ManmohanSingh : మంచి పనుల్తో మాట్లాడిన మౌని..!

ManmohanSingh : మంచి పనుల్తో మాట్లాడిన మౌని..!

ManmohanSingh:

పీవీ నర్సింహారావు దూరదృష్టి, సోనియాగాంధీ త్యాగం.. వెరసి, భారత దేశానికి కీలక సమయంలో పదేళ్లు ప్రధానమంత్రిగా లభించిన మానవతానేత మన్మోహన్సింగ్! ‘మాట్లాడరు, సొంత నిర్ణయాలు తీసుకోలేరు, టెన్ జన్పథ్ చేతిలో కీలుబొమ్మ’ లాంటి విమర్శలున్నా… ఎన్నో విషయాల్లో ఆదర్శనేత ఆయన. నిగర్వి, నిరాడంబరుడు, నిష్కళంకుడు, అన్నిటికీ మించి పక్కా నిజాయితీపరుడు. కష్టకాలంలో దేశాన్ని ఆర్థికంగా పునరుజ్జీవింపజేసిన సంస్కర్త. ఆర్బాటం లేకుండా దశాబ్దాల తరబడి దేశ గమనాన్ని నిర్దేశించే ఉపాధిహామీ, ఆహారభద్రత, సమాచారహక్కు, విద్యాహక్కు, భూసేకరణ-2013, కనీస వేతనం, గిరిజనుల అటవీహక్కులు తదితర విప్లవాత్మక చట్టాలను తెచ్చిన ఓ ఉజ్వల కాలానికి పాలనాదక్షుడాయన. ఉద్యమ ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర శిల్పుల్లో మేటి! రెండు తెలుగు రాష్ట్రాల మేలుకోరిన శ్రేయోభిలాషి. దేశం గర్వించేలా.. మూడు ముఖ్య ఉద్యోగాలు చేసి కూడా, అపార్టుమెంట్ ఇంటికే యజమాని అయన సామాన్య అసామాన్యుడు!

ఢిల్లీ నడిబొడ్డునున్న విజ్ఞాన్భవన్లో, 2004 శీతాకాలంలో ఓ ముఖ్య సమావేశం జరుగుతోంది. ప్రధాన తెలుగుపత్రిక ప్రతినిధిగా నేనా సమావేశం కవర్ చేస్తున్నాను. దేశం వివిధ ప్రాంతాలకు చెందిన వంద మంది జిల్లా మెజిస్ట్రేట్/కలెక్టర్లు సభికులు. ‘‘ఇది సంకీర్ణాల యుగం. రాజకీయ పార్టీలకు అవకాశాల్లాగానేఅనివార్యతలుంటాయి. కొన్ని పార్టీలు కలిసి ప్రభుత్వాలను ఏర్పాటు చేసినపుడు నిర్ణయాలు తీసుకోవడంలో పరిమితులూ ఉంటాయి. రాజ్యాంగానికి బద్దులై విధి నిర్వహించాల్సిన మీరు క్షేత్రంలో, ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉంటారు. ప్రభుత్వాల నిర్ణయాలను పార్టీలకతీతంగా అమలు చేసేది మీరే. ప్రజలకు మేలు చేసే ఓ గొప్ప అవకాశం రాజకీయ నాయకుల కన్నా మీ చేతుల్లోనే ఎక్కువ. దయచేసి ఈ సూక్ష్మం గ్రహించి… బాధ్యతగా, మానవతా దృక్పథంతో వ్యవహరించండి’’ అని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన పెద్దమనిషి, ఆర్తిగా సభికులను అభ్యర్థిస్తున్నారు. ఆయన వేరెవరో కాదు, నాటి దేశ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్. సీన్ కట్ చేస్తే, దాదాపు పదేళ్ల తర్వాత…. ప్రధానిగా తన చివరి విలేకరుల సమావేశం, 2014 శీతాకాలంలో ‘‘సమకాలీన మీడియా, దేశంలోని ప్రతిపక్షాలు నన్ను విమర్శించవచ్చు. కానీ, చరిత్ర నా పట్ల దయతో వ్యవహరిస్తుందని నిజాయితీగా నమ్ముతున్నా. పాలనావ్యవస్థలోని విషయాలన్ని బయటకు చెప్పలేను కానీ, ఒక మాట చెప్పగలను. సంకీర్ణ రాజకీయాల్లో కూటమి ప్రభుత్వ పరిమితుల దృష్ట్యా…. ఏ పరిస్థితుల్లో, దేశహితంలో ఎలా వ్యవహరించాలో అలాగే వ్యవహరించాను’’ అన్నారు మన్మోహన్ సింగ్. మరో దశాబ్దం తర్వాత… ఇవాళ, 2024 ముగింపు రోజుల్లో, మరో శీతాకాలపు అంచుల్లో నిలబడి చరిత్రను అవలోకనం చేస్తే, ఆయన మాటల్లోని వాస్తవం కళ్లకు కడుతుంది. యూపీయే మొదటి టర్మ్ (2004- 2009) లో వచ్చినన్ని గొప్ప చట్టాలు, కీలక విధాన నిర్ణయాలు అటు రెండున్నర, ఇటు ఒకటిన్నర దశాబ్దాలు, అంటే దాదాపు అర్థ శతాబ్దిపాటు లేవనే చెప్పొచ్చు.

అందుకేనేమో, అమెరికా మాజీ అధ్యక్షుడు బారాక్ ఒబామా తన పుస్తకం (ఎ ప్రామీజ్డ్ లాండ్) లో మన్మోహన్సింగ్ గురించి, ‘తెలివైన, ఆలోచనాపరుడైన, నిజాయితీగల నాయకుడు’ అని అభివర్ణించారు.

నెహ్రూకు తీసిపోని నేత..

భారత రిజర్వుబ్యాంక్ గవర్నర్గా సేవలందించిన మన్మోహన్ సింగ్ పెద్ద చదువరి. ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ వంటి దిగ్గజ విశ్వవిద్యాలయాల్లో డిగ్రీలు పొందినా… మిడిసిపాటు లేకుండా, ఎంతో అణకువగా ఉండేవారు. దివంగత ప్రధాని పి.వి.నర్సింహారావు హయాంలో ఆర్థిక మంత్రిగా, తర్వాత రెండు పర్యాయాలు తానే దేశ ప్రధానిగా మూడు ముఖ్య ఉద్యోగాలు చేసిన ప్రఖ్యాత ఆర్థికవేత్త! ఆర్థిక మంత్రిగా దిగిపోయిన తర్వాత కూడా, ప్రయివేటు సభలు, సమావేశాలకు తన మారుతి -800 కారులో, స్వయంగా నడుపుతూ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చేంత నిరాడంబరులని ఢిల్లీ పాత్రికేయ మిత్రులు చెప్పేది. ప్రజాస్వామ్య పాలన, దాని వివిధ అంగాలు, చర్చలు- సంప్రదింపుల పట్ల ఎంతో విశ్వాసం ఆయనకి. సింగ్ హయాంలోనే కేంద్ర ప్రభుత్వంలో బోలెడన్ని మంత్రివర్గ ఉపసంఘాలు ఏర్పడ్డాయి. సోనియా నాయకత్వంలో జాతీయ సలహా మండలి (ఎన్యేసీ), వీరప్పమోయిలీ నేతృత్వంలో పరిపాలనా సంస్కరణల కమిటీ, ప్రణబ్ ముఖర్జీ నాయకత్వంలో చిన్న రాష్ట్రాల ఏర్పాటు అధ్యయన కమిటీ, ప్రొఫెసర్ జయశంకర్ నేతృత్వంలో కనీస వేతనాల అధ్యయన కమిటీ, జయతీఘోష్ అధ్యక్షతన వ్యవసాయ కమిటీ, కనీస ఉమ్మడి కార్యక్రమ అమలు కమిటీ… ఇలాంటివి ఎన్నో ఏర్పడి, పనిచేశాయి. స్వాతంత్య్రం వచ్చిన కొత్తలోనే ఐఐటీలు, ఐఐఎంలు వంటి ప్రతిష్టాత్మక సంస్థల ఏర్పాటుకు తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చొరవ తీసుకున్నట్టే, దేశంలో నైపుణ్యాల వృద్దికి మరిన్ని కీలక బోధన, శిక్షణ సంస్థలుండాలని మన్మోహన్కు కోరికగా ఉండేది. అప్పట్లో తనను కలిసిన నాటి ఏపీ కాంగ్రెస్ ఎంపీల కన్వీనర్, నేటి తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్తో స్వయంగా ఈ విషయాన్ని పంచుకున్న మన్మోహన్సింగ్, తనను రాజకీయాల్లోకి తీసుకువచ్చిన పీవీ నర్సింహారావు పట్ల ఎంతో కృతజ్ఞతా భావంతో ఉండేవారు. ఎంపీగా పొన్నం కోరిందే తడవుగా, పీవీ స్వస్థలమైన ‘వంగర’తో కూడిన కరీంనగర్ నియోజకవర్గ పరిధిలో రెండు కేంద్రీయ విద్యాలయాలను మంజూరు చేశారు.

‘ఒకరకంగా చెప్పాల్సి వస్తే నెహ్రూ కన్నా గొప్పవాడు మన్మోహన్సింగ్….’ (బుక్ణ్ అబ్జల్యూట్ కుష్వంత్) అంటారు ప్రఖ్యాత రచయిత, జర్నలిస్ట్ కుష్వంత్సింగ్. ‘నిజాయితీ అనే మాట ప్రస్తావన రాగానే, దేశంలో అత్యున్నత స్థానం అధిష్టించిన ఓ వ్యక్తి పేరు స్పురణకు రావడాన్ని మించి ఏముంటుంది?’ అంటారాయన.నెహ్రూ లాగానే ముఖ్యమంత్రులకు తరచూ లేఖలు రాసిన ప్రధాని ఆయన. ‘భారతదేశంలో నెహ్రూ తర్వాత అంతటి నేత మన్మోహన్సింగ్’ అని ఫోర్బ్స్ పత్రిక రాసింది.

తెలుగు సమాజం పట్ల అవ్యాజ ప్రేమ
తెలుగు సమాజం పట్ల మన్మోహన్సింగ్కు ఎంతో ప్రేమాభిమానాలుండేవి. వాటినాయన దాచుకోలేదు, పలు విధాలుగా వ్యక్తం చేశారు. 2004, 2009 రెండు పర్యాయాలు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ ఎంపీలను గెలిపించి, కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వపు యూపీఏ ప్రభుత్వ ఏర్పాటుకు ఏపీ దోహదం చేసింది. ప్రయివేటు సంభాషణల్లో, నాటి ఏపీ సీఎం డా.వైఎస్ రాజశేఖరరెడ్డిని చూపిస్తూ, ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ఇతర నేతలతో చెప్పేది. వై.ఎస్ కూడా మన్మోహన్ పట్ల ఎంతో అభిమానంతో ఉండేది. ఆ కాలంలోనే, దేశ వ్యాప్తంగా రూ.78వేల కోట్ల మేర వ్యవసాయ రుణాలను మాఫీ చేసినపుడు, అంతకు ముందే పద్దతిగా రుణాలు చెల్లించిన రైతుల్ని చిన్నబుచ్చవద్దని, అలాంటి ప్రతి రైతుకు ఏపీలో రూ.5 వేల చొప్పున వై.ఎస్ ఇప్పించారు. ఈ చొరవను మన్మోహన్ అభినందించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు విషయంలో ప్రతిష్టంభన ఏర్పడ్డప్పుడు, మన్మోహన్ చొరవ తీసుకొని ఇటు సోనియాగాంధీ, అటు వెంకయ్యనాయుడిని తన ఇంటికి బ్రేక్ఫాస్ట్కి పిలిచి మధ్యేమార్గం ఆలోచించారు. రాజ్యాంగం అధికరణం 4, కింద కొత్త రాష్ట్రం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వానికున్న అధికారాల్ని ఉపకరణంగా వాడటంలో ముఖ్యభూమిక పోషించారు. రెండు రాష్ట్రాల మేలు కోరి, పలు భద్రతాచర్యలు విభజన చట్టంలో ఉండేలా ప్రతిదశలో శ్రద్ద చూపారు. ప్రత్యేక హోదా ప్రతిపాదన, పోలవరం జాతీయహోదా, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీలకు చోటు కల్పించారు. విభజన తర్వాత ఏపీలో విద్యుత్ సంక్షోభం ఏర్పడ్డపుడు, రెండు రాష్ట్రాల వారిని పిలిపించి సయోధ్యకు చొరవ తీసుకున్నారు. తెలుగువాడైన ప్రఖ్యాత ఎడిటర్ సంజయ్బారును తన మీడియా సలహాదారుగా నియమిస్తున్నపుడు, ‘నా నుంచి మీరు ఏం సేవలు ఆశిస్తున్నా’రని బారు అడిగితే, మన్మోహన్ స్పందించిన తీరు సమకాలీన పాలకులకు ఓ చక్కని పాఠమే! ‘నా హోదా కారణంగా నేను ప్రజాక్షేత్రానికి దూరమవుతాను కద! నాకిక కళ్లు`చెవులు మీరే, ప్రజాహితంలో ఏది మంచిదయితే అది మీరు నాకు చెబుతూ ఉండండి, చాలు’ అన్నారంటే, పాలకులంతా ఇలా ఆలోచిస్తే ఎంత బావుంటుందో! ‘ఆర్థిక సంస్కరణల్ని సమర్థంగా చేపట్టిన…. నిలకడైన, నిజాయితీ గల రాజనీతిజ్ఞుడు, దార్శనికుడు మన్మోహన్’అని అమెరికా రాయబారి, యుఎస్ఏ ఒకప్పటి స్టేట్ సెక్రటరీ హెన్రీ క్రిసింగర్ అన్నారు.

చేతలతోనే మాటాడారు..

‘మౌనమే మంచిది, అంతకన్నా మాటలాడటం వల్ల ఎక్కువ మేలనిపించినపుడే నోరిప్పండి’ అని చెబుతారు వ్యక్తిత్వ వికాస నిపుణులు. మన్మోహన్ ఎక్కువ మాట్లాడరనేది ఒక పరిశీలన! అదేం లోపం కాదు. ‘మనమే మాట్లాడనక్కర లేదు. మన పని, చర్యలు మాట్లాడుతాయి. అందుకే, పారదర్శక పాలన కావాలి’ అన్నారు మన్మోహన్, 2008లో అన్ని రాష్ట్రాల ఆర్టీఐ కమిషనర్లనుద్దేశించి ప్రసంగిస్తూ! ‘ప్రజలకు మేలు చేసిన వాడు నేను చేశాను, నేను చేశానని చెప్పుకుంటారా?’అని ఆరెస్సెస్ చీఫ్ మోహన్భాగవత్ సంధించిన ప్రశ్న హేతుబద్దమే! గొంతుచించుకు మాట్లాడకుండానే ఎన్నో మంచిపనులు చేశారు మన్మోహన్ సింగ్. ప్రధానిగా ఆయన్ని, ఆర్థిక సంస్కరణల్ని విమర్శించిన కమ్యూనిస్టు నాయకులు కూడా ఆయన ఆర్థిక విధానాలనే పశ్చిమబెంగాల్, కేరళ వంటి తాము పాలించే రాష్ట్రాల్లో అమలు చేశారు. ‘పెట్టుబడికి రంగు లేదు’ అన్నారు పశ్చిమ బెంగాల్ దివంగత సీఎం బుద్దదేవ్ భట్టాచార్య. నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించినపుడు, ‘నల్లధనం వెలికితీతకు పనికిరాదు సరికదా, దీని ప్రతికూల ప్రభావం 2శాతం జీడీపీ పతనానికి కారణమవుతుంది’ అని పార్లమెంటులో మన్మోహన్ చెబితే, ఆయనొక గొప్ప ఆర్థికవేత్త అన్నది కూడా మరచిన కొందరు ‘వ్యక్తిఆరాధకులు’ నవ్వుకున్నారు. చివరకు, ఆయన చెప్పిందే సత్యమై తేలింది.

దేశంలోని అన్ని రాష్ట్ర రాజధానుల్లో, పోర్ట్ల్యాండ్ (అండమాన్ దీవులు) తో సహా, విలేకరుల సమావేశాల్లో మాట్లాడిన ఏకైక ప్రధానమంత్రి మన్మోహన్సింగ్. ప్రత్యేకంగా అందుకు సన్నద్దత కూడా ఉండేది కాదు. ఒక విలేకరుల భేటీ ముందు, ‘ఫ్రెష్ అవుతారా?’అని సలహాదారు అడిగితే, ‘అడవిలో పులి పళ్లు తోముకుంటుందా?’ అనడిగారు. ఓ విలేకరుల భేటీలో 52 ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. భారతదేశం, మన్మోహన్సింగ్ రూపంలో ఓ గొప్ప దార్శనికుడిని, ఆర్థికవేత్తని, మానవతామూర్తిని కోల్పోయింది.