ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా.. సీఎంగా ఫడ్నవీస్?

ఊహించినట్లగానే మహారాష్ట్ర రాజకీయ సంక్షోబానికి తెరపడింది. బలపరీక్షకు ముందే సీఎం పదవికి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేశారు. గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ నిర్ణయంపై సుప్రీంకోర్డు వెళ్లిన శివసేనకు ఎదురుదెబ్బతగిలింది. ఎట్టి పరిస్థితుల్లోనూ మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష జరగాల్సిందేనని ధర్మాసనం తీర్పు వెలువరించిన.. క్షణాల్లోనే సోషల్ మీడియా వేదికగా ఠాక్రే తన రాజీనామా ప్రకటించారు. ఎమ్మెల్సీ పదవికి సైతం తాను రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇన్నాళ్లు సహకరించిన సోనియాగాంధీ, శరద్ పవర్ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు ఠాక్రే.

ఇక శివసేన తిరుగుబాటు నేత శిందే పై పరోక్షంగా ఆరోపణలు చేశారు ఠాక్రే. నమ్మకంతో రిక్షావాలాను తీసుకొచ్చి మంత్రిని చేస్తే.. ద్రోహం చేశారంటూ మండిపడ్డారు. ధర్మాసనం తీర్పును గౌరవిస్తున్నట్లు.. ప్రజాస్వామ్యానికి అనుగుణంగా నడుచుకుంటానని స్పష్టం చేశారు.బాలాసాహెబ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని అన్నారు. రెబల్ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతామని ఠాక్రే వెల్లడించారు.

అటు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్.. ముంబైలోని తాజ్ హెటల్లో బీజేపీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఠాక్రే సీఎం పదవికి రాజీనామా చేశారని తెలియగానే బీజేపీ శ్రేణులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. ప్రస్తుత బలబలాలను బట్టి ఫడ్నవీస్ సీఎం కావడం తథ్యమని స్పష్టమవుతోంది.