దిలీప్ రెడ్డి ( సీనియర్ జర్నలిస్ట్):
ఈ తరం ఎవరైనా…. వీటివైపు చూస్తున్నారా? ఇవి కొనడం, చదవటం కాకపోయినా, వీటి సారమేమని అయినా ఆలోచిస్తారా? ఎవరీ కార్ల్ మార్క్స్ ? ఏంటీయన బాధ! అనైనా అనుకుంటారా? ప్చ్, నాకైతే అనుమానమే! మానవేతిహాస గమనం గూర్చి…. అక్కడో, ఇక్కడో నాలుగక్షరాలు చదివితేగా … ఆయనెవరు? ఏంటి? తెలిసేది! ఆ మాటకొస్తే…. అసలు ‘చదవటం’ అనే లక్షణమే కనుమరుగవుతోంది ఈ తరం జనాల్లో! ఇది నా casual statement కాదు. ఓ జర్నలిజం స్కూల్ కి 6 బ్యాచ్ ల పాటు ప్రిన్సిపల్ గా, సుమారు రెండు వేల మంది…. జర్నలిస్టు కాగోరిన గ్రాడ్యుయేట్లను ఇంటర్వ్యూ చేసిన అనుభవంతో చెబుతున్నా! నేనీ ప్రశ్న నిర్దిష్టంగా అడిగేది, “పుస్తకాలేమైనా చదివావా?” “ఉహూ….” తడుముకోకుండా, తడబాటు లేకుండా వచ్చేది జవాబు. కడకు జర్నలిస్టుల్లో కూడా చదివే తత్వం నశిస్తోంది అంటే అతిశయోక్తి కాదు. ఇదివరకు వాళ్ల పేపరు వాళ్లో, కనీసం తను రాసిన వార్త/స్టోరీ తానో…. చదువుకునేది. ఇప్పుడు అదీ లేదు. ఏం చదువకుండా ఎలా ఎదుగుతారు? ఎదగడమంటే, మళ్లీ దాని లెక్కలు దానికుంటాయ్, ఇక ఇప్పుడా వివాదంలోకి వెళ్లనులే!
‘యుక్తవయసులో కమ్యూనిస్టు భావజాలం లేకుండా, వయసు పైబడ్డాక కూడా ఆ వైఖరి వీడకుండా…. ఎవరైనా వుంటే, వారిలో ఏదో లోపం ఉన్నట్టే లెక్క!’ అనే మాటొకటి చెబుతారు, నిజమేనేమో! అనిపిస్తుంది. సంచులు, సంచులుగా పాత ఇంటి నుంచి కొత్త ఇంటికొచ్చిన పుస్తకాల దొంతరను ఫిల్టర్ చేస్తున్న క్రమంలో….. ఇవాళ చూపు వీటిపై ఆగింది కాసేపు. నేటికీ చెంప చెళ్లుమనిపించే, ఒళ్లు జలదరింప జేసే పెట్టుబడి వ్యవస్థ అవలక్షణాలను ఆనాడే పసిగట్టి, వివరణతో సిద్దాంతీకరించిన సామాజిక శాస్త్రవేత్త మార్క్స్! ‘కోపంతో ఓ జనసమూహం పెట్టుబడి వ్యవస్థను ఉరి తీయాలని ఖరారు చేస్తే, వారికి ఉరితాడు అమ్మజూసే వాడు పెట్టుబడిదారు’అంటారాయన! మనిషి-శ్రమ-ఉత్పత్తి-సంపద-మిగులు-లేమి…. వీటన్నిటి మధ్య ఉండే కార్యకారణ సంబంధాలు, అసలు సిసలు మానవ సంబంధాలు, దోపిడీ వ్యవస్థ బలోపేతమవడం వల్ల తలెత్తే అవమానవ సంబంధాలను…. గుర్తించి, విశ్లేషించి, మార్క్స్ విడమరచినంత గొప్పగా ప్రపంచంలో మరే రాజకీయార్థిక విమర్శకుడూ, నేటికీ… చేయలేదు. ఇతరులతో పోల్చినపుడు మార్క్స్ గొప్పతనమేంటంటే, సమస్యను ఎత్తి చాపి, దాని మూలకారణం వివరించడంతో ఆగిపోకుండా…. ఆచరణాత్మక పరిష్కారాలూ చెప్పినవాడాయన. మహానుభావుడు!