‘అఫైర్‌’..దాంపత్యంలో సంక్షోబం.. కాబోయే బ్రిటన్‌ ప్రధాని లైఫ్ సీక్రెట్..

ప్రత్యేక వ్యాసం: 

===========

రాజకీయ గురువుతో ‘అఫైర్‌’ నుంచి బయటిపడి భర్తతో దాంపత్య జీవితాన్ని కాపాడుకున్న కాబోయే బ్రిటన్‌ ప్రధాని లిజ్‌ ట్రస్‌ నిజంగా గ్రేట్‌
=============
బ్రిటిష్‌ ప్రధాన మంత్రిగా ఎన్నికైన మేరీ ఎలిజబెత్‌ ట్రస్‌ (47) దాంపత్య జీవితానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయం ఇప్పుడు మీకూ చెప్పాలనిపించి రాస్తున్నాను. బోరిస్‌ జాన్సన్‌ రాజీనామాతో పాలకపక్షమైన కన్సర్వేటివ్‌ పార్లమెంటరీ పార్టీ నాయకత్వం కోసం భారత పంజాబీ ఖత్రీ రిషి సునక్‌ నుంచి ఎదురైన పోటీలో విజేతగా నిలిచిన లిజ్‌ ట్రస్‌ జీవిత విశేషాలు రెండు నెలల క్రితం చదివినప్పుడు ఈ విషయం తెలిసింది. కలిసి పనిచేసిన తోటి అకౌంటెంట్‌ హ్యూ ఓ లియరీ(48)ని ఆమె 2000లో పెళ్లాడింది. మూడేళ్ల స్నేహం తర్వాత వారి గాఢ ప్రేమ పెళ్లికి దారితీసింది.

అయితే, ఇద్దరు ఆడపిల్లలు పుట్టిన తర్వాత కన్సర్వేటివ్‌ పార్టీ మాజీ ఎంపీ మార్క్‌ ఫీల్డ్‌ తో కొన్నాళ్లు సాగిన ఆమె ‘అఫైర్‌’ 2006లో బయటి ప్రపంచానికి వెల్లడవడంతో లిజ్, హ్యూల సంసారం ‘కూలిపోయే’ పరిస్థితి ఎదురైంది. భార్యాభర్తల మధ్య కొనసాగుతున్న ప్రేమానురాగాలు ఈ ఇబ్బందిని జయించాయి. భర్త హ్యూ ఆమె అఫైర్‌ ను అర్ధం చేసుకున్నాడు. గతాన్ని మరిచి వారిద్దరూ జీవితంలో ముందుకు సాగిపోయారు. కన్సర్వేటివ్‌ పార్టీలో తనకు బాగా జూనియర్‌ అయిన లిజ్‌ తనకు సహాయకురాలిగా ఉండగా ఈ సంబంధాన్ని ఎంపీ మార్క్‌ ఫీల్డ్‌ ‘అఫైర్‌’గా మార్చుకున్నాడు. లిజ్‌ కూడా మార్క్‌ కు ఉన్న హోదా, అధికారం కారణంగా అందుకు అంగీకరించిదని అంటారు. మొత్తానికి ‘వివాహేతర సంబంధం’ ఈ చక్కటి యువ భార్యాభర్తలను విడదీయలేకపోయింది.దాంపత్యంలో చెలరేగిన సంక్షోభం వారి బంధాన్ని మరింత బలోపేతం చేసింది.

మార్క్‌ భార్య మాత్రం అతన్ని క్షమించలేక విడాకులిచ్చింది!
––––––––––––––––––––––––––––––––––––
మార్క్‌ ఫీల్డ్‌ (57) 2001–2019 మధ్య లండన్, వెస్ట్‌మినిస్టర్‌ పార్లమెంటు సభ్యుడు. లిజ్‌ ట్రస్‌ తనకు సహాయకురాలిగా ఉండగా 2004–2006 మధ్య కాలంలో ఆమెతో మార్క్‌ సన్నిహిత సంబంధం కొనసాగించారు. విషయం బట్టబయలయ్యాక ఆయన మొదటి భార్య మిషెల్‌ యాక్టన్‌ 2006లో మార్క్‌ కు విడాకులిచ్చారు. పూర్వ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్‌ అయిన మిషెల్, మార్క్‌ 1996లో పెళ్లిచేసుకున్నారు. లిజ్‌ తో మార్క్‌ అఫైర్‌ ను మన్నించలేని మిషెల్‌ వెంటనే డైవోర్స్‌ అడిగి తీసుకున్నారు. మరుసటి సంవత్సరమే 2007లో సెలబ్రిటీ ఏజెంట్‌ విక్టోరియా ఎల్ఫిక్‌ ను వివాహమాడారు మార్క్‌ ఫీల్డ్‌. ఈ వ్యక్తిగత సంక్షోభం నుంచి సురక్షితంగా బయటపడిన లిజ్‌ ట్రస్‌ భర్త హ్యూ ఓ లియరీని ఆమెకు మార్క్‌తో నడిచిన సంబంధం గురించి 2006లో ప్రశ్నించగా, ‘దాని గురించి నేను మాట్లాడాలనుకోవడం లేదు,’ అని జవాబిచ్చారు. ఆ తర్వాత ఈ అఫైర్‌ గురించి అడిగితే, లిజ్‌ కూడా దాని వివరాల్లోకి పోకుండా, ‘మేం నిజంగా ఇప్పుడు సంతోషకరమైన దాంపత్య జీవితం గడుపుతున్నాం,’ అని మూడు ముక్కల్లో చెప్పింది.

పారిశ్రామికంగా అభివృద్ధిచెందిన పాశ్చాత్య దేశాల్లో భర్త వివాహేతర సంబంధాన్ని భార్యగాని, అలాగే ఆలి లవ్‌ అఫైర్‌ ను పెనిమిటి గాని అంత తేలికగా క్షమించరనే విషయం భారతీయులు చాలా మందికి తెలియదు. అందుకే, ప్రఖ్యాత గోల్ఫ్‌ ఆటగాడు టైగర్‌ వుడ్స్‌ గతంలో కొందరు పెయిడ్‌ కాల్‌ గాల్స్‌తో గడిపాడనే కారణంగా అతని స్వీడిష్‌ భార్య ఎలిన్‌ నూదెగ్రెన్‌ పెళ్లయిన ఆరేళ్లకే విడాకులిచ్చింది. పసుపు, నలుపు, తెలుపు వంటి బహుళ జాతుల తల్లిదండ్రులకు పుట్టిన టైగర్‌ వుడ్స్‌తో 2004లో అయిన పెళ్లిని 2010లో ఎలిన్‌ రద్దుచేసుకుంది. టైగర్‌ ఎంత బతిమాలినా అతన్ని క్షమించి వదిలిపెట్టలేదు.

మళ్లీ లిజ్‌ ట్రస్‌ విషయానికి వస్తే–2004–2005 మధ్య పార్టీలో జూనియర్‌ అయిన లిజ్‌ కు రాజకీయ గురువుగా (పొలిటికల్‌ మెంటర్‌) మార్క్‌ ఫీల్డ్‌ ను కన్సర్వేటివ్‌ పార్టీ నియమించింది. రాజకీయ పెద్దగా ఉన్న మార్క్‌ తన కన్నా వయసులో పదేళ్ల చిన్నదైన లిజ్‌ ను వ్యక్తిగతంగా ఉపయోగించుకునే స్థితికి తీసుకువచ్చేరనే ఆరోపణ ఎదుర్కున్నారు. అధికారంలో ఉన్నవారు (ముఖ్యంగా మగవాళ్లు) తమ కన్నా తక్కువ హోదాలో ఉన్న వారిని లైంగికంగా ఉపయోగించుకోకూడదనే విలువైన సూత్రాన్ని పాశ్చాత్య ప్రపంచం ఇంకా పాటిస్తోంది. ఈ కారణంగానే వైట్‌ హౌస్‌ ఇంటర్న్‌ గా చేరిన మోనికా లూయిన్క్సీ అనే తన కూతురు వయసు యువతిని లైంగికంగా లొంగదీసుకున్నాడనే అభియోగంతో అమెరికా అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ ను అమెరికన్‌ సమాజం అభిశంసించింది.

అలాగే, తన భర్త చేసిన లైంగిక, నైతిక నేరం సంగతి తెలిసి కూడా అమెరికా ‘ఫస్ట్‌ లేడీ’ అనే హోదా కాపాడుకోవడానికి క్లింటన్‌ భార్య హిలరీ ఈ కేసు విచారణలో అబద్ధమాడింది. తన భర్త సచ్ఛీలుడు, ఏకపత్నీవ్రతుడు అని సర్టిఫికెట్‌ ఇచ్చింది. ఇంతటి పెద్ద అబద్ధం చెప్పిన నేరానికి హిలరీ క్లింటన్‌ 2016 నవంబర్‌ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆ పదవి చేపట్టే అర్హతే లేని రిపబ్లికన్‌ అభ్యర్థి డోనాల్డ్‌ ట్రంప్‌ చేతిలో ఓడిపోయింది. ఏదేమైనా, కాబోయే యునైటెడ్‌ కింగ్‌డమ్‌ ప్రధాని ఎలిజబెత్‌ మేరీ ట్రస్‌ దాంపత్య జీవితం ఆదర్శప్రాయం.

 

వ్యాసకర్త :

Nancharaiah merugumala (సీనియర్ జర్నలిస్ట్)