తెలుగు రాష్ట్రాల యువత భవిష్యత్తు బంగారం కావాలి: పవన్ కళ్యాణ్

Telanganaelections: ‘ తాను ఏనాడూ పదవులు కోసం రాజకీయాల్లోకి రాలేదన్నారు జనసేన అధ్యక్షులు  పవన్ కళ్యాణ్. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన- బీజేపీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ దుబ్బాకలో ఏర్పాటు చేసిన సకల జనుల విజయ సంకల్ప సభలో పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారం కోసం తాను ఏ నాడూ అర్రులు చాచలేదన్నారు. అధికారం, పదవులు మాత్రమే ఆఖరి లక్ష్యం అయితే  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనే రాజకీయాలు చేసుకునేవాడినని..అక్కడే ఉండిపోయేవాడినని స్పష్టం చేశారు. తన ఆలోచన రెండు తెలుగు రాష్ట్రాల యువత బంగారు భవిష్యత్తు.. పోరాడి సాధించిన తెలంగాణ రాష్ట్ర కలలు, ఆకాంక్షల సాకారం మాత్రమేనని తేల్చిచెప్పారు. తెలంగాణ సంపూర్ణ ఎదుగుదలకు జనసేన సహకారం పూర్తి స్థాయిలో ఉంటుందని పవన్ పేర్కొన్నారు.

కాగా “తెలంగాణ యువత అంటే పోరాటానికి నిలువెత్తు నిదర్శనమని పవన్ అన్నారు. ఇక్కడి యువతలో అమితమైన శక్తి.. తెగింపు ఉందన్నారు. తమ ప్రాంతానికి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునే యువత కాదని.. తిరగబడి సాధించుకుంటారని.. వారి పోరాట స్ఫూర్తి నన్ను రాజకీయాల్లోకి వచ్చేలా ప్రేరేపించిందన్నారు. దశాబ్దాల ఆకాంక్ష అయిన తెలంగాణ రాష్ట్రం సాకారం అయ్యిందని.. ఇక ప్రగతి  బాటలో రాష్ట్రం ముందుకు సాగాలని కోరారు. ఇక్కడి ప్రజలు దేనికోసం పోరాడారో వారి ఆకాంక్షలన్నీ తీరాలని.. వెలుగులీనే తెలంగాణ రావాలని  అన్నారు. సమష్టిగా దీని కోసం ప్రతి ఒక్కరూ  కష్టపడదామని.. పోరాడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని ప్రగతి దశలో నిలిపేందుకు సుస్థిరమైన పరిపాలనకు, అన్ని విధాలుగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లే బీజేపీ నాయకత్వాన్ని బలపరుద్దామని పవన్  పిలునిచ్చారు. 

మార్పు సాధ్యం..

అధికారం ఏ ఒక్కరి సొత్తూ కాదన్నారు పవన్. సమాజంలో ఉన్న అన్ని వర్గాలకు అధికారం దగ్గర కావాలన్నారు. తెలంగాణ సాధించుకున్నప్పుడు దళితుడు ముఖ్యమంత్రి అవుతాడని అంతా అనుకున్నామని… అంతా సంతోషించామని.. ఆ కల నెరవేరలేదాని.. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కచ్చితంగా బీసీ వర్గాల నుంచి ముఖ్యమంత్రిని చేస్తామని మాటకు తెలంగాణ ప్రజానీకం అంతా మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.అధికారం అనేది ఏ ఒక్కరి సొత్తు కాదని.. కచ్చితంగా అది అందరికీ అందాలని.. అప్పుడే సమాజంలో సంపూర్ణ మార్పు సాధ్యమని పవన్ చెప్పుకొచ్చారు.