INCTELANGANA :
మాజీ సీఎం, ప్రధాన ప్రతిపక్ష నాయకులు, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ కు టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ బహిరంగ లేఖ
===================================================================
ఎంతో రాజకీయ అనుభవమున్న మీకు రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు సంబంధించి కొన్ని అంశాలను మీ దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా మీ భారత్ రాష్ట్ర సమితి నేతలు మా ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలపై స్పష్టత ఇచ్చే దిశగా నేను ఈ లేఖ రాస్తున్నాను. ఆరు దశాబ్దాల పోరాట చరిత్ర గలిగిన తెలంగాణలో ఉద్యమ పార్టీగా గొప్పలు చెప్పుకునే మీ బీఆర్ఎస్ పార్టీ పదేళ్ల పాలనలో తెలంగాణ వెనుకబాటుకు గురైంది. సెంటిమెంట్ పేరుతో రెండు దఫాలుగా అధికారం చేపట్టిన మీరు గడీల పాలన చే సి ప్రజలకు కన్నీరు మిగిల్చారు. రాష్ట్రానికే గుండెకాయలాంటి సచివాలయానికి రాకుండా ఫాంహౌస్కే పరిమితమై పాలన సాగించడంతో మీ హయాంలో అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోయింది. మీ పెత్తందారు సర్కార్తో విసిగిపోయిన ప్రజలు మీ పాలనకు చరమగీతం పాడినా మీలో కానీ, మీ కుటుంబ సభ్యుల్లో కానీ, మీ పార్టీ నేతల్లో కానీ ఎలాంటి మార్పు రాలేదు. తెలంగాణ ఏర్పాటుకు పోరాడిరది సబ్బండ వర్గాలైతే, ఇచ్చింది సోనియా గాంధీ అని విశ్వసించిన ప్రజలు మాకు అధికారం కట్టబెడితే ఓర్వలేక మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ పార్టీ నేతలు అసత్యాలను ప్రచారం చేస్తున్నారు ఇదే పంథాలో సాగితే ప్రజలు మీకు తగిన సమయంలో తగిన బుద్ధి చెప్పడం ఖాయం.
నూతన తెలంగాణ రాష్ట్రంలో భావోద్వేగాలతో అధికారం చేపట్టిన మీరు మొదటి రోజు నుండే ఇచ్చిన మాటలు తప్పుతూ అడుగడునా వంచనకు పాల్పడ్డారు. తెలంగాణలో మొదటి ముఖ్యమంత్రిగా దళితుడిని చేస్తానని చెప్పిన మీరు, మీ అనుచరులను ఉసిగొల్పి తిమ్మిని బమ్మిని చేసి మీరే సీఎంగా అందలమెక్కారు. నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో ఉద్యమించిన మీరు పీఠమెక్కాక మాయమాటలతో పాలించారు. తెలంగాణ ఉద్యమంలో కవులు, కళాకారులు, మేధావులు, విద్యావేత్తలు, విద్యార్థులు, కార్మికులు, ఉద్యోగులు ఇలా సబ్బండవర్ణాలు ప్రాణాలకు తెగించి పోరాడగా, అధికారంలోకి రాగానే మీరు తెలంగాణలో కుటుంబ పాలన సాగిస్తూ రాష్ట్రాన్ని మీ కుటుంబ సభ్యుల కబంధ హస్తాల్లో బంధించి, మీరు చేసిన ఆరాచకాన్ని ప్రజలు ఎన్నటికీ మరవలేరు.
తెలంగాణ వస్తే మన రాష్ట్రంలోని ఉద్యోగాలు మనకే వస్తాయనే ఆశతో యువత పెద్దఎత్తున ఉద్యమించగా ‘దీక్ష’ పేరుతో మీ కుటుంబం ఆడిన నాటకాలు యువత బలిదానాలకు కారణమయ్యాయి. మీ అల్లుడు హరీశ్రావు పెట్రోల్ డబ్బాతో, అగ్గిపులతో డ్రామాలు చేసి అమాయక యువతను బలిదానాలవైపు ప్రోత్సహించారనేది వాస్తవం కాదా? ఉద్యోగాలపై గంపెడాశలు పెట్టుకున్న యువతకు ఉద్యమ సమయంలో ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పిన మీరు, అధికారంలోకి వచ్చాక మీ కుటుంబంలోని సభ్యులకే రాజకీయ ఉపాధి కల్పించుకున్నారు. మీ హయాంలో ఇచ్చిన అరకొర ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లను కూడా పూర్తి చేయలేకపోయారు. నోటిఫికేషన్ ఇచ్చాక మీ అనుచరులతోనే కోర్టుల్లో కేసులు వేయించి ఉద్యోగాల భర్తీ చేపట్టలేదు. పదో తరగతి మొదలు గ్రూప్ -1 పరీక్షల వరకు అన్నింటా అవకతవకలు, గందరగోళమే. మీ పాలనకు భిన్నంగా అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే ఇచ్చిన మాట ప్రకారం జాబ్ క్యాలెండర్ విడుల చేసిన ఘనత కాంగ్రెస్దే.
మీ హయాంలో అవినీతిమయమైన టీజీపీఎస్సీపీ ప్రక్షాళన చేయడమే కాకుండా గ్రూప్ పరీక్షలను విజయవంతంగా నిర్వహించామని మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. ఒక్క ఏడాదిలోనే రాష్ట్రంలో దాదాపు 54 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి దేశంలోనే రికార్డు నెలకొల్పాం. మేము ఉద్యోగాలు ఇస్తుంటే, మీ పార్టీ వారు వాటిని అడ్డుకోవడానికి కుట్రలు పన్నారనేది బహిరంగ రహస్యం. కొన్ని సాంకేతిక కారణాలపై యువతను రెచ్చగొట్టి పరీక్షలను వాయిదా వేయడానికి మీ కుటుంబ సభ్యులు, మీ పార్టీ నేతలు శతవిధాలా ప్రయత్నించినా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ప్రతిపక్షాల కుట్రలను ఛేదించి పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది. ఇచ్చిన మాట ప్రకారం యువత ఉపాధికి ప్రాధాన్యతిచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై మీ పార్టీ నేతలు, కుటుంబ సభ్యులు నిరాధార ఆరోపణలు చేయడం సిగ్గుచేటు. ఉద్యమంలో మరో నినాదమైన ‘నీళ్లు’ అంశాన్ని కూడా మీ పాలనలో నీరుగార్చారు. మీరు అధికారంలోకి వచ్చే నాటికి పెండిరగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాల్సిన బదులు అవినీతే లక్ష్యంగా కొత్తగా కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టారు. ప్రాజెక్టు పనుల డిజైన్ను ఇంజినీర్లు చేపట్టాల్సి ఉండగా, తానే కాళేశ్వరం డిజైన్ రూపకర్తను అంటూ గర్వంగా చెప్పుకున్న మీరు ప్రాజెక్టు నాణ్యతా లోపంలో కూడా బాధ్యతవహించాల్సి ఉంటుంది.
మీ అవినీతి, అజ్ఞాన చర్యలతో ఇప్పుడు ప్రాజెక్టు మనుగడకే ప్రమాదం ఏర్పడిరది. కాళేశ్వరం ప్రాజెక్టు మీకు, మీ అనుచరులకు ఒక ఏటీఎంలా మారిందనేది అక్షరాల సత్యం. రాష్ట్రంలోని ప్రాజెక్టులను తానే స్వయంగా పర్యవేక్షిస్తూ, తానే అక్కడ కుర్చీ వేసుకొని కూర్చొని వాటిని పూర్తి చేయిస్తానని ఉద్యమ సమయంలో చెప్పిన మీరు ఎన్ని చోట్ల కూర్చున్నారు..? ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేశారు..? మీరు గొప్పగా చెప్పుకునే కాళేశ్వరం కింద మూడు బ్యారేజీలు పనిచేయకపోయినా తెలంగాణ రైతులు ఈ ఖరీఫ్ సీజన్లో 66.76 లక్షల ఎకరాల్లో 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఉత్పత్తి చేసేలా సాగునీరు అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది. ఈ ఉదాహరణలు చాలు సాగునీటి రంగానికి మీరిచ్చిన ప్రాధాన్యత, మేము ఇచ్చిన ప్రాధాన్యత. వాస్తవాలు ఇలా ఉంటే మీ పార్టీ నేతలు, మీ కుటుంబ సభ్యులు మాపై అవాస్తవాలతో బురదజల్లడం శోచనీయం.
తెలంగాణ నిధులను దోచుకున్నారని ఉద్యమ సమయంలో ప్రజలను రెచ్చగొట్టిన మీరు ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనే లేని విధంగా అవినీతికి పాల్పడ్డారు. ప్రాజెక్టులు, ఫ్లైఓవర్లు ఇలా అన్ని రంగాల్లో జరిగిన అవినీతిలో మీ కుటుంబ సభ్యలు, మీ అనుచరుల హస్తం ఉందనేది కాదనలేని సత్యం. ధరణీ పేరుతో మీ పార్టీ నేతలు పేదల భూములు కొల్లగొట్టి దోచుకున్న దాంట్లో తెరవెనుక ఎవరున్నారో జగమెరిగిన సత్యం. 2014 జూన్ 2న రాష్ట్రం ఏర్పడే నాటికి రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్తో తెలంగాణ ఉండగా, పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారం చేపట్టే నాటికి రాష్ట్రం రూ.7 లక్షల కోట్ల అప్పుతో ఉందనేది వాస్తవం కాదా..? మీరు చేసిన అప్పులతో ప్రస్తుతం ప్రతి నెల రూ.6500 కోట్ల అసలు, మిత్తీ చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడిరది. మీ పాలనలో ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం రాష్ట్ర భవిష్యత్ తరాలకు శాపంగా మారిందనే విషయాన్ని కాదంటారా?
కాంగ్రెస్ అధినేత రాహుల్గాంధీ నేతృత్వంలో 2022 మే నెలలో వరంగల్లో ప్రకటించిన ‘రైతు డిక్లరేషన్’ హామీలను మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తి చేసి మాది రైతు ప్రభుత్వం అని నిరూపించుకున్నాం. మీ హయాంలో రుణమాఫీ ప్రక్రియ ఎంత ప్రహసనంగా మారిందో రైతులు ఇప్పటికీ చెప్పుకుంటారు. అరొకరగా మాఫీ చేసి, లక్షలాది మంది రైతుల రుణమాఫీ ఎగ్గొట్టిన మీకు, మీ పార్టీ వారికి కాంగ్రెస్ను విమర్శించే నైతిక హక్కే లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల లోపు రుణాలను మాఫీ చేసింది. మా సంకల్పబలంతో రూ.21 వేల కోట్లు మాఫీ చేయడంతో, రాష్ట్రంలో 25 లక్షల మంది రైతులు రుణమాఫీ సహాయం పొందడాన్ని మేము గర్వంగా భావిస్తున్నాం. రైతు పక్షపాతి అయిన మా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ఓర్వలేని మీ పార్టీ నేతలు, మీ కుటంబ సభ్యులు విమర్శిస్తుంటే ఆ కుటిలత్వాన్ని అన్నదాతలు హర్షించలేకపోతున్నారని మీరు గమనిస్తే మంచిది.
మీ హయాంలో పంట బీమా లేకపోవడంతో రైతాంగం నష్టపోగా కాంగ్రెస్ ప్రభుత్వం 42 లక్షలకుపైగా రైతులకు బీమా కవరేజీ కోసం రూ.1,433.33 కోట్ల ప్రీమియం చెల్లించింది. అకాల వర్షాలతో నష్టపోయిన 94 వేల మందికి పైగా రైతులకు రూ.95.38 కోట్ల పంట నష్టాన్ని చెల్లించి కాంగ్రెస్ ప్రభుత్వం వారిని ఆదుకుంది. సన్నాలు పండిరచిన వారికి రూ.500 బోనస్ చెల్లించింది. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి సంక్రాంతికి రైతు భరోసా నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ విధంగా అన్ని రంగాల్లో రైతాంగానికి వెన్నుదన్నుగా నిలుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తే అన్నదాతలు హర్షించరనే వాస్తవాన్ని ఎంతో రాజకీయ అనుభవమున్న మీరు, మీ పార్టీ నేతలకు చెబితే మంచిది.
సంస్కృతి, సంప్రదాయాలు, అస్తిత్వం అంటూ హడావుడి చేసిన మీరు పీఠమెక్కగానే వీటికి తిలోదకాలిస్తూ తెలంగాణ అస్తిత్వం మీ కుటుంబ సభ్యుల చేతిలో బందీ అయ్యిందంటే….కాదని మీరు గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పగలరా..? మీరు పదేళ్లలో తెలంగాణ అస్తిత్వానికి అడుగడుగునా చేసిన అన్యాయాలను మేము సరిదిద్దుతుంటే ఓర్వలేక ఫాం హౌస్ నుండి మీరిస్తున్న దశ- దిశ మార్గదర్శకాలతో మీ పార్టీ నేతలు, మీ కుటంబ సభ్యులు అక్కసు కక్కుతున్నారు. మీరు అధికారంలోకి రాగానే అంతా కేసీఆర్మయం అన్నట్టు వ్యవహరించారు. తెలంగాణ అస్తిత్వాన్ని మీరు ఎంతగా కాలరాశారంటే మీ పార్టీ పేరులో ‘తెలంగాణ’ అనే మాట కూడా తొలగించబడింది. మీ దశాబ్ద పాలనలో తెలంగాణలో పేరులో అక్షరాలు, విగ్రహం ఆట, పాట, గేయం ఇలా అన్నింటా రాష్ట్ర అస్తిత్వానికి ప్రమాదం కలిగించారు.
అధికారంలో ఉన్న పదేళ్లు అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయని మీ పార్టీ కాంగ్రెస్ ఆ పని చేస్తే విమర్శించడం ఎంత వరకు సమంజసం? మీరు చేయని పనిని మేము చేస్తే ఆహ్వానించాల్సింది పోయి విగ్రహ రూపురేఖలపై మీ పార్టీ నేతలు, మీ కుటుంబ సభ్యులు వ్యాఖ్యానించడం మీ దిగజారుడుతనానికి నిదర్శనం. మీ పార్టీ కార్యాలయంలో రాచరికానికి దర్పణంగా కిరీటంతో, బతుకమ్మతో విగ్రహం ఉంటే, మేము ఏర్పాటు చేసిన విగ్రహంలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడుతూ సహజసిద్ధమైన మాతృమూర్తిలా ఉంది. తెలంగాణ తల్లి విగ్రహంలో ‘బతుకమ్మ’ లేదని విమర్శిస్తున్న మీ పార్టీ నేతలు పదేళ్లు ప్రజల బతుకులతో ఎలా ఆడుకున్నారో అందరికీ తెలిసిందే. తెలంగాణలో పదేళ్లు ‘బతుకమ్మ’ పండుగ, ‘తెలంగాణ జాగృతి’ పేరిట మీ గారాలబిడ్డ కవిత చేసిన హంగామా అందరికీ తెలిసిందే. సంప్రదాయాన్ని గౌరవిస్తూ మేము విగ్రహ ఆవిష్కరణకి మిమ్మల్ని కూడా సగౌరంగా ఆహ్వానిస్తే మీరు మర్యాదను నిలబెట్టుకోలేకపోయారు. గౌరవ మర్యాదలు నిలబెట్టుకోకపోవడం మీకు ఇది మొదటిసారి కాదు. రాష్ట్ర ఏర్పాటుకు పోరాడిన ఉద్యమకారులను అడుగడుగునా అవమానించిన మీ నుండి ఇంత కంటే ఎక్కువ ఆశించలేం. అహంకార ధోరణితో, వ్యక్తిగత కక్షతో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలపై వివక్ష చూపిస్తూ తెలంగాణ ఉద్యమకారులకు మీరు చేసిన అన్యాయాలను మేము సరిద్ధుతుంటే మాపై విమర్శలు చేయడం దురదృష్టకరం. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉర్రూతలూగించిన ‘‘జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం’’ గీతం రచయిత అందెశ్రీపై మీరు కక్షగట్టి అవమానించి, రాష్ట్రానికి పదేళ్లు అధికారిక గీతం లేకుండా చేసిన తీరును మర్చేపోయారా..?
మీరు చేసిన తప్పులను సరిదిద్దడంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని అధికారిక గీతంగా ప్రకటించి కవి అందెశ్రీని గౌరవించుకోవడాన్ని మేము గర్వంగా భావిస్తున్నాం. ఉద్యమంలో తన ఆట, పాట, గజ్జెలతో ఉత్సాహం నింపిన గద్దర్కు మీరు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా అవమానిస్తే, మేము నంది అవార్డులను గద్దర్ అవార్డులుగా మార్చి ఆయనను గౌరవించుకున్నాం. తెలంగాణ ఉద్యమంలో జేఏసీ కన్వీనర్గా ఉన్న కోదండర్రామ్ను ‘నేను తయారు చేసిన లక్ష మందిలో వాడొకడు’ అని మీరు అగౌరపరిస్తే, కాంగ్రెస్ ఆయనకు సరైన గుర్తింపు ఇచ్చింది. ఇలా మీరు చేసిన దౌర్భాగ్యపు పనులన్నింటినీ ఒక్కొక్కటి చక్కదిద్దుటుంటే ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన మీరు మాపే మీ కుటుంబ సభ్యులు, మీ పార్టీ నేతలను ఉసిగొల్పడం సమంజసమా..? చివరికి ఉద్యమ సమయంలో తెలంగాణ అంటే ‘టీజీ’ అనే సంకేత అక్షరాలను కూడా మీరు వదల్లేదు. మీ పార్టీ బీఆర్ఎస్కు దగ్గరగా ఉండేలా దాన్ని ‘టీఎస్’ అని మార్చడం మీ స్వార్థానికి నిదర్శనం. మేము తిరిగి ‘టీజీ’గా మారిస్తే గగ్గోలు పెట్టడం మీ పార్టీ అహంకారానికి తార్కాణం. ఉద్యమంలో పాల్గొన్న కార్మికులను కూడా మీరు అధికారంలోకి వచ్చాక చిన్నచూపు చూశారు. తెలంగాణ ఉద్యమానికే ఊపిరి పోసిన ఆర్టీసీ కార్మికులను మీరు గద్దె ఎక్కగానే మోసంచేశారు. సొంత రాష్ట్రంలో తమ న్యాయమైన డిమాండ్లను తీర్చాలని వారు కోరితే మీరు ‘నన్నే ప్రశ్నిస్తారా’ అనే అహంకారంతో వారిపై కక్షగట్టి సంస్థ మనుగడకే ప్రమాదం తెచ్చిన తీరును యావత్ తెలంగాణ ఎన్నటికీ మర్చేపోదు.
మహిళా సాధికరిత కోసం కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే ‘మహాలక్ష్మి’ పథకాన్ని అమలు చేసిందని మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించి వారికి ఆర్థికంగా బాసటంగా నిలిచింది. ఏటా 3 వేల 500 కోట్ల రూపాయల లబ్ధి జరుగుతుంది. అలాగే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామన్న హామీ నిలబెట్టుకున్నాం. రూ.500 గ్యాస్ అందించి మాట నిలుపుకున్నాం. రాష్ట్రంలో ఏ ఈరెండు పథకాల వల్ల 50 లక్షల కుటుంబాలకు లబ్ధి జరగుతున్న విషయం మీకు తెల్వదా. త్వరలో మిగతా హామీలను కూడా పూర్తి చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే బీఆర్ఎస్ నేతలు పనిగట్టుకొని విమర్శిస్తున్నారు.
అంతేకాకుండా పేదలందరికీ ఆరోగ్య పరిరక్షణకు ఆరోగ్య బీమాను రూ.10 లక్షలకు పెంచాం. ‘మహాలక్ష్మీ’ పథకంలో భాగంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చి మాది మహిళా పక్షపాత ప్రభుత్వమని నిరూపించుకున్నాం. అదే సమయంలో మరోవైపు మీరు, మీ కూతురు కవిత సారా స్కాంలో జైలుపాలు కావడాన్ని రాష్ట్రంలోని మహిళలంతా అసహ్యించుకుంటున్నా… మీరు ఏమీ చేయలేక మిన్నకుండిపోయారు. మహిళలంటే మీకు ఎప్పుడూ చిన్నచూపే! మొదటి తెలంగాణ మంత్రివర్గంలో ఒక్క మహిళా మంత్రి కూడా లేకుండా పాలించిన చరిత్ర మీది. ఇలాంటి మీకు మహిళల సాధాకబాధలు అర్థం అవుతాయనుకోవడం మా అత్యాశే.
కామెర్లు వచ్చినవారికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందన్నట్టు ఉంది మీ పుత్రరత్నం కేటీఆర్ తీరు. మూసీ పునరుజ్జీవనం, సుందరీకరణలో అవినీతి జరిగిందని ఆయన గగ్గోలు పెడుతున్నారు. ఈ ప్రాజెక్టు కింద డిజైన్లు, కన్సల్టెన్సీలకు రూ.150 (నూట యాభై కోట్లు) కోట్లు కేటాయించడం తప్ప ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదనే వాస్తవాన్ని మీరు గుర్తించాలి. అసలు మూసీ గురించి బీఆర్ఎస్ వారు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మూసీ సుందరీకరణ చేస్తానని గతంలో మీరు చెప్పిన మాట గుర్తుందా..? దీంతో పాటు హుస్సేన్ సాగర్లో నీటిని కొబ్బరినీళ్లుగా మారుస్తామని మీరు స్వయంగా చెప్పారు. ఇప్పుడు అక్కడ మీరు చెప్పినట్టు కొబ్బరి నీళ్లు తాగడానికి వస్తారా..? మీరు చెప్పినట్టు హైదరాబాద్ డల్లాస్గా, పాతబస్తీ ఇస్తాంబుల్గా మారాయా? పాతబస్తీలో మెట్రో రైలుపై మీరు దాటవేత వైఖరి ప్రదిర్శిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పనులను పట్టాలెక్కించేందుకు చర్యలు తీసుకుంది.
కాంగ్రెస్ను విమర్శించడమే పనిగా పెట్టుకునే ట్విట్టర్ కింగ్ కేటీఆర్ మరో అడుగు ముందుకేసి అమృత్ టెండర్లపై విమర్శలు చేశారు. మీ హయాంలో మీ కుమారుడు కేటీఆర్ అనుచర కంపెనీలకు టెండర్లు కట్టబెడితే కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని రద్దు చేసి, రూ.65 కోట్లు ఆదా చేయడంతో ఆయన మా ప్రభుత్వంపై విషం కక్కుతున్నారు. మీ కుటుంబ సభ్యులు కేటీఆర్, కవిత, హరీశ్రావులు డ్రామా ఆర్టిస్టుల్లా వ్యవహరిస్తూ అవినీతి, కుంభకోణాలపై మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించడంలా ఉంది. మీ పాలనలో చేపట్టిన ఏ ప్రాజెక్టులను చూసినా ఆయిన తలపెట్టిన ఏ కార్యక్రమాన్ని చూసినా పాముపుట్టలోంచి బయటపడ్డట్లు అవినీతి పాములు బయట కొస్తున్నాయి.
అధికారంలో ఉన్న పదేళ్లు పలు మీడియా సమావేశాలు నిర్వహించి కాకమ్మ కథలు చెప్పిన మీరు, ఇప్పుడు మౌనవ్రతం చేపట్టి ఫాం హౌస్కే ఎందుకు పరిమితమయ్యారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవమున్నట్టు చెప్పుకునే మీరు ఫాంహౌస్కే పరిమితం కాకుండా, ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వచ్చి రాష్ట్ర అభివృద్దికి మీ సలహాలు, సూచనలు ఇస్తే బాగుంటుంది. అంతేకానీ ఇంకా గడీల పాలననే తల్చుకుంటూ మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ పార్టీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజారంజక కార్యక్రమాలను విమర్శిస్తూ పోతే ప్రజలు హర్షించరని, తరిమి కొడుతారని ఇప్పటికైనా గమనించండి, గ్రహించండి. మీ పదేళ్ల కుటుంబ పాలనలో సబ్బండ వర్గాల ఆశలు వమ్ము కాగా, కాంగ్రెస్ చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలతో ప్రజలు ఆనందంగా ఉన్నారనే వాస్తవాన్ని తెలుసుకోవాలి.
గత సంవత్సరం డిసెంబర్ 7వ తేదీన ముఖ్యమంత్రి గా రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి గా భట్టి విక్రమార్క గారు, సీనియర్ మంత్రుల నాయకత్వంలో ఒక అద్భుత పాలన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఇప్పటికైనా అవాకులు చెవాకులు చేయడం మాని ప్రభుత్వానికి సహకరిస్తారని ఆశిస్తున్నాను.