Nancharaiah merugumala senior journalist:
‘ఈనాడు ఉద్యోగం ఉద్యోగం కాదు. ఈనాడు భాష భాషే కాదు’ అనే అయ్యలసోమయాజుల, అప్పాజోశ్యుల శర్మలను ఏంచేస్తే వారి బుర్రలు విచ్చుకుంటాయి?
‘‘ ఈనాడు ఉద్యోగం ఉద్యోగం కాదు. ఈనాడు భాష అసలు భాషే కాదు. ఈనాడు గుమాస్తాలను తయారు చేసే కర్మాగారం. నేనూ ఆ గుమాస్తాల్లో ఒకడిని,’’ అంటూ సీనియర్ అవిశ్రాంత జర్నలిస్టు ఏఎన్ జగన్నాథ శర్మ గారు మొన్నీ మధ్య నా ‘ఉదయం’ మిత్రుడు ఎగుమామిడి అయోధ్యా రెడ్డి గారి కథల సంపుటిని హైదరాబాద్ నగరంలో ఆవిష్కరిస్తూ మాట్లాడారు. పాత్రికేయ మిత్రుడు కాసుల ప్రతాప్ రెడ్డి గారు తన యూట్యూబ్ చానల్ ‘ సహచర ’ కోసం రూపొందించిన ఈ పుస్తకావిష్కరణ వీడియోను ముక్కలుముక్కలుగా చేసి తన ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా అందరి ముందూ పెట్టారు. ‘ఈనాడు భాష అసలు భాషే కాదు’ అనే శీర్షిక (తమ్‌నెయిల్?)తో కనిపించిన ఈ వీడియోను నిన్న అనుకోకుండా చూశాను. మేగజీన్ ఎడిటర్ గా విస్తృతానుభవం, పేరుప్రఖ్యాతులున్న ఈ పార్వతీపురం జగన్నాథ శర్మ గారు ఇంతటి మాట పుసుక్కున పుస్తకావిష్కరణ సభలో ఇలా అనేశారేంటి? అని కాస్త కంగారుపడ్డా. ఎందుకంటే– ఈనాడు జర్నలిజం స్కూల్ (ఈజేఎస్) అనే సంస్థలో, అదే– అయ్యలసోమయాజుల శర్మగారి భాషలో గుమాస్తాల కర్మాగారంలో ‘కరంట్ అఫైర్స్’ పేరుతో సమకాలీన రాజకీయాలను పాఠాలుగా నాలుగేళ్లు (2003–2007) నేను చెప్పాను. దాంతో ఈ ‘గుమాస్తాల ఉత్పత్తి’లో నేనూ స్వల్పకాల భాగస్వామినేనా? అనే అనుమానం మొదట నాకు వచ్చింది. తర్వాత నింపాదిగా ఆలోచిస్తే శర్మగారు అలా మాట్లాడాల్సింది కాదనిపించింది. ఆయన మాట తీరు తిన్నగా కనపడలేదు. పక్క రాష్ట్ర మాజీ సీఎం వైఎస్ జగన్ గారి భాషలో చెప్పాలంటే ‘మంచివాడు, సౌమ్యుడు’ అయిన అయోధ్యారెడ్డి గారి పుస్తకావిష్కరణ కార్యక్రమంలో శర్మ గారు కాస్త కులద్వేషం, శానా శానా పత్రికాద్వేషం రంగరించి ఇలా ఈనాడు గురించి వ్యాఖ్యానించారనే భావన కలిగింది. ఈనాడు పత్రిక వాళ్లు ఆమోదించిన లేదా నేర్పించిన భాషతోనే వేలాది మంది తెలుగు జర్నలిస్టులు బతికారు. ఇప్పుడూ బాగానే జీవిస్తున్నారు. కోట్లాది మంది తెలుగు జనం వారు రాసిన, దిద్దిన వార్తలను ఈనాడులో చదువుకుని సమాచారం తెలుసుకుంటున్నారు. ఉన్నంతలో తమ పరిజ్ఞానం పెంచుకుంటున్నారు.
‘ఈనాడు భాష’ గురించి మాట్లాడే హక్కు సనాతన బుద్ధిజీవులకు లేదా?
మరి శర్మగారు ఇంతగా విర్రవీగి, వినమత్రత వెల్లివిరిసే చిరునవ్వుతో ప్రసంగించడానికి (ఈ సభలో చెప్పుకున్నట్టు) ఆయన మొదట పనిచేసిన ‘విపుల’గాని, చివరిసారిగా ‘సంపాదకత్వం’ వహించిన ‘నవ్య’గాని ఇప్పుడు లేవు. మరి ఎందుకు ఆయన ‘నిర్హేతుకమైన అసహ్యం’ వంటి వ్యతిరేక భావనతో ఈనాడు భాషపై అలా మాట్లాడారో అర్ధంకావడం లేదు. తెలుగుభాష గురించి సాధికారికంగా మంచి చెడ్డలు చెప్పే సత్తువ, ఓపిక ఉన్న రాచమల్లు రామచంద్రారెడ్డి, రంగనాయకమ్మ వంటి మార్క్సిస్టు ఆలోచనాపరులే ఎన్నడూ ఈనాడు భాషను ఈ సోమయాజుల శర్మగారిలా పెద్దగా తప్పుపట్ట లేదు. మహాకవి కె.శివారెడ్డి గారి దగ్గర ఇంగ్లిష్ గ్రామర్ నేర్చుకున్నానని తన ప్రసంగంలో శర్మగారు చెప్పడం నిజంగా గొప్ప విషయం. అలా అని శర్మగారి మొన్నటి మాటలకు, వాఖ్యలకు శివారెడ్డి గారిని బాధ్యులను చేయడం భావ్యం కాదు. ద్వారకా హోటల్లో ఎన్ని గంటలు తనతోపాటు టీనీళ్లు తాగుతూ గడిపినా అక్కడికొచ్చిన కవులు, రచయితల బయటి ప్రవర్తనకు శివారెడ్డి గారిని తప్పుపట్టడం న్యాయం కూడా కాదు. అయ్యలసోమయాజుల, అప్పాజోశ్యుల వంటి మంచి ఇంటిపేర్లున్న వారు జగన్నాథ శర్మగారిలా ఈనాడు భాష గురించి, ఈనాడు ఉజ్జోగాల గురించి పై మాదిరిగా వ్యాఖ్యానించడం చాలా బాగోదని నాకనిపిస్తోంది. శర్మగారు, ఆయన వంటి సనాతన తెలుగు బుద్ధిజీవులు ఈ ధోరణిని ఇలాగే కొనసాగిస్తే…బీజేపీ మాజీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుగారు, ఏపీ మాజీ చీఫ్ సెక్రెటరీ, తెలుగు బ్రాహ్మణ సంఘాల పెద్ద దిక్కు ఐవైఆర్ కృష్ణారావు గారు బ్రామ్మలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం ఒక మోస్తరుగానైనా పెంచడానికి చేస్తున్న ప్రస్తుత ప్రయత్నాలు ఫలించవు. చివరికి తూర్పు కాపు భర్త కారణంగా జనసేన పార్టీ తరఫున ఉమ్మడి విజయనగరం జిల్లా నెల్లిమర్ల నుంచి ఏపీ అసెంబ్లీకి ఎన్నికైన లోకం నాగ మాధవి వంటి (అమెరికాలో చదివి పైకొచ్చిన) బ్రాహ్మణ మహిళలే ఈ సనాతన సామాజికవర్గానికి దిక్కు అవుతారు.