విశీ(వి.సాయివంశీ) :
ఆ పాప పేరు భవ్యశ్రీ. వయసు 8 ఏళ్లు. తనది నెల్లూరు జిల్లా. కొన్నాళ్లుగా జ్వరంతో ఇబ్బంది పడుతూ ఉంది. రెండు నెలల క్రితం నెల్లూరులోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. స్కానింగ్ చేశాక తెలిసింది తనకు బ్రెయిన్ ట్యూమర్ అని. రూ.లక్షలు ఖర్చు పెడితే తప్ప పాప బతకదని డాక్టర్లు తేల్చేశారు. తల్లిదండ్రులు కలవరపడ్డారు. వాళ్లదేమైనా కలిగిన ఇల్లా, లక్షలు తేవడానికి? భవ్యతోపాటు మరో కూతురు, కొడుకు ఉన్నారు వాళ్లకి. అంతంతమాత్రం సంసారం. కానీ బిడ్డ ప్రాణం తీసుకోవడానికి ఎవరికి మనసొప్పుతుంది? ఎలాగో అప్పు చేసి ఆ డబ్బు తెచ్చి బిడ్డను బతికించుకుందాం అనుకున్నారు.
ఈలోపు ఓ రోజు చర్చికి వెళ్లి ప్రార్థన చేసుకుందామనుకున్నారు. చేజర్ల మండలం ఆదురుపల్లికి వెళ్లారు. అక్కడ చర్చిలో తమ సమస్యను పాస్టర్‌కు చెప్పారు. తమ ఆర్థిక పరిస్థితి వివరించారు. అందరూ చెప్పే యథాలాపమైన మాటే అక్కడి పాస్టర్ కూడా చెప్పాడు. ‘దేవుణ్ని నమ్ముకోండి. ఆయనకు ప్రార్థన చేయండి. తగ్గకపోతే అప్పుడు ఆస్పత్రికి తీసుకెళ్లండి’ అని. సరే, చేతిలో డబ్బు లేని సమయంలో ఇదొక దారి దొరికిందని అనుకున్నారు. చర్చి ప్రార్థనలకు మహా మహా రోగాలే తగ్గినట్లు టీవీల్లో చూపిస్తారు కదా, బ్రెయిన్ ట్యూమర్ తగ్గదా అనుకున్నారు.
అలా రోజూ వచ్చి చర్చిలో ప్రార్థనలు చేశారు. వారం రోజుల తరువాత భవ్య కొంత కోలుకుంది. హుషారుగా కనిపించింది. ‘దేవుడి మహిమ’ అనుకున్నారు తప్ప డాక్టర్లు ఇచ్చిన మందుల ప్రభావం అని తెలుసుకోలేదు. ఆ పాపను చర్చిలోనే ఉంచేశారు. తనతో ఒకరోజు అన్నదానం కూడా చేయించారు. 40 రోజుల తరువాత భవ్యశ్రీ ఆరోగ్య పరిస్థితి విషమించింది. మొన్న సోమవారం రాత్రి చనిపోయింది.
పాస్టర్ మాట విని, పాపకు సరైన చికిత్స అందించలేదని బంధువులు మండిపడ్డారు. ఆదూరుపల్లిలోని చర్చి ముందు ఆందోళన చేశారు. అయితే భవ్య తల్లిదండ్రులు మాత్రం ఆ మాటను కాదన్నారు. తమను ఎవరూ మభ్యపెట్టలేదని, పేదరికం వల్ల సరైన చికిత్స చేయించుకోలేక పోయామని తెలిపారు. విషయం అక్కడితో సద్దుమణిగింది.
తప్పు ఎవరిది? ఆ అమ్మానాన్నలదా? వాళ్ల పేదరికానిదా? వాళ్లను హెచ్చరించని చుట్టుపక్కలవారిదా? వారి అజ్ఞానానిదా? మతానిదా? మతబోధకులదా? విశ్వాసానిదా? మహిమ నూనెలు రాస్తే క్యాన్సర్ తగ్గుతుందని, ప్రార్థన చేస్తే కాళ్లు వస్తాయని నమ్మించే పాస్టర్లదా? వాటి మీద వందల, వేల ట్రోల్స్ చేసినా కూడా ఇంకా వాటినే నమ్ముతున్న జనానిదా? రోగం రాగానే డాక్టర్ వద్దకు పరిగెత్తి, అక్కడ టెస్టులు జరుగుతుండగా, మనసులో మొక్కులు మొక్కుకునే అమాయకులదా? దేవుడే ఉంటే అసలీ రోగాలే ఇవ్వడు. రోగం ఇచ్చినవాడు చికిత్స చేయించుకునేందుకు డబ్బులు కూడా ఇవ్వాలిగా? ఎందుకివ్వలేదు? 8 ఏళ్ల పాప మరణిస్తూ ఉంటే ఎందుకు కాపాడలేదు?
ఏ మతమైనా చివరకు తేలేది ఇక్కడే! అజ్ఞాన అంధకారంలోనే. ఆలస్యం ఎందుకు? పదండి. ఆసుపత్రులన్నీ మూసేసి, వెళ్లి ప్రార్థనాలయాల మెట్ల మీద కూర్చుందాం. రోగాలు తగ్గుతాయేమో చూద్దాం.