Nancharaiah merugumala senior journalist:
కాంగ్రెస్ రెడ్డి సీఎం వస్తేనేగాని ఎం.కోదండరామ్ గారు చట్టసభకు నామినేట్ కాలేకపోవడం తెలుగునాట కులం గొప్పతనాన్ని చెబుతోంది!రెండక్షరాల తోకను పాతికేళ్ల క్రితమే తీసేసినా అదే ఆయనను పెద్దల సభకు పంపిస్తోంది!
పూర్వ మార్క్సిస్టు, పౌరహక్కుల సంఘం మాజీ నేత, తెలంగాణ ఉద్యమ నాయకుడు డాక్టర్ ముద్దసాని కోదండరామ్ రెడ్డి గారు 2014లోనే టీఆరెస్ నేత, నాటి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుగారి సంపూర్ణ మద్దతుతో రాజ్యసభకు ఎన్నికకావాల్సింది. మారిన పరిస్థితుల్లో కోదండరామ్ టీఆరెస్ తరఫున భారత పార్లమెంటు సభ్యుడు కాలేకపోయారు. కేసీఆర్ విధానాలతో, రాజకీయ పోకడలతో విభేదించి 2018 డిసెంబర్‌లో జరిగిన తెలంగాణ రెండో శాసనసభ ఎన్నికల ముందు తెలంగాణ జన సమితి (టీజేఎస్) స్థాపించి జాతీయ నేత రాహుల్ గాంధీ, ప్రాంతీయ తెలుగు నేత నారా చంద్రబాబు నాయుడు పార్టీలతో పొత్తుపెట్టుకుని పోటీచేశారు. తాను స్వయంగా అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగకపోయినా తన పార్టీ తరఫున నామమాత్రంగా నాలుగు సీట్లకు అభ్యర్థులను నిలబెట్టారు. ఒక్క సీటూ గెలవకపోయినా టీఆరెస్ లేదా బీఆరెస్ సర్కారుపై పోరాటం కొనసాగించారు. 2023 చివర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ మూడో ఎన్నికల్లో కోదండరామ్ గారు టీజేఎస్ అభ్యర్థులను నిలపలేదు. ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ లేదా బేషరతు మద్దతు ప్రకటించారు.
బీఆరెస్ ఓటమిని, కాంగ్రెస్ గెలుపును మనస్పూర్తిగా కోరుకున్న ముద్దసాని కోదండరామ్ గారు పదేళ్ల తర్వాత విజయహాసంతో నిలబడ్డారు. తెలంగాణ ఉద్యమకాలంలో ప్రొఫెసర్ ముద్దసాని గారితో మంచి సంబంధాలున్న రోజుల్లో హైదరాబాద్‌లో జరిగిన ఓ బహిరంగసభలో కేసీఆర్ తెలంగాణ ఉద్యమ నేతగా– కోదండరామ్ ను పక్కనపెట్టుకుని మాట్లాడుతూ, ‘‘హైదరాబాద్ తెలుగు సినిమా రంగంలో అంతా ఆంధ్రోళ్లదే పెత్తనం. సినిమాల్లో నటించాలన్నా, తీయాలన్నా, దర్శకత్వం వహించాలన్నా ఏ పనైనా ఆంధ్రా ప్రాంతంలో పుట్టి ఇక్కడికి వచ్చినోళ్లే చేస్తున్నారు. రేపు మన తెలంగాణొస్తే–మనమే తెలుగు సినిమాలు తీస్తం. మన కోదండరామ్ సారే హీరోగా కూడా నటించే సినిమాలు వస్తాయి, చూడండి. కోదండరామ్ సర్ ముఖం సిన్మా హీరోగా సరిపోదా, మీరే చెప్పండి,’ అంటూ నవ్వుతూ దూకుడుగా చంద్రశేఖర్ రావు గారు ప్రసంగించారు. అప్పుడు కోదండరామ్ గారి ముసిముసి నవ్వులు మాలాంటి వారికి ఇంకా గుర్తున్నాయి. కాని, తాను ముఖ్యమంత్రి అయ్యాక కోదండరామ్ ను కేసీఆర్ సహజంగానే పట్టించుకోలేదు. తనకు అన్ని విధాలా రాజకీయంగా ఉపయోగపడిన, ఉపకరించే మున్నూరు కాపు మాజీ కాంగ్రెస్ రాజకీయ కురువృద్ధుడు కంచర్ల కేశవరావు (ఇప్పుడు వయసు 84 ఏళ్లు) గారిని రెండుసార్లు రాజ్యసభకు పంపారుగాని తన ఒరిజినల్ సొంత జిల్లాకే (కరీంనగర్) చెంది, ఆదిలాబాద్ జిల్లాలో స్థిరపడిన కోదండరామ్ కు పార్లమెంటుకు పోయే అవకాశమే ఇవ్వలేదు సిద్దిపేట పెద్ద పద్మనాయకుడు. చివరికి మహబూబ్ నగర్ జిల్లాలో పునాదులున్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వరకూ ప్రొఫెసర్ కోదండం సర్ తెలంగాణ చట్టసభలో అడుగుబెట్టే అవకాశం పొందలేకపోయారు. 1980ల చివర్లో విజయవాడ ఉదయం పత్రికలో పనిచేస్తున్నప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చే ఏపీసీఎల్సీ మాస పత్రిక ‘స్వేచ్ఛ’లో ఎడిటర్ ఎం.కోదండరామ్ రెడ్డి అని మొదటిసారి ఆయన పేరు చూశాను. ఏదేమైనా ప్రొఫెసర్ సాహబ్ కు ఇప్పుడైనా న్యాయం జరిగిందని తెలంగాణవాదులు సంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. 1990లో నడిచిన మండల్ వ్యతిరేక ఆందోళన సమయంలో కోదండరామ్ గారు తన పేరు నుంచి ‘రెడ్డి’ అనే మాటను తొలగించుకున్నారని చదివాను. కాని ఆ రెండు అక్షరాలే ఆయనను తెలంగాణ పెద్దల సభకు నామినేట్ అయ్యేలా చేయగలిగాయి. 21వ శతాబ్దం మొదటి పాతికేళ్లలో కూడా ఆ రెండక్షరాలకు హైదరాబాద్ నగరంలో అంత శక్తి ఉంది మరి.