అండర్ -19 ప్రపంచ కప్ లో భారత అమ్మాయిలు చరిత్ర సృష్టించారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తొలిసారి నిర్వహించిన టీ 20 ప్రపంచ కప్ ఫైనల్లో.. క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లాండ్ పై గెలిచి భారత మహిళా క్రికెట్లో సరికొత్త అధ్యాయం లిఖించారు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన బ్రిటిష్ జట్టు 68 పరుగులకే కుప్పకూలింది. భారత్ బౌలర్లు నిప్పులు చెరిగే బంతులతో .. ఇంగ్లీష్ బ్యాట్స్ మెన్స్ ను ముప్పు తిప్పలు పెట్టారు. కెప్టెన్ షేఫాలి వర్మ .. వ్యూహాత్మక నిర్ణయాలతో .. బౌలర్లను మారుస్తూ.. ఏ దశలోనూ ప్రత్యర్థి జట్టుకు అవకాశం ఇవ్వకుండ జాగ్రత్త పడింది. భారత బౌలర్లలో సాధు, అర్చనా దేవి చెరో 2 వికెట్లు తీయగా . కశ్యప్, షేఫాలి, సోనమ్ తలా వికెట్ పడగొట్టారు.
ఇక స్వల్ప లక్ష్య చేధనలో బరిలోకి దిగిన భారత జట్టు ..14 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.తెలుగమ్మాయి గొంగిడి త్రిష 24 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచింది. కెప్టెన్ షేఫాలి వర్మ 15 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరింది. ఇంగ్లీష్ జట్టులో అలెక్సా స్టోన్హౌస్,గ్రేస్, బాకర్ తలా ఓ వికెట్ పడగొట్టారు.