులు వరంగల్, నల్గొండలో రెండో స్థానంలో, ఖమ్మంలో మూడో స్థానంలో నిలిచారు.
పార్టీ అభివృద్ధి కోసం ఇతర పార్టీ నేతలను చేర్చుకోవడం శృతిమించితే గాడి తప్పడం ఖాయం. 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ను మార్చడంతో ఎన్నికల్లో ఆ ప్రభావం స్పష్టంగా కనిపించింది. పార్టీలో కొత్తగా చేరిన నేతల ఒత్తిడితోనే సంజయ్ను అధ్యక్ష పదవి నుండి తప్పించారనేది బహిరంగ రహస్యమే. పలు నియోజకవర్గాల్లో కొత్త నేతల జోక్యం వల్లే సంజయ్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పార్టీ తరఫున ఏర్పాటు చేసుకున్న యంత్రాంగంలో మార్పుచేర్పులు జరిగాయి. పాత కొత్త నేతల మధ్య వైరంతో పలు సెగ్మంట్లలో గ్రూపు తగాదాలు పెరిగి పార్టీ ఆశించిన ఫలితాలు పొందలేకపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పోటీ చేసిన 111 స్థానాల్లో 90 సీట్లు ఇతర పార్టీల నుండి వచ్చిన వారికే ఇచ్చినా లక్ష్యం నెరవేరక 8 స్థానాల్లోనే గెలిచింది. పార్లమెంట్ ఎన్నికల్లోనూ సరిగ్గా ఎన్నికల ముందు పార్టీలో చేరిన బీబీ.పాటిల్, భరత్ప్రసాద్, సైదిరెడ్డి, సీతారాం నాయక్, ఆరూరి రమేశ్, గోమాస శ్రీనివాస్ ఓడిపోయారు. మరోవైపు ఎన్నికల సమయంలో పార్టీలో చేరిన నేతల్లో కొందరు ఓడిన తర్వాత పార్టీ వ్యవహారాలను పట్టించుకోకుండా వారి దారి వారు చూసుకుంటున్నారు. సంఘ్ పరివార్ సైద్ధాంతికతో ఏర్పడిన బీజేపీ వలసలపై తొందరపాటు నిర్ణయాలతో నష్టపోయింది. పార్టీకి పునాదులు వేసిన పాతతరం నాయకుల వారసులు, అనుచరులు పార్టీ భావజాలం, సిద్ధాంతాలను నమ్ముకొని పార్టీలోనే కొనసాగుతున్నా న్యాయం జరగలేదనే అసంతృప్తితో ఉన్నారు. బంగారు లక్ష్మణ్, ఆలె నరేంద్ర, బద్దం బాల్రెడ్డి, బండారు దత్తాత్రేయ వారసులు పార్టీలో కొనసాగుతున్నపటికీ వారు అప్రాధాన్యత పదవుల్లోనే ఉన్నారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో మల్కాజిగిరి టికెట్ ఖాయమనుకున్న మురళీధర్ రావుకు అవకాశం ఇవ్వలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్ ఆశించి భంగపడ్డ పలువురు నేతలు పార్టీ పట్టించుకోలేదని, తమని కనీసం పలకరించే నేతలు కూడా పార్టీలో లేకుండా పోయారనే అసంతృప్తితో బీజేపీని వీడారు. సిద్ధాంతాలపై ఎలాంటి అవగాహన లేని నేతల పెత్తనం పార్టీలో పెరిగిపోవడంతో మొదటినుండి అన్నివిధాలా చేదోడుగా ఉంటున్న సంఫ్ు పరివార్ కూడా దూరమవుతుండటంతో పార్టీ పునాదులే దెబ్బతినే ప్రమాదం ఉంది.
కొత్తవారు వచ్చారు కదా అని పాత నేతలను విస్మరిస్తే పార్టీ మనుగడే ప్రశ్నార్థంగా మారే ఆస్కారముంది. సైద్ధాంతికంగా పార్టీని నమ్ముకున్న కింద స్థాయి నేతలు, కార్యకర్తలు కొత్త వారికి సహకరించకపోతే వలసల ప్రయోగాలు విఫలమవుతాయి. పార్టీలో గెలిచిన ఎనిమిది మంది ఎంపీలు, రెండో స్థానంలో నిలిచిన మరో ఏడుగురు ఎంపీ అభ్యర్థులతో పాటు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు పాత, కొత్త విభేదాలు లేకుండా కలిసికట్టుగా పార్టీని క్షేత్రస్థాయిలో సంస్థాగతంగా బలపరిచేందుకు కృషి చేస్తే నిన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో తమ బలం పాలమీద పొంగు కాదని నిరూపించవచ్చు.
పార్టీ అధ్యక్ష పదవి ఆశిస్తున్న నేతలు అందరినీ కలుపుకొనిపోకుండా ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటూ ఉంటే రాబోయే కాలంలో ఆ పదవి వారికి ముళ్లబాట అవుతుంది. కడకు ఎవరో ఒకరు ఆ పదవికి ఎంపికైనా, పార్టీ నిర్వహణ కష్టమౌతుంది. కలహాల కాపురాన్నే నడపాల్సి వస్తుంది. ఈ సందర్భంగా చాణక్యుడు చెప్పిన మరో రాజనీతి సూత్రం ‘‘నాయకుడు అన్నీ తానే సొంతంగా చేయగలను అనుకోకుండా నైపుణ్యంతో అందరినీ కలుపుకొని, సహాయసహకారాలు ఇచ్చిపుచ్చుకుంటే విజయవంతం అవుతారు…’’ ఇది బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న నేతలందరికీ వర్తిస్తుంది.
===================
ఐ.వి.మురళీ కృష్ణ శర్మ
పొలిటికల్ అనలిస్ట్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ