EVM: ఈవీఎంల మాయ ఉన్నట్టా..?  లేన్నట్టా..?  

EVM: ఈవీఎంల మాయ ఉన్నట్టా..?  లేన్నట్టా..?  

EVMS:

‘ప్రజాస్వామ్యయుతంగా ఉండటమే కాకుండా ఉన్నట్టు కనబడాలి’ అనేది పాలన మౌలిక సూత్రం! అప్పుడే ప్రజలకు విశ్వాసం. ఆ విశ్వాసంతోనే ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రజలు స్వేచ్చగా- స్వతంత్య్రంగా పాల్గొంటారు. మనది ప్రాతినిధ్య ప్రజాస్వామ్యమే కాక భాగస్వామ్య ప్రజాస్వామ్యం. తమ పాలకుల్ని స్వేచ్ఛగాస్వతంత్రంగా ఎంచుకునే ఎన్నికల ప్రక్రియ నుంచి సంపూర్ణ పాలన వరకు అన్ని దశల్లో, స్థాయిల్లో ప్రజలు స్వచ్చందంగా, విశ్వాసంతో పాల్గంటారు. అలా పాల్గనేలా చూడాల్సిన బాధ్యత పాలకులది. దేశం పలుదెసల నుంచి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రా (ఈవీఎం)ల పై భయాసందేహాలు తలెత్తుతున్నాయి. ఈవీఎంలను దుర్వినియోగపరుస్తున్నారనే అభియోగాల్లో నిజం ఎంతో ఇప్పటివరకు దృవపడలేదు. సందేహాలకు అతీతంగా ఈ ప్రక్రియను నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన, ముఖ్యంగా భారత ఎన్నికల సంఘంపైన ఉంది. ఆధారాలే లేకుండా అభియోగాలు మోపడమెంత తప్పో, సందేహాస్పదమైన అంశాల్లో స్పష్టత ఇవ్వని నిరంకుశ ధోరణి, పారదర్శకత లోపించడమూ అంతే తప్పు.

వెలుగు లేకపోవడం చీకటి. దాన్ని తిరగేస్తే వెలుగు నిర్వచనం రాదు. అంటే, చీకటి లేకపోవడమో, తొలగిపోవడమో మాత్రమే వెలుగు అంటే సరిపోదు. దానికి అదనపు, స్వీయ స్వభావం- ప్రభావం ఉంటాయి. చీకటి కన్నా వెలుగుకు మరింత విలక్షణత, విస్తృతి, స్వీయ లక్షణం వంటి ప్రత్యేకతలున్నాయి. నిరూపించలేనంత మాత్రాన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రా (ఈవీఎం) ల వినియోగ ప్రక్రియలో తప్పులే లేవనో, తప్పిదాలకు ఆస్కారమే లేదనో దృవీకరించినట్టు కాదు. ముందు ఫిర్యాదుల్ని స్వీకరించి, పరిశీలించి, నిజానిజాల్ని నిగ్గుతేల్చాలి. దృవీకరణ వెంటనే జరుగాలి. రుజువులతో దృవపడితే తప్ప, ఈవీఎం లను పాలకపక్షాలు తమకు అనుకూలంగా దుర్వినియోగపరుస్తున్నాయనటంలో అర్థం లేదు. కేవలం ఫలితాలను బట్టి, అవి తమకు ప్రతికూలంగా ఉన్నపుడు మాత్రమే ఈవీఎంల దుర్వినియోగం జరిగిందనే గుడ్డి ఆరోపణ అశాస్త్రీయం, ఫక్తు రాజకీయమే!

‘సర్వేలన్నీ ఒకటి చెబితే కడకు ఫలితం అందుకు భిన్నంగా వచ్చింది, కనుక ఈవీఎం లలో ఏదో మాయజరిగింది’ అనటం కూడా నిర్హేతుక వాదనే! అభియోగాలు మోపే వారు అందుకు హేతువును, తమ సందేహాలకు కారణాలను, తగు సాక్ష్యాధారాలను సంబంధిత వ్యవస్థల దృష్టికి తీసుకురావాలి. వాటిని సధ్యోచనతో స్వీకరించి, బాధ్యులైన వ్యక్తులు, సంస్థలు లోతుగా పరిశీలన జరపాలి. అభియోగాలకు ఆధారాలున్నాయో లేదో? అవి తప్పో, కాదో తేల్చాలి. ఈ మొత్తం ప్రక్రియలో పారదర్శకత, జవాబుదారుతనం ముఖ్యం. అది జరగటం లేదు.

పార్టీలే కాదు….

అయిందానికి, కానిదానికి నిత్యం పరస్పరం విమర్శించుకునే రాజకీయ పార్టీలు ఈవీఎంల విషయంలో అనుసరించే ద్వంద్వ వైఖరి వారి ఆరోపణలకు పస లేకుండా చేస్తోంది. దాంతో విషయం- వివాదం ప్రాధాన్యత లేకుండా పోతోంది. తాము గెలిచినపుడు కిమ్మనకుండా, అదంతా తమ ప్రయోజకత్వమే అనడం, ఓడినపుడు మాత్రం ప్రత్యర్థులు రాష్ట్రంలోనో, కేంద్రంలోనో పాలకపక్షంగా ఉండి ఈవీఎం లను దుర్వినియోగపరిచారనడం, ప్రజాభిప్రాయాన్ని తారుమారు చేశారనడం ఎలా సమంజసం? అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతోంది. కానీ, కొన్ని రాజకీయేతర- తటస్థ సంఘాలు, సంస్థలు కూడా అభ్యంతరాలు లేవనెత్తాయి. పోలింగ్ శాతాల సమాచారంలో వ్యత్యాసాలను ఎత్తిచూపుతూనో, బహిరంగ ప్రజాభిప్రాయానికి విరుద్ద ఫలితాలనో… ఈవీఎంల దుర్వినియోగానికి గల ఆస్కారాన్ని అవి ఎన్నికల సంఘం దృష్టికి తెచ్చినా తగిన స్పందన లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. వోట్ ఫర్ డెమాక్రసీ (వీఎఫ్డీ), అసోసియేషన్ ఫర్ డెమాక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), సిటిజన్ కమిషన్ ఆన్ ఎలక్షన్ (సీసీఈ) వంటి పౌరసంఘాలు నిర్దిష్టంగా ఫిర్యాదులు చేసినా వాటిని పరిగణనలోకి తీసుకుంటున్న దాఖలాలు లేవు.

ఎన్నికల సంఘం తనకు తాను ‘భేష్’ అనుకుంటూ, సమర్థవంతంగా ఎన్నికల ప్రక్రియ నిర్వహించినట్టు ‘స్వీయ కితాబు’లిచ్చుకుంటోందనే విమర్శలున్నాయి. రాజకీయ పక్షాల నుంచే కాక ప్రజాసంఘాలు, సంస్థల నుంచి నిర్దిష్ట ఆరోపణలు చేసినపుడు కూడా ‘నిరాధారం’ ‘దురుద్దేశపూర్వకం’ అంటూ, కనీస విచారణైనా జరుపకుండానే ఎన్నికల సంఘం కొట్టిపారేస్తోందన్నది వారిపై ప్రధాన అభియోగం!

ఓటు వ్యత్యాసాలపైనే సందేహాలు..

సాయంత్రం వరకు పోలింగ్ సరళి ఒక విధంగా ఉండి, ముగింపు సమయాల్లో అనూహ్యాఅసాధారణ ఓటింగ్ శాతాలు నమోదు కావడం, అలా ఎన్నికల అధికారి రాత్రి ఇచ్చిన గణాంకాలకు భిన్నంగా ఓట్ల లెక్కింపు ముందరి ‘లెక్క’తేలడం పట్ల సందేహాలున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో ఈ ఓట్ల వ్యత్యాసం భారీగా ఉంటోంది. ఇది సార్వత్రిక ఎన్నికల్లోనే కాకుండా హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీల ఎన్నికల సందర్భంగానూ వెల్లడయిందనేది విమర్శ. గణాంకాలు వారి వాదనకు బలం చేకూర్చేవిగానే ఉన్నాయి. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఇలా…ఆఖరు నిమిషపు ఓట్ల వ్యత్యాసం పది శాతానికి పైగా ఉన్న, పది జిల్లాల్లోని 44 అసెంబ్లీ స్థానాల్లో 37 ఎన్డీయే పక్షాలు గెలిచాయి. కానీ, వ్యత్యాసం 10 శాతం కన్నా తక్కువగా ఉన్న 12 జిల్లాల్లోని 46 సీట్లలో ఎన్డీయే కూటమి 11 సీట్లు మాత్రమే గెలువగలిగింది. ఇటువంటి పరిస్థితి సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తర్ప్రదేశ్ లోనూ ప్రతిబింబించిందని విమర్శకులంటారు. ఆఖరు నిమిషపు పోలింగ్ శాతపు పెరుగుదల వరుసగా ఐదు విడతల్లో  0.21%, 0.34%, 0.23%, 0.01%, 0.25% నామమాత్రంగానే ఉండటంతో ఎన్డీయే కూటమికి రాజకీయంగా ఇదేమీ లాభించలేదనేది విశ్లేషణ! అందుకే, అక్కడ లోక్సభ స్థానాల సంఖ్య 62 నుంచి ఈ సారి 36కి పడిపోయింది. జార్ఘండ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తొలివిడతలో ‘ఆఖరు నిమిషపు ఓటింగ్ శాతం’ పెరుగుదల 1.79% నమోదుకాగా బీజేపీ 43లో అసెంబ్లీ స్థానాలు 17 నెగ్గింది. కానీ, రెండో విడత పోలింగ్ సందర్భంగా సదరు ఓటింగ్ శాతం పెరుగుదల 0.86%కి పరిమితం అయినందునేమో, 38లో ఏడు సీట్లు మాత్రమే గెలువగలిగింది. ఇదంతా ఈవీఎం ల మాయాజాలం కాదా? అని విమర్శకులంటారు.

కళ్లకు కట్టినట్టు గణాంకాలు..

మహారాష్ట్రలోని అకోట్ అసెంబ్లీ నియోజకవర్గంలో రాష్ట్ర ఎన్నికల ముఖ్యాధికారిచ్చిన సమాచారం ప్రకారం, పోలింగ్ ప్రక్రియ అన్ని విధాలుగా ముగిసేటప్పటికి ఈవీఎం ద్వారా 2,12,690 ఓట్లు పోలయ్యాయి. లెక్కింపు రోజున ఈవీఎం నుంచి రాబట్టిన ఓట్ల సంఖ్య 2,36,234. అంటే, వ్యత్యాసం 23.544 ఓట్లు. గెలిచిన బీజేపీ అభ్యర్థికి దక్కిన ఆధిక్యత 18,851 ఓట్లు! ఇలా రాష్ట్రవ్యాప్తంగా గమనిస్తే, పోలింగ్ రోజు రాత్రి పొద్దుపోయిన తర్వాత ఎన్నికల సంఘం వారి ‘యాప్’ ద్వారా వెల్లడైన గణాంకాల కన్నా ఓట్ల లెక్కింపు రోజున రమారమి పెరిగిన సంఖ్య ఉన్న నియోజకవర్గాలు తక్కువలో తక్కువ 95 ఉన్నాయనేది వారి వాదన. ఒకే విడత పోలింగ్ జరిగిన నవంబరు 20, సాయంత్రం గం. 6.15 నిమిషాలకొకసారి, రాత్రి గం. 11.45 ని.ల కొకసారి ఎన్నికల సంఘం అధికారికంగా ఓటింగ్ శాతాలను వెల్లడించింది. సాయంత్రం సమాచారం వెల్లడించే సమయానికి ఇంకా కొన్ని పోలింగ్ స్టేషన్లలో గడువులోపల ‘క్యూ’లో చేరిన వారందరూ ఓటువేసే వరకు, ఎంత సమయమైనా ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. ప్రక్రియ పూర్తయిన తర్వాత తుది గణాంకాలుగా రాత్రి ప్రకటించిన సమాచారంలో పేర్కొన్నారు. 288 నియోజకవర్గాల్లో సాయంత్రానికి 58.22% (5,64,88,024 ఓట్లు) పోలయినట్టు తెలిపిన అధికారులు రాత్రి 65.02% (6,30,85,732 ఓట్లు) గా నమోదైనట్టు చెప్పారు. అంటే, వ్యత్యాసం 65,97,708 ఓట్లు. నవంబరు 22న ఓట్ల లెక్కింపునకుకొన్ని గంటలు ముందు, ‘యాప్’ వెల్లడించిన సమాచారం ప్రకారం, రాష్ట్రమంతటా నమోదైన ఓట్ల సంఖ్య 6,40,85,095. అప్పుడు పోలింగ్ శాతం 66.05%కి చేరింది, ఏమిటీ వ్యత్యాసాలు? అన్న ప్రశ్న ఈవీఎం ల పై శంకకు తావిస్తోంది. 288 నియోజకవర్గాల్లోని 1,00,186 పోలింగ్ బూత్లలో సగటున 76 ఓట్ల చొప్పున 76 లక్షల ఓటర్లు, ఎలా గడువు తర్వాత ’క్యూ’ల్లో నిలుచొని ఓటు వేసి ఉంటారనే ప్రశ్న తలెత్తడం సహజం! సందేహాలను నివృత్తి చేసేవిధంగా ఎన్నికల సంఘం సమాధానం ఇవ్వాలనే డిమాండ్ వస్తోంది.

చైతన్యమే దారిదీపం..

మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లా మాల్శిరాస్ తాలూకా మార్కడ్వాడి అనే చిన్న గ్రామలో జనం తిరగబడ్డారు. ఈవీఎం లలో అవకతవకలు జరిగాయని, ఓట్ల లెక్కింపు తర్వాత ఆరోపిస్తూ గ్రామస్తులు, బ్యాలెట్ ద్వారా ‘మళ్లీ పోలింగ్’ జరపాలని వారికి వారే నిర్ణయించారు. కానీ, పోలీస్ ఆంక్షలు విధించి సదరు రీ- పోల్ను అధికారులు జరుగనీయలేదు. 13 వేల ఓట్ల ఆధిక్యతతో ఎన్సీపీ (శరద్పవార్) అభ్యర్థి ఉత్తమ్రావ్ జన్కర్ ఎమ్మెల్యేగా ఎన్నికయి కూడా.. ఆ గ్రామంలో ఈవీఎం అవకతవకలతో నష్టం జరిగిందని ఆరోపించారు. కులాల వారిగా, విధేయత పరంగా చూసినా… గ్రామంలో తనకు ఆధిక్యత ఉండగా, తన ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రామ్సత్పతే (బీజేపీ)కి 160 ఓట్లు ఎక్కువ రావటం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. రీ- పోల్ నిర్వహణకు ప్రేరణ కల్పించారు. తమ ఫిర్యాదుకు ఎన్నికల సంఘం స్పందించనందునే రీ`పోల్ ఆలోచనని గ్రామ ముఖ్యులు పేర్కొన్నారు. రాజకీయ పార్టీల కార్యకర్తలు పోలింగ్ ఏజెంట్లుగా పోలింగ్ ముగిసే సమయంలో, కౌంటింగ్ ఏజెంట్లుగా ఓట్ల లెక్కింపు మొదలెట్టేప్పుడు ఆయా కేంద్రాల్లో ఉంటారు. వారీ లెక్కలు సరి చూసుకుంటే ఏ ఇబ్బందీ ఉండదనే వాదనొకటుంది. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి, శివసేన నేత ఏక్నాథ్ షిండే అన్నట్టు, ఓడినపుడే పార్టీలకు ఈవీఎంల దుర్వినియోగం గుర్తురావడం మరీ విడ్డూరం! 2024 లోక్సభ ఎన్నికల్లో, మహారాష్ట్రలో ఇటు మహాయుతి, అటు మహావికాస్ అఘాడి ఓటువాటా శాతాల్లో తేడా ఒక శాతం కూడా లేదు. కానీ మహాయుతికి 17 సీట్లు వస్తే, ఎమ్వీఏ కు 30 సీట్లు వచ్చాయి. మరి, అప్పుడు రాలేదా? ఈవీఎం పై అనుమానం? అప్పుడు మాత్రం అవి బాగానే పనిజేశాయా? అని వ్యగ్యంగా ప్రశ్నించారు.

ఈవీఎం లలో మాయ ఉందంటే… దానికి సాక్ష్యాలు, ఆధారాలు కావాలి. అనుమానాలు, గణాంకాల్లో సందేహాలున్నాయంటే దానికి బాధ్యుల నుంచి సమాధానాలు రావాలి. ప్రజలకు కావాల్సింది… పారదర్శక పాలనా వ్యవస్థలు, పాలకుల నుంచి జవాబుదారితనం, దట్సాల్!