హైదరాబాద్:
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉదయం పూట అల్పాహారం అందించే కార్యక్రమం సానుకూల స్పందన పొందుతున్నట్లు థర్డ్ విజన్ రీసెర్చ్ అండ్ సర్వీసెస్ సర్వే వెల్లడించింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని 60 ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించిన అధ్యయనంలో విద్యార్థుల చేరిక, హాజరుకు సంబంధించిన ఆసక్తికర అంశాలు నమోదయ్యాయి. సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా హరికృష్ణ మూమెంట్ (హెచ్ఎం) ఫౌండేషన్ అమలు చేస్తున్న అల్పాహార కార్యక్రమంపై విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల అభిప్రాయాలను సర్వే సేకరించింది.
పెరిగిన విద్యార్థుల చేరిక
సర్వే వివరాల ప్రకారం గత విద్యా సంవత్సరంతో పోలిస్తే విద్యార్థుల చేరికలో 13 శాతం పెరుగుదల నమోదైంది. కొత్తగా 1,525 మంది విద్యార్థులు పాఠశాలల్లో చేరగా.. వీరిలో 882 మంది బాలురు, 643 మంది బాలికలు ఉన్నారు. విద్యార్థుల హాజరు 20 నుంచి 22 శాతం వరకు పెరిగినట్లు నివేదిక పేర్కొంది.
అంతేకాకుండా, తమ పిల్లలు క్రమం తప్పకుండా పాఠశాలలకు వెళ్తున్నారని 92.8 శాతం మంది తల్లిదండ్రులు తెలిపినట్లు సర్వే వెల్లడించింది. అల్పాహారం స్వీకరిస్తున్న విద్యార్థుల శాతం 99.9గా నమోదైనట్లు నివేదిక వివరాలు సూచిస్తున్నాయి. అలాగే 99.7 శాతం మంది తల్లిదండ్రులకు పాఠశాలలో అల్పాహారం,పాలు అందిస్తున్న విషయం తెలుసని నివేదిక పేర్కొంది.
బోండా, దోశలకు పిల్లల ప్రాధాన్యం
అల్పాహార మెనూలో పిల్లలకు నచ్చే పదార్థాలకు చోటు కల్పించడం విశేషం. సర్వేలో బోండా–చట్నీకి 98.1 శాతం, దోశ–చట్నీకి 95.3 శాతం, మిల్లెట్ ఇడ్లీ–సాంబార్కు 93.6 శాతం మంది విద్యార్థులు ప్రాధాన్యమిచ్చినట్లు వెల్లడైంది.
వారంలోని ఆరు రోజులకు ఆరు రకాల అల్పాహారాలను అందించడంతోపాటు పాలు, రాగిజావ పంపిణీకి కూడా ప్రణాళిక రూపొందించారు. పిల్లలకు రుచికరమైన ఆహారంతోపాటు తగిన పోషక విలువలు అందేలా చూడటం ఈ కార్యక్రమంలో కీలకం.
ప్రభుత్వ విద్యకు అదనపు బలం
అల్పాహార పథకం విద్యార్థుల హాజరును ప్రోత్సహించడంతోపాటు పేద కుటుంబాలకు ఆర్థికంగా కొంత ఊరటనిచ్చే అవకాశం ఉంది. అయితే, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపడాలంటే నాణ్యమైన బోధన, మౌలిక సదుపాయాలు, విద్యార్థుల అభ్యసన సామర్థ్యంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలి.
మొత్తంగా.. నాణ్యమైన విద్య లక్ష్యంగా అల్పాహార పథకాన్ని మరింత సమర్థంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. కొడంగల్ సర్వేలో నమోదైన సానుకూల గణాంకాలను రాష్ట్రవ్యాప్తంగా విద్యాభివృద్ధికి ఉపయోగపడేలా నిరంతర పర్యవేక్షణ, పారదర్శకతతో ముందుకు సాగడం కీలకం.
