Nancharaiah merugumala senior journalist:
‘తెలంగాణలో బీఆర్ఎస్ నిస్సందేహంగా ముందుంది, దాని పునాది చెక్కుచెదర లేదు..కాంగ్రెస్ పుంజుకుని కేసీఆర్ పార్టీని దాటిపోతోందనడానికి ఆధారాలే లేవు’..సెఫాలజిస్ట్ సంజయ్ కుమార్ మాటలు ఎప్పుడూ వాస్తవ పరిస్థితికే అద్దంపడతాయి!
‘‘తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలోని బీఆరెస్సే ఖాయంగా ముందంజలో ఉంది. కాంగ్రెస్ కోలుకుని ముందుకు పోవడం లేదు. రాష్ట్రంలో 2014 జూన్ నుంచీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కారణంగా బీఆరెస్ బలం చెక్కు చెదరలేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పార్టీకి విస్తృతమైన పునాది అలాగే నిలిచి ఉంది. తెలంగాణలో పోలింగ్‌కు నెల రోజుల మందు బీఆరెస్ ను జనాదరణలో కాంగ్రెస్ మించిపోయిందని చెప్పడానికి ఎలాంటి సంకేతాలు కనిపించడం లేదు. కాంగ్రెస్ తెలంగాణలో పుంజుకుంటుందనడానికి ఏ మాత్రం నమ్మదగ్గ ఆధారాలు లేవు. బీఆరెస్సే నిస్సందేహంగా అత్యధిక తెలంగాణ ప్రజల ఆదరాభిమానాలు పొందడంలో కాంగ్రెస్ కు అందనంత దూరంలో ముందు ఉంది. కాంగ్రెస్ ముందుకు దూకుతోందని నిరూపించడానికి కొన్ని సంస్థలు చేసిన సర్వేలకు సరైన పద్ధతీ పాడూ లేదు,’’ అని ఆదివారం రాత్రి ఇంగ్లిష్ న్యూజ్ చానల్ ‘ఇండియా టుడే’ టీవీలో ప్రముఖ ఎన్నికల విశ్లేషకుడు, ప్రసిద్ధ రాజకీయ, సామాజిక శాస్త్రాల అధ్యయన సంస్థ సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (సీఎస్‌డీఎస్) మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఈ చానల్ కన్సల్టింగ్ ఎడిటర్ రాజదీప్ సర్దేశాయ్ నిర్వహించిన చర్చలో పాల్గొన్న సంజయ్ మాటలు చాలా మంది తెలంగాణ ఆలోచనాపరులకు హేతుబద్ధంగా కనిపిస్తున్నాయి. గత రెండేళ్లలో జరిగిన ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్ తదితర ఉత్తరాది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సంజయ్ కుమార్ అంచనాలు నిజమయ్యాయి. సీఎస్‌డీఎస్ ఎన్నికలపై సర్వేలు నిర్వహించే ‘లోక్ నీతి’ కార్యక్రమానికి కోడైరెక్డర్. తెలంగాణ విషయంలో ఆయన జోస్యం తప్పక నిజమౌతుందనిపిస్తోంది, ‘కంటి వెలుగు’ వంటి అనేక వినూత్న పథకాలు 45 శాతానికి పైగా తెలంగాణ ఓటర్లను మూడోసారి కేసీఆర్ ను ముఖ్యమంత్రి చేయడానికి ప్రేరేపిస్తాయనే అంచనా నూరు శాతం నిజమయ్యేలా ఉన్నాయి. 2018 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కూడా టీఆరెస్ పార్టీకి 47 శాతం ఓట్లు, 88 సీట్లు దక్కాయి. దక్షిణాదిలో తోటి తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ జనం–జాతీయ పార్టీలకే చోటు లేకుండా చేశారు గత రెండు ఎన్నికల్లో. అలాగే దక్షిణాదిన అతి పెద్ద రాష్ట్రం తమిళనాడు ప్రజలు కూడా 1967 నుంచి జాతీయపక్షాలను ప్రాంతీయ పార్టీలకు తోక పార్టీలుగా మార్చేశారు. తమిళ అధికార పీఠం (చెన్నైలోని రాష్ట్ర సెక్రెటేరియట్) ఫోర్ట్ సెయింట్ జార్జ్ వైపు కాంగ్రెస్ పార్టీకి కనీసం చూసే అవకాశం లేకుండా చేశారు అతి ప్రాచీన భాష మాట్లాడే దాదాపు 8 కోట్ల 40 లక్షల ప్రజలు. తొమ్మిదిన్నరేళ్లుగా సొంత దారిలో పయనిస్తున్నారు తెలంగాణ జనం. ఇక వారు కూడా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మార్గంలో ముందుకు సాగుతూ– కనుమరుగవడానికి సిద్ధమౌతున్న భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి కొత్త సచివాలయం వైపు కన్నేసే అవకాశం ఇవ్వరనేదే మెజారిటీ అభిప్రాయమో, కాదో– నెలా నాలుగు రోజుల్లో తేలిపోతుంది. రెండు రాష్ట్రాలుగా విడిపోయినా అన్నదమ్ముల్లా బతుకుతున్న రెండు ప్రాంతాల తెలుగు జనం కూడా ఒకే తీరున కాంగ్రెస్ పార్టీకి ‘అరేబియా సముద్రం వైపు పొమ్మని చెబుతారనే’ ఆశించవచ్చు.