SuryaPeta: తెలంగాణ వ్యాప్తంగా గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల్లో ఉమ్మడి డైట్ అమలును సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు,కార్పొరేషన్ చైర్మన్లు, కాంగ్రెస్ నేతలు అట్టహాసంగా ప్రారంభించారు. చివ్వెంల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాలలో ఉమ్మడి డైట్ చార్జీల పెంపు కార్యక్రమాన్ని రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్, TPCC ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం సంక్షేమ గురుకులాలు, వసతి గృహాల విద్యార్థులు, వారి తల్లి దండ్రులతో కలిసి భోజనం చేశారు. హాస్టల్లో తరగతి గదుల నిర్వహణ, తాగునీటి సౌకర్యం, విద్యార్థులకు అందుతున్న భోజన నాణ్యత గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.పాఠశాలలోని సదుపాయాలు,మరుగుదొడ్ల నిర్వహణ, విద్యార్థులు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులకు, ఉపాధ్యాయులకు పటేల్ రమేష్ రెడ్డి వివరించారు.
అంతకముందు జరిగిన కార్యక్రమంలో పటేల్ రమేష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. చివ్వెంల తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గురుకులాల పాఠశాలను దత్తత తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు . సాంఘిక సంక్షేమ పాఠశాలల ప్రమాణాలను పెంచేందుకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందన్నారు. ఈ స్కూళ్లల్లో చదువుతున్న వారు అనాదలు కాదని. వాళ్లు రాష్ట్ర సంపద అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలిపారు.గత 8 ఏళ్లుగా డైట్ చార్జీలు.. 16 ఏండ్లుగా కాస్మొటిక్ చార్జీలను పెంపులేదని.. ప్రజా ప్రభుత్వం వచ్చాక ఏడాదిలోనే అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని 40 శాతం మేర డైట్ చార్జీలు ..212 శాతం కాస్మొటిక్ చార్జీలను పెంచడం జరిగిందని రమేష్ రెడ్డి వెల్లడించారు.
చివ్వెంల గురుకుల పాఠశాలలో సౌకర్యాల బాధ్యత తాను తీసుకుంటునట్లు టూరిజం కార్పొరేషన్ చైర్మన్ స్పష్టం చేశారు. అలాగే అదనపు తరగతి గదులు లేక ఇబ్బంది అవుతుందని అధికారులు తన దృష్టికి తీసుకువచ్చారని.. ఈ విషయంపై సీఎంతో చర్చించి నిధులు మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎటువంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులతో పాటు మున్సిపల్ చైర్మన్ అన్నపూర్ణ , DFO శాంత రామ్ , DEO అశోక్ ,వివిధ ఉన్నతాధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.