ప్రజల అరికాలి కింద  పచ్చలు పచ్చలుగా పగిలిన ప్రజా యుద్ద నౌక..

ప్రజల అరికాలి కింద పచ్చలు పచ్చలుగా పగిలిన ప్రజా యుద్ద నౌక..

గద్దర్ అనే వాడు చస్తే బాగుండు అని కోరిన ప్రజలు కూడా వుంటారా?వున్నారు. అలాంటి ప్రజలే ఎక్కువ శాతం వున్నారు.పాట గొప్పదే. పాట మాత్రమే గొప్పది. ఆచరణ లేని పాట ప్రజా శత్రువుతో సమానం. “శత్రువుపై జాలి లేని వాడే మన స్నేహితుడు” అని పాట పాడిన చెరబండరాజు పదేపదే గుర్తుకొస్తున్నాడు. గద్దర్ ప్రజా శత్రువు. ఆచరణ లేని సృజన ప్రజాపోరాటాలకు ఏమాత్రం అవసరమే లేదు. ప్రజా యుద్దమే లేకపోతే గద్దర్ లేడు. ప్రజా యుద్దమే లేకపోతే గద్దర్ లాంటి ప్రజా కళాకారులు వుండడానికి సందు దొరికేది కానేకాదు. గద్దర్ పాటలవైపా? ప్రజల పోరాటమా? అని నిలదీసి అడిగితే, ప్రజా పోరాటాలవైపే నా అడుగు అని చెబుతాను. అమరుల కుటుంబాలకు గద్దర్ ఎలా శత్రువయ్యాడో నాకూ అదే కారణంగా శత్రువయ్యాడు.

“నీకూ నాకూ తేడా లేదురో పోలీసన్న” అంటూ పోలీసుల మీద ఎంతో మానవియమైన పాట రాసిన గద్దర్.. నిజంగానే గద్దర్ కు, నిరంకుశ పోలీసులకు ఏమాత్రం తేడా లేదు. ఎంతో మానవీయంగా పాటలు రాసిన ఆయన, అమానవీయ జీవి అనే నిజాన్ని మనమంతా జీర్ణించుకోవడానికి మన గుండెలకు దైర్యం చెప్పుకోవాలి. అమరుల స్తూపాన్ని గడ్డపారలతో, బాంబులతో కూల్చేసిన పోలీసులను, జ్ఞాపకాలను సైతం కాలరాసే నిరంకుశ అమానవీయ ప్రభుత్వాలను ప్రజలంతా ఎంతగా ద్వేషించి వుంటారో అంతే సమానంగా గద్దర్ ను ద్వేషిస్తున్నారని మనమంతా అర్దం చేసుకోవడంలో విఫలమయ్యాం. ప్రజలంతా కొట్లాడి స్వాధీనం చేసుకున్న ప్రజాభూమిలో అమరుల కుటుంబాలు స్తూపాన్ని కట్టుకుంటే, ఆ భూమిపై కన్ను పడ్డ గద్దర్, స్థూపాన్ని కూల్చివేయాలని అలోచన చేసిన గద్దర్, పోలీసు హింసాఖాండ మీద పాట రాసిన గద్దర్, పోలీసులను గూండాలను వాడుకొని ప్రజలను కొట్టించిన గద్దర్, అమరుల స్తూపాన్ని కట్టుకున్న తల్లితండ్రులను ఇంటి నుంచి రోడ్డుకు కొట్టుకుంటూ ఊరేగింపు చేసిన గద్దర్, వందల ఎకరాలు భూమి పంచే పీపుల్స్ వార్ పార్టీకి వెతిరేకంగా భూమిని సొంతం చేసుకోవాలని పదకాలు వేసిన గద్దర్, గూండాగిరి అలవాటు వున్న గద్దర్, దోపిడికి వెతిరేకంగా పాట రాసిన గద్దర్, దేహంలో బులెట్టు మోస్తూ సులువుగా దోపిడీ చేయగల గద్దర్.. ముమ్మాటికీ ప్రజా శత్రువే! ఎప్పటికీ ప్రజాశత్రువే! (అతడు దేహంలో బులెట్టు మోసినందు కారణంగా విమర్శించే అర్హత మనకు ఏమాత్రంలేదని అనుకోవద్దు. ప్రజా శతృవుపై ఏమాత్రం జాలి లేని వాళ్ళం. అందు కారణంగా గద్దర్ నే కాదు ఎంతటి విప్లవకారుడైనా, ఎంతటి ప్రజా శత్రువైనా విమర్శించే అర్హత ఈ ప్రపంచంలో పతీ జీవికి ఉన్నది. ఆ అర్హత ప్రజా పోరాటాలే ప్రతీ జీవికీ ఇస్తున్నదని మనం ఏమాత్రం మరవకూడదు. చేగువేరా, భగత్ సింగ్, గద్దర్.. ఎవరైనా సరే, ప్రజా పోరాటాలు లేకుండా వాళ్ళు లేరనే సత్యం మనం మరవకూడదు)

ఒక పసిబాలుడి ధిక్కార పిడికిలి ముందు, నిజమైన ఆచరణ ముందు, ఆచరణ లేని పాటలు “ప్రజల కోసం” అనే పేరుతో గద్దర్ పాడిన పాటలు ఏమాత్రం గొప్పవి కావు. ఏమాత్రం తరువాతి తరం కొనసాగింపుగా ఎంచుకునే వ్యక్తి కానేకదు. ఉత్తి టేప్ రికార్డ్ లో పదేపదే వినిపించే ఓ గీతం మాత్రమే! ఆయన పాటల గురించి ఎన్నో సెమినార్లు పెట్టొచ్చు. ఆయన జీవితం గురించి సెమినార్లు పెట్టాలని అనుకుంటే ఆయన చేతిలో మరియు ఆయన ప్రత్యేకంగా పెట్టిన గూండాల చేతిలో దెబ్బలు తిన్న ప్రజలనే వక్తలుగా పెట్టి సభలు జరపాలి. నిజాలు గట్టిగా మనందరి గొంతులో పలకాలి.ఎన్కౌంటర్ శవాల స్వాధీన కమిటీలో పని చేసిన గద్దర్, చర్చల కాలం తరువాత నక్సలైట్ శవాల దగ్గరికి పోవడం ఆపేశారు. అమరుల కుటుంబాలు పిలిస్తే రాను అని ప్రకటించడమే కాకుండా, నక్సలైట్లు ఏం చేశారు నాలుగు రోజులు జీవించి చచ్చిన వాళ్లు. పాట ద్వారా ప్రచారం చేసిన నేను వాళ్ల కంటే పెద్ద అమరున్ని అని ఎంతో అహంకారం చూపించిన గద్దర్.. మీకేమో గానీ.. ఎందరో అమరుల కుటుంబాలకు శత్రువై నిలబడ్డ గద్దర్.. నాకూ శత్రువే. ముమ్మాటికీ గొంతులో శబ్దాన్ని సుడి తిప్పగల గొప్ప గాయకుడు. పాట అనే మత్తును పక్కన పెడితే.. అతడొక ప్రజాద్రోహి. పైసల మీద ఆస్తుల మీద ఆశ లేదు అని చెప్పుకునే గద్దర్.. నిరంతరం ప్రజలను పలు రకాలుగా హింసించే ప్రజాద్రోహి. ఇదంతా అన్ని ప్రజా సంఘాలకు తెలిసినా గద్దర్ ముందు నోరు విప్పలేవు. అదే అతి పెద్ద ప్రజాద్రోహం. 

బస్తీ జనాన్ని ఇల్లు కాళీ చేయించాలని ఎంతో ప్రయత్నం చేసిన వాడు గద్దర్. కబ్జా చేయాలని చూసి, రౌడీలను పెట్టించి కొట్టిన గద్దర్. పేద ప్రజలను నిత్యం హింసించే గద్దర్. ప్రజలను ప్రేమిస్తూ నిత్యం ప్రజల పక్షాన నిలబడాలని అనుకునే నేను.. ఈ అమానవీయమైన దుర్మార్గమైన గద్దర్ ను నేను ఎలా ప్రేమించగలను. సారీ, నువ్వు మాత్రం ఎలా ప్రేమించగలవు!ఒక్కప్పుడు నక్సలైట్ శవాలను హత్తుకునే గద్దర్.. ఆ అమరుల కుటుంబాలను కన్నెత్తి కూడా చూడక, ఆచరణ లేని ఉట్టి రాతలను, శత్రువు లక్షణాలను దేహం నిండా నింపుకున్న వాడిని నేను ఎలా హత్తుకోగలను? గద్దర్ కంటే చెరబండరాజు వంద రెట్లు నయ్యం. ఇప్పటికీ నాది ఒకే మార్గం. గద్దరా? చెరబండరాజా? అని అడిగితే.. బల్లగుద్ది చెబుతాను చెరబండరాజు మాత్రమేనని. ప్రజామార్గమేనని. నిత్యం ప్రజల వైపు నిలబడ్డ చెరబండరాజువైపే నేనూ వుంటాను. మీ సంగతి నాకు తెలియదు. ప్రజా పోరాటాలవైపే నేను. అమరుల కుటుంబాల వైపే నేను.

సృజన కొందరిలోనే పుట్టదు.

సృజనగా బతికే వాళ్లు ఎందరెందరో..

ఒరిగిపోతున్నవాళ్లు

పువ్వై పూస్తున్నవాళ్లు

రేపటి మీద ఆశలున్న వాళ్ళు

వసంతం కోసం ఎదురుచూస్తున్న వాళ్ళు 

వసంతమై జీవిస్తున్నవాళ్ళు!

_ దొంతం చరణ్ 

(ఈ రాతలకు సోర్స్ భాదితులు మాత్రమే. జనం మాత్రమే. విక్కిపీడియా కాదు. విప్లవోద్యమం గద్దర్ ను బరించింది అనే మాటను ప్రజల నోటి నుండే విన్నాను. కాని ప్రజలు ఏమాత్రం బరించే స్థితిలో లేమని ఏనాడో ప్రకటించారు. ఇప్పటికీ ప్రజలది అదే స్టాండ్.)