INCTELANGANA:
డిసెంబర్ 9వ తేది తెలంగాణకు చాలా ప్రత్యేకమైనది. ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా ఒకేరోజు రెండు పండుగలు జరుపుకుంటున్నాం. అవినీతి గడీల పాలనకు చరమగీతం పాడి, ప్రజలు కాంగ్రెస్ గెలిపించి ఏడాది పూర్తయిన సందర్భంగా ‘ప్రజా పాలన విజయోత్సవాల’ పండుగ ఒకవైపు, ఆరు దశాబ్దాల తెలంగాణ కలను సాకారం చేసిన శ్రీమతి సోనియా గాంధీ జన్మదిన ఉత్సవాలు మరోవైపు… ఘనంగా జరుపుకుంటున్నాం.
ఏడేళ్ల వ్యవధిలో దేశం కోసం ఇద్దరు కుటుంబ సభ్యులను పోగొట్టుకున్న సోనియాగాంధీ… జీవితంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. మాజీ ప్రధాని, భర్త రాజీవ్ గాంధీ మరణం తర్వాత కాంగ్రెస్ అధ్యక్షపదవి చేపట్టి, ప్రధానమంత్రి కావాలని యావత్ దేశం కోరినా తిరస్కరించి, రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ‘రాజీవ్ గాంధీ ఫౌండేషన్’ ప్రారంభించి అనేక సేవా కార్యక్రమాలు చేశారు. దేశంలో సంచలనం రేపిన బాబ్రీ మసీద్ అల్లర్లు, గుజరాత్ అల్లర్ల సమయంలో లౌకికవాదానికి ముప్పు వాటిల్లిందని తల్లడిల్లిపోయారు. ఈ అల్లర్లలో, సునామీ విపత్తు కారణంగా అనాథలైన పిల్లలకు చదువు చెప్పించడంతో పాటు అన్ని రకాల సహాయసహకారాలు అందించారు.
దేశంలో కుల, మత రాజకీయాలు పెరిగిపోవడంతో లౌకికవాదంతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా బలహీన పడడంతో, పార్టీలోని సీనియర్ నాయకుల ఒత్తిడితో సోనియాగాంధీ 1998లో పార్టీ అధ్యక్ష పదవి చేపట్టారు. 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ 114 స్థానాలు గెలవడంతో ప్రతిపక్ష నేతగా ప్రజల గొంతుకయ్యారు. ‘‘షైనింగ్ ఇండియా’’ అంటూ గారడి మాటలతో గడిపిన వాజ్ పేయ్ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంపై అలుపెరగని పోరాటం చేశారు. 2004 ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ హస్తం.. పేదల నేస్తం అనే నినాదం ఇచ్చి దేశ ప్రజల మనసులను గెలుచుకోవడంతో పాటు, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమిని అధికారంలోకి తీసుకొచ్చారు.
ఓటమిని ఓర్చుకోలేక బీజేపీ సోనియాగాంధీపై కక్షగట్టి అనేక రకాలుగా అడ్డుడింది. విదేశీ మహిళ ప్రధానమంత్రి అయితే తాను గుండు గీయించుకుని తెల్లచీర కట్టుకుంటానని బీజేపీ నాయకురాలు సుష్మా స్వరాజ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. అయినా, ఆమెపై కక్ష పెంచుకోకుండా సుష్మాస్వరాజ్ బతికున్నంత కాలం సోనియాగాంధీ ఆమెతో సన్నిహితంగా మెలిగారు. ‘‘ఇది నా నేల. నేను మట్టిలో కలిసినంత కాలం నేను భారతీయురాలినే. ప్రజలు నన్ను విదేశీయురాలిగా చూస్తున్నారని నేనెప్పుడూ భావించలేదు.’’ అని పరిణితితో మాట్లాడటమే కాకుండా, తనకు పదవి కంటే దేశం సుభిక్షంగా ఉంటే చాలు అని ప్రధాని పదవిని త్యాగం చేశారు. దేశాభివృద్ధి కోసం అనుభవజ్ఞుడైన ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్, ప్రధానమంత్రి పదవి చేపట్టేందుకు కృషి చేయడంతోపాటు ఆయనకు 10 సంవత్సరాలు సంపూర్ణ మద్దతు అందజేశారు.
దేశ సమస్యలను దృష్టిలో ఉంచుకొని ‘కామన్ మినిమమ్ ప్రోగ్రాం’ను రూపొందించి అనేక విప్లవాత్మక పథకాల అమలు చేసిన ఘనత సోనియాగాంధీకే దక్కుతుంది. సమాచార హక్కు చట్టం, ఆహార భద్రత చట్టం, విద్యాహక్కు చట్టం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ వంటి దేశం గర్వించే పథకాలను ప్రవేశపెట్టడంలో ఆమె కృషి వెలకట్టలేనిది. సోనియా యూపీఏ చైర్మన్ గా ఉన్నప్పుడే చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టారు. అప్పుడే, దేశానికి తొలి మహిళా రాష్ట్రపతిగా ప్రతిభా పాటిల్, తొలి దళిత మహిళా స్పీకర్ గా మీరా కుమార్ ఎన్నికయ్యారు. మహిళలకు ఆమె ఇచ్చే ప్రాధాన్యతకు ఇదే నిదర్శనం. ఆమె అంకితభావం, దార్శనికతకు గుర్తింపుగా 2007, 2013లో ఫోర్బ్స్ పత్రిక సోనియా గాంధీని ప్రపంచంలోనే మూడో అత్యంత శక్తివంతురాలైన మహిళగా పేర్కొంది. 2007, 2008 సంవత్సరాలకు గాను టైమ్ పత్రిక 100మంది అత్యంత ప్రభావవంతులైన వ్యక్తుల జాబితాలో ఆమెను చేర్చింది.
తెలంగాణపై సోనియాగాంధీకి ఉన్న ప్రేమ ప్రత్యేకమైంది. కేసీఆర్ 2001లో టీఆర్ఎస్ స్థాపించక ముందే, తెలంగాణకు చెందిన 41 మంది ఎమ్మెల్యేలు రాష్ట్ర ఏర్పాటును కోరుతూ సోనియాగాంధీకి వినతిపత్రం ఇచ్చినప్పుడు ‘‘మీ సమస్యలు నాకు తెలుసు, తెలంగాణ ఏర్పాటు గురించి ఆలోచిస్తాను’’ అని చెప్పారు. సోనియా ఒక్కసారి సరే అన్నారంటే దానికి తిరుగుండదు. ఇచ్చిన మాట ప్రకారం ఆమె వెంటనే, ఏఐసీసీ తరఫున తెలంగాణ రాష్ట్రం కోసం రెండవ రాష్ట్ర పునర్విభజన సంఘాన్ని ఏర్పాటు చేయాలని అప్పటి ఎన్డీఏ ప్రభుత్వానికి లేఖ రాయగా…ఆనాటి హోం మంత్రి ఎల్.కే అద్వానీ దానిని తిరస్కరించారు. కాంగ్రెస్ అధికారంలో వచ్చాక, రాష్ట్ర విభజనతో రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ లో నష్టం జరుగుతుందని తెలిసినా, అవకాశవాద రాజకీయాలకు పాల్పడకుండా తెలంగాణ ఇచ్చి మాట నిలబెట్టుకున్న త్యాగశీలి సోనియా గాంధీ.
నాడు తెలంగాణ ప్రతిపాదనను తిరస్కరించిన అద్వానీ, బీజేపీ నేతలు, మనస్పూర్తిగా కాకుండా తప్పని పరిస్థితుల్లో మాత్రమే పార్లమెంటులో తెలంగాణ ఏర్పాటుకు మద్దతిచ్చారు. తెలంగాణ ఏర్పాటులో మా పాత్ర కూడా ఉందని రాష్ట్ర బీజేపీ నేతలు ఒకవైపు చెబుతుంటే, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాత్రం తెలంగాణ ఏర్పాటుపై ‘తల్లిని చంపి బిడ్డను తీశారు’ అంటూ అవమానకరమైన రీతిలో చేసిన వ్యాఖ్యలే బీజేపీ ద్వంద వైఖరిని నిరూపిస్తున్నాయి. తెలంగాణ ఏర్పాటు చేస్తే తమ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తామని, తాము సోనియా గాంధీకి ఎంతో రుణపడి ఉన్నామని కుటుంబ సమేతంగా సోనియాని కలిసి చెప్పిన కేసీఆర్ మోసం చేశారు. సెంటిమెంట్ పేరుతో పదేళ్లు అధికారంలో ఉండి నిరంకుశంగా పాలించి, అవినీతికి పాల్పడి రూ. 16 వేల కోట్ల మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని రూ.7 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టారు.
తెలంగాణ కోసం కొట్లాడింది సబ్బండ వర్గాలైతే, రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియా గాంధీ అని భావించిన రాష్ట్ర ప్రజలు ఇంకోసారి కేసీఆర్ సెంటిమెంట్ కు మోసపోకుండా 2023లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపించారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ మార్గదర్శకంలో అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనేక ప్రజా సంక్షేమ నిర్ణయాలు తీసుకుంది. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల లోపు విద్యుత్ ఉచిత విద్యుత్ పథకాలు అమలు చేస్తోంది. ఏడాది కాలంలో 55,143 ఉద్యోగాలు భర్తీ చేసింది. రూ.2 లక్షల వరకు ఉన్న రైతు రుణమాఫీ, వరికి రూ.500 బోనస్ అమలు చేసింది.ఈ సంక్రాంతికి రైతు భరోసా నిధులు కూడా జమ చేయబోతోంది. స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు, నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని కూడా ప్రారంభించింది. అమరువీరులు ఆదుకునేలా చర్యలు తీసుకుంటోంది.
ఇచ్చిన మాట ప్రకారం… వచ్చే నాలుగేళ్లలో అన్ని హామీలు అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చకచక అడుగులు వేస్తోంది. కేసీఆర్ రాచరీక వ్యవస్థకు చరమగీతం పాడుతూ తెలంగాణ గీతాన్ని ప్రజలకు అంకితమిచ్చింది. తెలంగాణ చరిత్రను,ఆత్మ గౌరవాన్ని, ఉద్యమ స్ఫూర్తిని, వేష, భాషలను చాటి చెప్తూ జాతిని జాగృత పరిచే తెలంగాణ తల్లి విగ్రహాం ముందు, తన పిల్లలు ప్రణమిల్లే శుభ తరుణం కూడా వచ్చేసింది. ఈ శుభ సందర్భంలో ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుకోవడం ఒక పండుగ.
అనేక త్యాగాలకు ఓర్చుకుంటూ దేశ సంక్షేమం కోసం విప్లవాత్మక పథకాలను తీసుకొచ్చిన సోనియాగాంధీ భారత దేశ చరిత్రలో ఒక ఉక్కు మహిళగా నిలిచిపోయారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై అడుగడుగునా అవకాశవాద రాజకీయాలకు పాల్పడినా, ఇచ్చిన మాటకు కట్టుబడాలనే ఒకే ఒక బలమైన సంకల్పంతో ఆరు దశబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడానికి ఎన్నో అడ్డుకుంలు ఎదురైనా జంకకుండా తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా జన్మదినం ఇంకో పండగ. ముక్కోటి గొంతులు మురిసిపోయే ఈ తరుణానికి యావత్ తెలంగాణ సాక్షి!
-బి.మహేశ్ కుమార్ గౌడ్,
ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షులు.