రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ రాజకీయం ఆసక్తిని రేకెత్తిస్తోంది. నియెజకవర్గం ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కు వ్యతిరేకంగా బిఆర్ ఎస్ నేతల వ్యవహరం హాట్ టాపిక్ గా మారింది. అటు కాంగ్రెస్ నేతల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుంటే.. గ్రేటర్ లో పట్టున్న బీజేపీ బలమైన అభ్యర్థిని బరిలోకి దించి లబ్ధి పొందాలని భావిస్తోంది.
ప్రకాశ్ గౌడ్ మూడు పర్యాయాలుగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. టిడీపీ నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. ప్రత్యర్థి పార్టీలను బురిడికొట్టించడంలో ఆయనకు ఆయనే సాటి. అయితే ఈసారి ఆయనకు టికెట్ కష్టమనే చర్చ పార్టీలో జరుగుతుంది. ఇందుకు కారణం లేకపోలేదన్నది వారి వాదనగా వినిపిస్తుంది.గత నవంబర్ నెలలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి వెళ్లిన ఎమ్మెల్యేను ప్రజలు అడుగడుగునా అడ్డుకున్నారు. అభివృద్ధి ఎన్నికల ముందు గుర్తొచ్చిందా? అంటూ నిలదీశారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత డివిజన్ లో అభివృద్ధి ఎక్కడ జరిగిందో చూపించాకే పనులకు శంకుస్థాపన చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక కార్పొరేటర్ అర్చన ప్రజలకు నచ్చజేపేందుకు ప్రయత్నించింది. ప్రజలు తిరగబడటంతో ఆమె అక్కడి నుంచి జారుకున్నారు. ఇదే నియెజకవర్గం నుంచి చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, మంత్రి సబిత ఇంద్రారెడ్డి కుమారుడు కార్తిక్ రెడ్డి పోటికి ప్రయత్నిస్తున్నారని పార్టీ నేతల నుంచి వినిపిస్తున్న సమాచారం. ముగ్గురిలో గులాబీబాస్ టికెట్ ఎవరికి ఇస్తారన్నది మిలియన్ డాలర్ ప్రశ్న
కాంగ్రెస్ లో సైతం ఇదే పరిస్థితి కనిపిస్తుంది. నియోజకవర్గం నుంచి పోటిచేయాలని ఇద్దరు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. పీసీసీ చీఫ్ అనుచరుడిగా ఉన్న కోకాపేట జైపాల్ రెడ్డి, మణికొండ మున్సిపాలిటీ చైర్మన్ నరేందర్ ముదిరాజ్ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రెండు వర్గాల నేతలు టికెట్ మానేతకే వస్తుందంటే.. మానేతకు వస్తుందంటూ ధీమాగా చెబుతున్నారు.
ఇదిలా ఉంటే ..గ్రేటర్ లో మంచి పట్టున్న బీజేపీ ఈసీటుపై కన్నేసింది. ఎలాగైనా సీటు దక్కించుకోవాలని ప్రయత్నాలను మొదలెట్టింది. మైలార్ దేవిపల్లి కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యేగా బరిలోకి దింపి లబ్ధి పొందాలని కాషాయం నేతలు భావిస్తున్నారు. పార్టీలో ఎంతోకాలం నుంచి కొనసాగుతు.. ఎనలేని కృషిచేస్తున్న బొక్కా బాల్ రెడ్డి కూడా టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. మరి ఇద్దరిలో టికెట్ ఎవరిని వరిస్తుందో వేచిచూడాలి. అటు ఎంఐఎం కూడా బలమైన నేతను బరిలోకి దింపి వ్యూహాలను రచిస్తుంది. ఇప్పటివరకు పోటిచేసే నేత ఎవరన్నది క్లారీటి లేనప్పటికి.. పోటిచేయడం మాత్రం ఖాయంగా కనిపిస్తుంది.
మొత్తంగా చతుర్మఖ పోటి కనిపిస్తున్న రాజేంద్రనగర్ లో పాత సంప్రదాయం కొనసాగుతుందా? లేక సంచలనాలు నమోదవతాయా? తెలియాలంటే అసెంబ్లీ ఎన్నికలకు వరకు వేచిచూడాలి…