పరిగి రాజకీయం శరవేగంగా మారుతుంది. అసెంబ్లీ ఎన్నికల దగ్గరపడుతున్న వేళ ఎవరికి వారు టికెట్ కోసం ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఎమ్మెల్యేగా మరోసారి గెలవాలని మహేష్ రెడ్డి పట్టుదలగా కనిపిస్తుంటే.. మేము సైతం టికెట్ రేసులో ఉన్నామంటున్నారు కొందరు బిఆర్ ఎస్ నేతలు. కాంగ్రెస్ లో సైతం ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంటే.. అభ్యర్థి ఎవరన్న దానిపై బీజేపీ తర్జన భర్జన పడుతుంది.
బిఆర్ ఎస్ లో వర్గ పోరు…
కాగా పరిగి బిఆర్ ఎస్ లో నేతల మధ్య విభేదాలు కలకలం రేపుతున్నాయి. పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో పదవుల విషయంపై నేతలు ఒకరిపై మరోకరు బహిరంగంగానే విమర్శలు చేసుకోవడం నియోజకవర్గ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి .. ఆయన సోదరుడు అనిల్ రెడ్డి మధ్య కొంతకాలంగా కోల్డ్‌వార్ నడుస్తుంది. ఎమ్మెల్యే గా పోటిచేసేందుకు అనిల్‌రెడ్డి ఆసక్తి చూపిస్తున్నారు. కొప్పుల బ్రదర్స్‌మధ్య విభేదాలు తలెత్తడంతో .. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ ఛైర్మన్ బి.మనోహర్‌రెడ్డి నియోజకవర్గంలో క్యాడర్‌ను పెంచుకునే పనిలో పడ్డారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్‌ఆశించి భంగపడ్డ మనోహర్.. కేటీఆర్ సపోర్ట్‌తో జిల్లా బ్యాంక్‌ఛైర్మన్‌పదవి దక్కించుకున్నారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో టికెట్ తమ నాయకుడిదే అంటూ ఆయన అనుచరులు హాల్ చల్ చేస్తున్నారు.
ఇక కాంగ్రెస్ లో సైతం బిఆర్ ఎస్ సీన్ కనిపిస్తుంది. మరోసారి ఎమ్మెల్యేగా పోటిచేయాలని డీసీసీ అధ్యక్షుడు రాంమోహన్‌రెడ్డి పట్టుదలగా ఉన్నారు. ఆయన వ్యతిరేక వర్గమైన జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సతీష్‌రెడ్డి సైతం టికెట్ రేసులో ఉన్నట్లు పార్టీలో చర్చ జరుగుతుంది. ఇప్పటివరకు రెండు వర్గాలు వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. దీంతో రెండు వర్గాల పోరు రాష్ట్ర నాయకత్వానికి తలనొప్పిగా మారింది.
ఇదిలా ఉంటే.. బీజేపీ నియోజకవర్గంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.. సమర్ధవంతుడైన నాయకుడి కోసం అన్వేషిస్తోంది. బండి సంజయ్ పార్టీ పగ్గాలు చేపట్టాకా బీజేపీ బలం బాగా పెరిగింది. దీంతో ఇక్కడి నుంచి ఓ ప్రముఖ నేతను పోటిచేయించే యోచనలో పార్టీ అధిష్టానం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.