Jadcherla: జడ్చర్లలో టిపిసిసి ప్రధానకార్యదర్శి జనంపల్లి అనిరుథెడ్డి సరికొత్త ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. 2018 ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన లక్ష రూపాయల రైతురుణ మాఫీ పథకం 4 సంవత్సరాలు కావొస్తున్నా అమలు కాకపోవడంతో.. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి దరఖాస్తుల ఉద్యమం చేపట్టనున్నారు. సోమవారం నుంచి చేపట్టే ఈ కార్యక్రమానికి జడ్చర్ల నియోజకవర్గంలోని మొత్తం అన్నీ గ్రామాల రైతుల నుంచి ధరఖాస్తులు స్వీకరించనున్నారు. అనంతరం స్వీకరించిన దరఖాస్తులను సీఎం కేసీఆర్, జిల్లా కలెక్టర్లకు, మండల అధికారులతో పాటు.. టిపిసిసి రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లుభట్టివిక్రమార్క కు ఆయన అందజేయనున్నారు.
కాగా తెలంగాణ రాష్ట్రంలోని రైతాంగం కోసం చేపట్టిన మొట్టమొదటి కార్యక్రమంగా రైతు దరఖాస్తు ఉద్యమం నిలిచిపోతుందని అనిరుథ్ అన్నారు. ఈ ఉద్యమం ద్వారా తెలంగాణలోని రైతాంగానికి.. ముఖ్యంగా జడ్చర్ల రైతులకు మేలు జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రైతుల శ్రేయస్సు కోసం చేపట్టిన ఉద్యమంలో రైతాంగం పెద్ద ఎత్తున పాల్గొని తమ దరఖాస్తులను సమర్పించాలని ఆయన కోరారు. రైతాంగం సంక్షేమం కోసం చేపట్టిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని కాంగ్రెస్పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్ఎస్ఐ, మహిళా కాంగ్రెస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విభాగాల సభ్యులు పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. రైతాంగం సంక్షేమం కోసం చేపట్టిన ఈ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా ప్రతీ ఒక్కరూ పాల్గొని ప్రభుత్వంపైన ఒత్తిడి తీసుకొచ్చి రైతులకు మేలు జరిగే విధంగా సహకరించాలని అనిరుథ్ రెడ్డి అభ్యర్థించారు.