ఆషాడ మాస బోనాల ప్రత్యేకత!

తెలంగాణ సంస్కృతిలో బోనాలకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో తెలిసిందే. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో ఎంతో ఘనంగా బోనాలు నిర్వహిస్తారు. ఈ బోనాలు తెలంగాణ ప్రజల భక్తి విశ్వాసాలకు ప్రతీకగా నిలుస్తాయి.

బోనం విశిష్టత!
భోజనం ప్రకృతి. బోనం వికృతి. బోనం అంటే భోజనం. దీన్ని కొత్తకుండలో వండి ప్రదర్శనగా వెళ్లి గ్రామదేవతలకు భక్తి ప్రపత్తులతో సమర్పిస్తారు. చిన్నముంతలో పానకం పోస్తారు. దానిపై దివ్వె పెట్టి బోనంపై జ్యోతిని వెలిగించి జాతరను కన్నుల పండుగగా నిర్వహిస్తారు.

జంటనగరాల్లో బోనాల సందడి:
ఆషాడమాసంలో జంటనగరాల్లో బోనాల సందడి అంతాఇంతా కాదు. పిల్లాపెద్దా అంతా కలిసి ఆనందంగా ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. సికింద్రాబాద్లోని ఉజ్జయినీ మహంకాళి జాతరతో ఈ సంబురం అంబరాన్నంటుతుంది.
ప్రతిఏటా గోల్కొండ జగదాంబికా ఆలయంలో ప్రారంభమయ్యే బోనాల సంబురం, సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి ఆలయంలో మొదలుకొని మొత్తం 14 ప్రధాన అమ్మవార్ల దేవాలయాల్లో కన్నులపండువగా జరుగుతాయి.
కలశంలో అమ్మవారిని ఆవాహనచేసి అత్తింటి నుంచి పుట్టింటికి ఎదుర్కోని రావడమే ఘటోత్సవం. మంగళవాద్యాలు, భక్తుల నృత్యాల నడుమ వైభవంగా అమ్మవారికి స్వాగతం పలుకుతారు.
బోనాల పండుగలో ప్రత్యేకమైనది.. పోతరాజు వేషం. ఒళ్లంతా పసుపు పూసుకుని, ఎర్ర ధోతి కట్టుకుని, చేతిలో కొరఢా పట్టుకుని, కాళ్లకు గజ్జెలు, మెడలో పూలదండ వేసుకుని డప్పుల చప్పుళ్లకు అనుగుణంగా చిందులేస్తూ బోనాల ముందు కదిలివస్తాడు. పోతరాజుతో చిన్నాపెద్దా అంతా కలిసి నృత్యాలు చేస్తారు. పిల్లలంతా ఎంతో సంబురంగా కేరింతలు కొడుతుంటారు.

వేపకొమ్మల్ని పసుపునీటిలో ముంచి ఆ నీరు అమ్మవారికి సమర్పించటాన్ని శాకమిచ్చుట .. బెల్లంతో తయారు చేసిన మధురమైన భోజనాన్ని శక్తికి నివేదించడాన్ని పాకమిచ్చుట అంటారు. అమ్మకు ఇష్టమైన ఆహారాన్ని వండి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి ఆమెకు నివేదిస్తారు. అనంతరం ప్రసాదంగా అందరికి పంచిపెడతారు.

బోనాల పండుగ తరువాత రోజు ఉదయం అమ్మవారిని ఆవహించిన అవివాహిత స్త్రీ భవిష్యవాణి వినిపిస్తుంది. భవిష్యత్లో జరిగే విషయాలను అమ్మవారి మాటగా పలుకుతుంది. ప్రతి ఆలయంలో వీరు ఉంటారు. బోనాల సంబురానికి ప్రధాన ఆకర్షణ ఈ రంగం.

అమ్మవారిని ఊరేగిస్తూ అత్తింటికి సాగనంపడంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. ఒక్కోప్రాంతంలో ఒక్కో రూపంలో అమ్మను పూజిస్తారు. వ్యాధుల నుంచి కాపాడమని.. కష్టాలను ఎదుర్కొనే ధైర్యాన్నివ్వమని నిండు మనసుతో అమ్మకు మొక్కుకుంటారు.

Optimized by Optimole